1
|
సోదరులారా! నేను మీకు ప్రకటించిన సువార్తను విని దాన్ని సంపూర్ణంగా విశ్వసించారు. దాన్ని మీకు మళ్ళీ జ్ఞాపకం చెయ్యాలని నా ఉద్దేశ్యం. |
2
|
నేను బోధించిన సువార్తను మీరు విడవకుండా అనుసరిస్తే అది మీకు రక్షణ కలిగిస్తుంది. లేనట్లయితే మీ విశ్వాసం వృధా అయిపోతుంది. |
3
|
నేను పొందిన దాన్ని మీకు మొదట అందించాను. లేఖనాల్లో వ్రాయబడిన విధంగా క్రీస్తు మన పాపాల నిమిత్తం మరణించాడు. |
4
|
లేఖనాల్లో వ్రాయబడిన విధంగా ఆయన పాతి పెట్టబడి మూడవ రోజున బ్రతికింపబడ్డాడు. |
5
|
పేతురుకు కనిపించాడు. ఆ తదుపరి పన్నెండు మందికి కనిపించాడు. |
6
|
ఒకేసారి ఐదు వందల మందికి కనిపించాడు. వాళ్ళలో చాలా మంది ఇంకా జీవించివున్నారు. కొందరు మాత్రమే చనిపొయ్యారు. |
7
|
ఆ తర్వాత ఆయన యాకోబుకు కనిపించాడు. అపొస్తలులందరికీ కనిపించాడు. |
8
|
చివరకు అయోగ్యుడనైన నాకు కూడా కనిపించాడు. |
9
|
ఎందుకంటే, అపొస్తలుల్లో నేను అధముణ్ణి. దేవుని సంఘాన్ని హింసించిన వాణ్ణి. కనుక అపొస్తలుడనని అనిపించుకోవటానికి కూడా అర్హుణ్ణి కాను. |
10
|
కాని దేవుని దయవల్ల ఈ స్థాయిలో ఉన్నాను. ఆయన దయ వృధా కాలేదు. నేను వాళ్ళందరికన్నా కష్టించి పని చేసాను. ఇది నిజానికి నేను చెయ్యలేదు. దేవుని దయ నాతో ఈ పని చేయించింది. |
11
|
నేను బోధించినా లేక వాళ్ళు బోధించినా మేమంతా ఒకటే బోధించాము. మీరు దాన్ని విశ్వసించారు. |
12
|
కాని మేము, క్రీస్తు చావు నుండి బ్రతికి వచ్చాడని బోధించాము కదా! మరి మీలో కొందరు చనిపోయిన వాళ్ళు బ్రతికి రారని ఎందుకంటున్నారు? |
13
|
అది నిజమైతే క్రీస్తు కూడా చనిపోయి బ్రతికి రాలేదనే అర్థం వస్తుంది. |
14
|
క్రీస్తు చనిపోయి బ్రతికి రానట్లయితే మా బోధన, మీ విశ్వాసము వృధా అయినట్లే కదా! |
15
|
అంతే కాదు దేవుడు చనిపోయిన క్రీస్తును బ్రతికించాడని మేము చెప్పాము. అలాకాని పక్షంలో మేము దేవుణ్ణి గురించి తప్పు సాక్ష్యము చెప్పిన వాళ్ళమౌతాము. కాని ఒకవేళ దేవుడు చనిపోయిన వాళ్ళను నిజంగా బ్రతికించనట్లయితే ఆయన్ని కూడా బ్రతికించలేదు. |
16
|
ఎందుకంటే చనిపోయిన వాళ్ళను బ్రతికించనట్లయితే క్రీస్తును కూడా బ్రతికించలేదు. |
17
|
క్రీస్తును బ్రతికించలేదు అంటే, మీ విశ్వాసం వ్యర్థం. మీకు మీ పాపాలనుండి విముక్తి కలుగలేదన్న మాట. |
18
|
అంటే చనిపోయిన క్రీస్తు విశ్వాసులు కూడా తమ పాపాల నుండి విముక్తి పొందలేదన్నమాట. |
19
|
మనకు క్రీస్తు పట్ల ఉన్న ఆశాభావం ప్రస్తుత జీవితం కోసం మాత్రమే అయినట్లయితే మన స్థితి అందరికన్నా అధ్వాన్నం ఔతుంది. |
20
|
కాని నిజానికి చనిపోయిన క్రీస్తు బ్రతికింపబడ్డాడు. చనిపోయి బ్రతికింపబడ్డ వాళ్ళలో ఆయన ప్రథముడు. |
21
|
