కొందరు మనుష్యులు నన్ను చంపాలని చూస్తున్నారు. ఆ ప్రజలు నిరాశచెంది, సిగ్గుపడేలా చేయుము. వారు మళ్లుకొని పారిపోయేట్టు చేయుము. ఆ మనుష్యులు నాకు హాని చేయాలని తలస్తున్నారు. వారిని ఇబ్బంది పెట్టుము.
“యెహోవా, నీ వంటివాడు ఒక్కడూ లేడు. యెహోవా, బలవంతుల నుండి పేదవారిని నీవు రక్షిస్తావు. దోచుకొను వారి నుండి నిస్సహాయులను పేదవారిని నీవు రక్షిస్తావు” అని నా పూర్ణ వ్యక్తిత్వంతో నేను చెబతాను.
ఆ మనుష్యుల కోసం విచార సూచక వస్త్రాలు నేను ధరించాను. ఆ మనుష్యులను నా స్నేహితులుగా, లేక నా సోదరులుగా నేను భావించాను. ఒకని తల్లి చనిపోయినందుకు ఏడుస్తున్న మనిషిలా నేను దుఃఖించాను. ఆ మనుష్యులకు నా విచారాన్ని తెలియజేసేందుకు నేను నల్లని వస్త్రాలు ధరించాను. దుఃఖంతో నేను నా తల వంచుకొని నడిచాను.
అయితే నేను ఒక తప్పు చేసినప్పుడు ఆ మనుష్యులే నన్ను చూసి నవ్వారు. ఆ మనుష్యులు నిజంగా స్నేహితులు కారు. వాళ్లు నా చుట్టూరా చేరి, నా మీద పడ్డారు. వాళ్లను నేను కనీసం ఎరుగను.
నా ప్రభువా, ఎన్నాళ్లు ఇలా చెడు కార్యాలు జరుగుతూండటం చూస్తూ ఉంటావు? ఆ మనుష్యులు నన్ను నాశనం చేయాలని చూస్తున్నారు. యెహోవా, నా ప్రాణాన్ని రక్షించుము. ఆ దుర్మార్గుల బారి నుండి నా ప్రియ జీవితాన్ని రక్షించుము. వాళ్లు సింహాల్లా ఉన్నారు.
నా శత్రువులు అందరూ నిరాశచెంది, ఒక్కుమ్మడిగా సిగ్గుపడేలా చేయుము. నాకు కీడు జరిగినప్పుడు ఆ మనుష్యులు సంతోషించారు. తాము నాకంటె మేలైనవారము అని వారు తలచారు. కనుక ఆ మనుష్యుల్ని అవమానంతోను సిగ్గుతోను నింపి వేయుము.