ఆయన చేసేది మంచిది, సరియైనది కూడా. మీరు నిజంగా ఆయన పిల్లలు కారు. మీతప్పుల మూలంగా మీరు ఆయనను సమీపించలేని అపవిత్రులయ్యారు. మీరు వంకర మనుష్యులు, అబద్ధీకులు.
యెహోవాకు మీరు చెల్లించవలసిన కృతజ్ఞత ఇదేనా? మీరు బుద్ధిహీనులు, ఆజ్ఞానులు, యెహోవా మీ తండ్రి, ఆయన మిమ్మల్ని చేసాడు. ఆయనే మీ సృష్టికర్త. ఆయన మిమ్మల్ని బల పరచేవాడు.
రాజ్యాలకు వారి దేశాన్ని సర్వోన్నతుడైన దేవుడు యిచ్చాడు. ప్రజలు ఎక్కడ నివసించాల్సిందీ ఆయనే నిర్ణయించాడు. తర్వాత ఆయన ఇతరుల దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చాడు.
“అరణ్య భూమిలో యాకోబును (ఇశ్రాయేలు) యెహోవా కనుగొన్నాడు, వేడి గాడ్పుల్లో కేకలు పెట్టే పనికిమాలిన అరణ్యంలో యెహోవా యాకోబు దగ్గరకు వచ్చి, ఆతణ్ణి గూర్చి జాగ్రత్త తీసుకున్నాడు. యెహోవా తన కంటి పాపలా ఆతడ్ని కాపాడాడు.
యెహోవా ఇశ్రాయేలీయులకు పక్షి రాజులా ఉన్నాడు. పక్షిరాజు తన పిల్లలను ఎగరటం నేర్పించేందుకోసం అది వాటిని బయటకు తోస్తుంది. అది తన పిల్లలను కాపాడేందుకు వాటితో కలిసి ఎగురుతుంది. అవి పడిపోతున్నప్పుడు వాటిని పట్టుకొనేందుకు తన రెక్కలు చాపుతుంది. మరియు అది తన రెక్కల మీద వాటిని క్షేమ స్థలానికి మోసుకొని వెళ్తుంది. యెహోవా అలాగే ఉన్నాడు.
మందలోనుండి వెన్న, గొర్రెలనుండి పాలు గొర్రెపిల్లలు, పొట్టేళ్లు, బాషాను జాతి మగ మేకలు, అతి శ్రేష్ఠమైన గోధుమలు ఆయన నీకు యిచ్చాడు. ద్రాక్షల ఎర్రటిరసం నుండి ద్రాక్షారసం నీవు త్రాగావు.
“కానీ యెష్రూను కొవ్వు పట్టి బలిసిన ఎద్దులా తన్నుతన్నాడు. వాడు బాగా తిని బలిసాడు. వానికి మంచి పోషణ దొరికింది. వాడు తనను చేసిన దేవుణ్ణి విడిచిపెట్టేసాడు. వాడు ఆ బండను(యెహోవాను) తన రక్షకునిగా అంగీకరించలేదు.
నిజానికి దేవుళ్లు కాని దయ్యాలకు వారు బలులు అర్పించారు. వాళ్లకు తెలియని దేవుళ్లకు వారు బలులు అర్పించారు. ఈ దేవుళ్లు మీ పూర్వీకులు ఎన్నడూ పూజించని కొత్త దేవుళ్లు.
అప్పుడు యెహోవా ఇలా చెప్పాడు, ‘వారినుండి నేను నా ముఖం దాచుకొంటాను. వాళ్ల అంతం ఏమిటో నేను చూడగలను. ఎందుకంటే వారు చాలా చెడ్డ తరంవారు వారు అపనమ్మకమైన పిల్లలు.
(21-22) దేవుళ్లు కాని వాటితో వారు నాకు రోషం కలిగించారు. పనికిమాలిన ఈ విగ్రహాలతో వారు నాకు కోపం పుట్టించారు. నిజానికి రాజ్యం కాని ఒక రాజ్యంతో నేను వారికి రోషం పుట్టిస్తాను. ఒక బుద్ధిహీనమైన రాజ్యంతో నేను వారికి కోపం పుట్టిస్తాను. నా కోపం అగ్నిని రాజబెట్టింది; నా కోపం పాతాళ అగాధంవరకు మండుతుంది. భూమిని, దాని పంటను నా కోపం నాశనం చేస్తుంది. నా కోపం పర్వతాల పునాదులకు నిప్పు అంటిస్తుంది.
బయట ఖడ్గం దుఃఖాన్ని కలిగిస్తుంది; లోపల ఖడ్గం భయాన్ని పుట్టిస్తుంది. యువకుడ్ని, కన్యనుకూడ అది నాశనం చేస్తుంది. పసివారిని, తలనెరిసిన వృద్ధులను కూడ అది నాశనం చేస్తుంది.
ఆయితే వారి శత్రువు చెప్పేది నాకు తెలసు అది నాకు చికాకు కలిగిస్తుంది. ఇశ్రాయేలీయుల శత్రువు అపార్థం చేసుకొని, “మా స్వంత శక్తితో మేము గెలి చాము అది యోహోవా చేయలేదు’ ” అనవచ్చును.