ఒక మనుష్యుని ద్వారా మరణం వచ్చినట్లు, పునరుత్థానం కూడా ఒక మనుష్యుని ద్వారా వచ్చింది. |
22
|
ఆదాములో ఐక్యత పొందటం వల్ల మానవులు మరిణిస్తున్నట్లుగానే క్రీస్తులో ఐక్యత పొందటం వల్ల చనిపోయిన వాళ్ళు బ్రతుకుతారు. |
23
|
ప్రతీ ఒక్కడు తన వరుసను బట్టి బ్రతికింపబడతాడు. మొదట క్రీస్తు, ఆయన వచ్చిన తరువాత ఆయనకు సంబంధించిన వాళ్ళు బ్రతికింపబడతారు. |
24
|
అన్నీ అంతమయ్యే కాలం వస్తుంది. అప్పుడాయన రాజ్యాలన్నిటినీ, అధికారంలో ఉన్న వాళ్ళందరి శక్తిని నాశనం చేసి తండ్రి అయిన దేవునికి తన రాజ్యం అప్పగిస్తాడు. |
25
|
ఎందుకంటే, దేవుడు శత్రువులందరిని తన పాదాల ముందు పడవేసే దాకా ఆయన రాజ్యం చెయ్యాలి. |
26
|
చివరి శతృవైన మృత్యువు నాశనము చేయబడుతుంది. |
27
|
ఎందుకంటే లేఖనాల్లో, “అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు” అని వ్రాయబడి ఉంది. ‘అన్నిటినీ ఆయన పాదాల క్రింద ఉంచాడు’ అని అంటే, వీటిలో దేవుడు కూడా ఉన్నాడని కాదు. దేవుడు అన్నిటినీ క్రీస్తు పాదాల క్రింద ఉంచాడు. |
28
|
కాని అన్నీ తన పాదాల క్రింద ఉంచబడగా కుమారుడు తనకు తానే దేవునికి విధేయుడై ఉన్నాడు. ఆ తదుపరి దేవుడు అన్నిటినీ పాలిస్తాడు. |
29
|
పునరుత్థానం లేనట్లయితే, మరి చనిపోయిన వాళ్ళ కోసం, బాప్తిస్మము పొందిన వాళ్ళ సంగతేమిటి? వాళ్ళు ఏ విధంగా బ్రతికి వస్తారు? చనిపోయిన వాళ్ళు బ్రతికి రానట్లయితే ఇంకా బాప్తిస్మము ఎందుకు ఇస్తున్నారు. |
30
|
మరి మేము ప్రతి గడియ మా ప్రాణాలను ఎందుకు ప్రమాదంలో వేసుకొంటున్నాం? |
31
|
సోదరులారా! నేను ప్రతీరోజు మరణాన్ని ఎదుర్కొంటున్నాను. మన క్రీస్తు ప్రభువులో మిమ్మల్ని చూసి గర్విస్తాను. కనుక మీకు ఈ విషయం చెపుతున్నాను. |
32
|
ఒకవేళ నేను ఎఫెసులో క్రూరమృగాలతో పోట్లాడటం, మానవ కారణంగా మాత్రమే అయినట్లయితే నాకొచ్చిన లాభం ఏమిటి? చనిపోయిన వాళ్ళు తిరిగి బ్రతకనట్లయితే, “తిని, త్రాగుదాం, ఎలాగో మరణిస్తాంగదా.” |
33
|
మోసపోకండి, “చెడు సహవాసం మంచి వాణ్ణి చెడుపుతుంది.” |
34
|
మేలుకోండి. పాపం చెయ్యటం మానుకొండి. మీలో కొందరికి దేవుణ్ణి గురించి తెలియదు. అది సిగ్గుచేటు. |
35
|
కొందరు, “చనిపోయిన వాళ్ళు ఏ విధంగా బ్రతికింపబడతారు? వాళ్ళు ఎలాంటి దేహంతో వస్తారు?” అని అడగవచ్చు. |
36
|
ఎంతటి మూర్ఖులు! నీవు భూమిలో నాటిన విత్తనం చనిపోకపోతే అది మొలకెత్తదు. |
37
|
నీవు ఒక చిన్న విత్తనాన్ని, ఉదాహరణకు ఒక గోధుమ విత్తనాన్ని నాటుతావు, కాని పెరగబోయే మొలకను నాటవు. |
38
|
దేవుడు తాను అనుకొన్న విధంగా ప్రతీ విత్తనానికి దానికి తగిన దేహాన్ని యిస్తాడు. |
39
|
మాంసాలన్నీ ఒకే రకం కావు. మానవుల మాంసం ఒక రకం. జంతువుల మాంసం ఒక రకం. పక్షుల మాంసం ఒక రకం. చేపల మాంసం ఒక రకం. |
