తనకు తెలియని భాషలో మాట్లాడే వాడు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. మానవులతో కాదు. అతని మాటలు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. అతడు పవిత్రాత్మ శక్తితో రహస్యాలను చెబుతూ ఉంటాడు.
మీలో ప్రతి ఒక్కడూ తెలియని భాషల్లో మాట్లాడితే నాకు యిష్టమే. కాని మీరు దైవసందేశం చెప్పటం నాకు ఇంకా ఎక్కువ యిష్టం. తెలియని భాషల్లో మాట్లాడే వాని మాటలకు అర్థం విడమర్చి చెప్పేవాడు ఉంటే సంఘానికి లాభం కలుగుతుంది. అది సంభవించకపోతే తెలియని భాషల్లో మాట్లాడే వానికన్నా దైవసందేశం చెప్పేవాడే గొప్ప.
సోదరులారా! నేను అక్కడికి వచ్చి తెలియని భాషలో మాట్లాడితే మీకు ఏం లాభం కలుగుతుంది? నా ద్వారా మీకు దేవుడు ఒక క్రొత్త విషయం తెలియచెయ్యాలి. లేక నా ద్వారా మీకు జ్ఞానం కలగాలి. లేక మీకు నా ద్వారా దైవసందేశం తెలియాలి. లేక నేను మీకు ఒక క్రొత్త విషయం బోధించగలగాలి. అలా జరగనట్లయితే లాభం ఏమిటి?
మీరు దేవుణ్ణి ఆత్మతో స్తుతిస్తున్నారనుకోండి. మీ సమావేశంలో సభ్యుడు కానివాడుంటే, అతనికి మీరు ఏమంటున్నారో తెలియదు. కనుక, మీరు చేస్తున్న ప్రార్థనలకు ఎప్పుడు, “ఆమేన్” అని అనాలో అతనికి ఎట్లా తెలిస్తుంది?
లేఖనాల్లో ఇలా వ్రాయబడివుంది: “ఇతర భాషలు మాట్లాడే వాళ్ళ ద్వారా, విదేశీయుల పెదాల ద్వారా వీళ్ళతో నేను మాట్లాడుతాను. అయినా వాళ్ళు నా మాటలు వినరు.” యెషయా 28:11-12]
తెలియని భాషల్లో మాట్లాడగల శక్తివుంటే, అది విశ్వాసం లేని వాళ్ళకు రుజువుగా ఉంటుంది. కాని ఆ రుజువు విశ్వాసం ఉన్న వాళ్ళకు అవసరం లేదు. అయినా దైవసందేశం విశ్వాసం ఉన్న వాళ్ళకే గాని, విశ్వాసం లేని వాళ్ళకు కాదు.
సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఒకేచోట సమావేశమై, తమకు తెలియని భాషల్లో మాట్లాడటం మొదలు పెడతారనుకోండి. అప్పుడు సభ్యులు కాని వాళ్ళు లేక విశ్వాసం లేని వాళ్ళు ఆ సమావేశంలో ఉంటే మీకు పిచ్చి ఎక్కిందని అనుకోరా?
దానికి మారుగా మీరంతా దైవసందేశాన్ని చెపుతున్నారనుకోండి. అప్పుడు విశ్వాసం లేనివాడో లేక సభ్యుడు కానివాడో సమావేశంలో ఉంటే మీరు చెపుతున్నది విని తప్పు తెలుసుకుంటాడు. అంటే దైవసందేశం అతనిపై తీర్పు చెప్పిందన్నమాట.
సోదరులారా! యిక మేము ఏమని చెప్పాలి? మీరంతా సమావేశమైనప్పుడు ఒకడు స్తుతిగీతం పాడుతాడు. మరొకడు ఒక మంచి విషయాన్ని బోధిస్తాడు. ఇంకొకడు దేవుడు తనకు తెలియచేసిన విషయాన్ని చెపుతాడు. ఒకడు తనకు తెలియని భాషలో మాట్లాడుతాడు. మరొకడు దాని అర్థం విడమరచి చెపుతాడు. ఇవన్నీ సంఘాన్ని బలపరచటానికి జరుగుతున్నాయి.
తెలియని భాషల్లో మాట్లాడగలిగే వాళ్ళు ఉంటే, ఇద్దరు లేక ముగ్గురి కంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఒకని తర్వాత ఒకడు మాట్లాడాలి. దాని అర్థం విడమర్చి చెప్పగలవాడు ఉండాలి.
ఇతర సంఘాలలో జరుగుతున్నట్లు స్త్రీలు సమావేశాలలో మౌనం వహించాలి. మాట్లాడటానికి వాళ్ళకు అధికారం లేదు. ధర్మశాస్త్రంలో, “స్త్రీలు అణకువతో ఉండాలి” అని వ్రాయబడి ఉంది.