ఒకడు 1,000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మంది పారిపోయేటట్టు ఎలా చేయగలరు? యెహోవా వారిని వారి శత్రువుకు అప్పగిస్తేనే అలా జరుగుతుంది. ఆ ఆశ్రయ దుర్గం (యెహోవా) ఈ శత్రువులను అమ్మివేస్తే, యెహోవా ఈ శత్రువులను వారికి అప్పగిస్తే మాత్రమే యిలా జరుగుతుంది.
ఈ శత్రువుల ఆశ్రయ దుర్గం మన బండ [*బండ దేవునియొక్క పేరు ఇది ‘ఆయన ఒక బలమైన కోట లేక ఆశ్రయ దుర్గము’ అనే అర్థాన్నిస్తుంది.] (యెహోవా) వంటి శక్తిమంతుడు కాడు. ఇది సత్యమని మన శత్రువులుకూడ చూడగలరు.
ఈ శత్రువుల ద్రాక్ష సొదొమ ద్రాక్ష వంటిది. గొముర్రా [†సొదొమ … గొమొర్రా వారి పాపముద్వారా దేవునిచే నశింపబడిన రెండు పట్టణాలు. ఆదికాండము 19 వ అధ్యాయం చూడండి.] పొలాలలోని దాని వంటిది. వారి ద్రాక్షా పండ్లు విషపు ద్రాక్షలు వారి ద్రాక్షా పండ్ల గుత్తులు చేదు.
ప్రజల పాదం తప్పుడు పనుల్లోకి జారినప్పుడు శిక్షించే వాణ్ణి వారి తప్పులకు ప్రజలకు ప్రతిఫలం యిచ్చేవాడ్ని నేనే; ఎందుకంటే వారి కష్టకాలం సమీపంగా ఉంది వారి శిక్ష త్వరగా వస్తుంది గనుక.’
“యెహోవా తన ప్రజలకు శిక్ష విధిస్తాడు. వారు ఆయన సేవకులు, ఆయన వారికి దయ చూపిస్తాడు. వారి శక్తి పోయేటట్టు ఆయన చేస్తాడు. బానిసగాని స్వతంత్రుడు గాని వారంతా నిస్సహాయు లయ్యేటట్టు ఆయన చేస్తాడు.
ఈ ప్రజల దేవుళ్లు ప్రజల బలి అర్పణల కొవ్వు తిన్నారు. వారి పానార్పణపు ద్రాక్షారసం వారు తాగారు. కనుక ఈ దేవుళ్లనే లేచి మీకు సహాయం చేయనివ్వండి. వారినే మిమ్మల్ని కాపాడ నివ్వండి!
“ ‘ఉప్పుడు చూడండి, నేనే, నేను మాత్రమే దేవుణ్ణి ఇంకే దేవుడూ లేడు. ప్రజలను బ్రతకనిచ్చేది, చంపేదీ నిర్ణయించే వాడ్ని నేనే. నేను ప్రజల్ని బాధించగలను, బాగు చేయగలను. నా శక్తినుండి ఒక మనిషిని ఏ మనిషి రక్షించ లేడు.
నేను ప్రమాణం చేస్తున్నాను, తళతళలాడే నా ఖడ్గానికి నేను పదునుపెడ్తాను. నా శత్రువుల్ని శిక్షించటానికి నేను దానిని నేను ఉపయోగిస్తాను. నేను వారికి తగిన శిక్ష యిస్తాను.
“దేవుని ప్రజలకోసం సర్వప్రపంచం సంతోషించాలి. ఎందుకంటే వారికి ఆయన సహాయం చేస్తాడు గనుక. తన సేవకులను చంపే వాళ్లను ఆయన శిక్షిస్తాడు గనుక. ఆయన తన శత్రువులకు తగిన శిక్షయిస్తాడు. ఆయన తన ప్రజల్ని, తన దేశాన్ని పవిత్రం చేస్తాడు.”
వాళ్లతో ఆతడు ఇలా చెప్పాడు: “ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆదేశాలన్నింటిని మీరు గమనించి తీరాలి. మరియు ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నింటికీ మీ పిల్లలు విధేయులు కాలావని మీరు వారికి చెప్పాలి.
ఈ ప్రబోధాలు ముఖ్యమైనవి కావు అనుకోవద్దు. అవి మీకు జీవం. యోర్దాను నదికి అవతల మీరు స్వాధీనం చేసుకొనేందుకు సిద్ధంగా ఉన్న దేశంలో ఈ ప్రబోధాల ద్వారా మీరు చాలా కాలం జీవిస్తారు.”
“అబారీము పర్వతాలకు వేళ్లుము. ఎరికో పట్టణం అవతల మోయాబు దేశంలో నెబో కొండమీదికి ఎక్కివెళ్లు. అప్పుడు నీవు ఇశ్రాయేలు ప్రజలు నివసించటానికి నేను వారికి ఇస్తున్న కనాను దేశాన్ని చూడవచ్చు.
ఎందుకంటే సీను అరణ్యంలో కాదేషు సమీపంలో మెరీబా నీళ్ల దగ్గర నీవు నాకు వ్యతిరేకంగా పాపం చేసావు. అది చూసేందుకు ఇశ్రాయేలు ప్రజలు అక్కడే ఉన్నారు. నీవు నన్ను గౌరవించలేదు. ఆ సంగతి నీవు ప్రజలకు చూపెట్టావు.