40
|
ఆకాశంలో జ్యోతులున్నాయి, భూమ్మీద జ్యోతులున్నాయి, గాని వాటి వాటి ప్రకాశం వేరు. |
41
|
సూర్యుడు ఒక రకంగా, చంద్రుడు ఒక రకంగా, నక్షత్రాలు ఒక రకంగా ప్రకాశిస్తాయి. ఒక నక్షత్రం ప్రకాశించిన విధంగా మరొక నక్షత్రం ప్రకాశించదు. |
42
|
చనిపోయిన వాళ్ళు బ్రతికి రావటం కూడా అదే విధంగా ఉంటుంది. నశించిపోయే శరీరాన్ని నాటి నశించని శరీరాన్ని పొందుతారు. |
43
|
గౌరవం లేని శరీరంగా నాటబడి మహిమగల శరీరంగా లేపబడుతుంది. బలహీనమైన శరీరంగా నాటబడి శక్తిగల శరీరముగా లేస్తుంది. |
44
|
భౌతికమైన శరీరాన్ని నాటి, ఆత్మీయమైన శరీరాన్ని పుట్టిస్తాడు. భౌతికమైన శరీరం ఉంది అంటే, ఆత్మీయ శరీరం కూడా ఉంటుంది. |
45
|
ఈ విధంగా వ్రాయబడింది: “ప్రథమ పురుషుడైన ఆదాము జీవించే నరుడయ్యాడు, చివరి ఆదాము జీవాన్ని ఇచ్చే ఆత్మ అయ్యాడు.” |
46
|
ముందు ఆత్మీయత రాలేదు. ముందు భౌతిక శరీరం వచ్చింది. ఆ తర్వాత ఆత్మీయత వచ్చింది. |
47
|
మొదటి పురుషుడు భూమ్మీద ఉన్న మట్టితో సృష్టింపబడ్డాడు. రెండవ మనుష్యుడు పరలోకంనుండి దిగివచ్చాడు. |
48
|
భూమ్మీద ఉన్న వాళ్ళు మట్టితో సృష్టింపబడిన వానివలే ఉన్నారు. పరలోకానికి సంబంధించిన వాళ్ళు పరలోకంనుండి వచ్చిన వానివలె ఉన్నారు. |
49
|
మట్టితో సృష్టింపబడిన వాని పోలికలతో మనము జన్మించినట్లే పరలోకం నుండి వచ్చిన వాని పోలికలను కూడా మనము పొందుతాము. |
50
|
సోదరులారా! నేను చెప్పేదేమిటంటే, రక్త మాంసాలతో ఉన్న వాళ్ళు దేవుని రాజ్యం పొందలేరు. నశించిపోయేది అమరత్వం పొందదు. |
51
|
మీకో రహస్యం చెపుతాను వినండి. మనలో ఎవ్వరూ చనిపోరు. అందరూ మారిపోతారు. |
52
|
చివరి బూర ఊదినప్పుడు, మనమందరము ఒక్క క్షణంలో, కనురెప్ప పాటులో మారిపోతాము. ఆ క్షణంలో చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చి చిరంజీవులైపోతారు. మనలో మార్పు కలుగుతుంది. |
53
|
ఎందుకంటే నశించిపోయే ఈ దేహం నాశనం కాని దేహాన్ని ధరించాలి. చనిపోయే ఈ దేహం అమరత్వం పొందాలి. |
54
|
ఇది జరిగినప్పుడు లేఖనాల్లో వ్రాయబడినట్లు జరుగుతుంది: “మరణం ఓడిపోయి, సంపూర్ణ విజయం కలిగింది.” యెషయా 25:8 |
55
|
“ఓ మరణమా! నీ విజయం ఎక్కడ! ఓ మరణమా! నీ కాటు వేసే శక్తి ఎక్కడ?” హోషేయ 13:14 |
56
|
మరణం కాటు వేయగల శక్తిని ధర్మశాస్త్రం నుండి పొందుతుంది. |
57
|
కాని దేవుడు మన యేసు ప్రభువు ద్వారా మనకు విజయం యిస్తాడు. కనుక దేవునికి వందనాలు. |
58
|
కనుక నా ప్రియమైన సోదరులారా! ఏదీ మిమ్మల్ని కదిలించలేనంత స్థిరంగా నిలబడండి. ప్రభువుకోసం పడిన మీ శ్రమ వృధాకాదు. ఇది మీకు తెలుసు. కనుక సదా ప్రభువు సేవలో లీనమై ఉండండి. |
1-Corinthians 15:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...