1
|
యేసు క్రీస్తు సేవకులైన పౌలు మరియు తిమోతియు, యేసు క్రీస్తులో ఐక్యమై, ఫిలిప్పీ పట్టణంలో నివసిస్తున్న పవిత్రులకు, పెద్దలకు, పరిచారకులకు వ్రాయునది ఏమనగా: |
2
|
మన తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి మీకు అనుగ్రహము, శాంతి లభించును గాక! |
3
|
నేను మిమ్మల్ని తలచుకొన్నప్పుడెల్లా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను. |
4
|
కనుక మీకోసం ప్రార్థించినప్పుడెల్లా ఆనందంతో ప్రార్థిస్తాను. |
5
|
దైవ సందేశం ప్రచారం చెయ్యటానికి మీరు మొదటి రోజు నుండి ఈ రోజుదాకా నాతో కలిసి పని చేసారు. |
6
|
ఈ మంచి కార్యాన్ని మీలో ప్రారంభించినవాడు అది పూర్తి అయ్యేదాకా, అంటే యేసు క్రీస్తు వచ్చేదాకా కొనసాగిస్తాడని నాకు నమ్మకం ఉంది. |
7
|
మీరు నా హృదయంలో ఉన్నారు. కనుక మీ అందర్ని గురించి నేనీవిధంగా ఆలోచించటం సమంజసమే. ఎందుకంటే నేను సంకెళ్ళలో ఉన్నా, లేక సువార్తను ప్రకటిస్తూ దానిలో ఉన్న నిజాన్ని నిరూపిస్తూ, స్వేచ్ఛగా పర్యటన చేస్తున్నా దైవానుగ్రహాన్ని మీరు నాతో కలిసి పంచుకొన్నారు. |
8
|
మీ పట్ల నాకున్న ప్రేమ యేసు క్రీస్తు నుండి వచ్చిందని నేను దైవసాక్షిగా చెపుతున్నాను. |
9
|
ఇదే నా ప్రార్థన: మీ ప్రేమ అవధులు లేకుండా పెరగాలి, దానితోబాటు మీకు నిజమైన జ్ఞానము, ఆ జ్ఞానంలోని లోతులు తెలుసుకొనే శక్తి కలగాలి. |
10
|
అప్పుడు మీకు మంచి, చెడు విడమరిచే శక్తి కలుగుతుంది. క్రీస్తు వచ్చే వరకు మీరు పవిత్రంగా ఎలాంటి అపవాదులు లేకుండా ఉండగలుగుతారు. |
11
|
మీరు నీతిగా జీవించటంవల్ల ఫలం పొందుతారు. ఆ ఫలం యేసు క్రీస్తు నుండి వచ్చి మీలో నిండిపోతుంది. తద్వారా దేవునికి కీర్తి, స్తుతి కలుగుతుంది. |
12
|
సోదరులారా! నాకు జరిగిన సంఘటనలు దైవ సందేశాన్ని ప్రచారం చేయటానికి తోడ్పడుతాయని మీరు గమనించాలి. |
13
|
ఈ సంఘటనలు సంభవించటం వల్ల క్రీస్తు కోసం సంకెళ్ళలో బంధింపబడ్డానని అందరికీ తెలిసిందే. ఇది రాజభవనంలో ఉన్న రక్షకభటులకు కూడా తెలిసిందే. |
14
|
ఈ సంకెళ్ళ మూలంగా, ప్రభువు కారణంగా నా సోదరులైన అనేకులకు దైవ సందేశం బోధించటానికి ప్రోత్సాహం కలిగింది. వాళ్ళు ఇంకా ఎక్కువ ధైర్యంతో భయం లేకుండా మాట్లాడగలుగుతున్నారు. |
15
|
కొందరు నాపై అసూయవల్ల పగతో క్రీస్తును గురించి బోధిస్తున్నారు. కాని మరి కొందరు మంచి ఉద్దేశ్యంతో బోధిస్తున్నారు. |
16
|
వీళ్ళు, దైవ సందేశాన్ని ప్రకటించటానికి నేనిక్కడ ఉంచబడ్డానని గమనించి ప్రేమతో బోధిస్తున్నారు. |
17
|
మొదట పేర్కొనబడ్డ వాళ్ళు స్వార్థంతో, విశ్వాసహీనులై క్రీస్తును గురించి బోధిస్తున్నారు. ఎందుకంటే నేనిక్కడ సంకెళ్ళలో ఉన్నప్పుడు నాకు ఎక్కువ కష్టాలు కలిగించాలని వాళ్ళ ఉద్దేశ్యం. |
18
|
దాని వల్ల కలిగేది ఏమీలేదు. ముఖ్యమైన విషయమేమిటంటే సదుద్దేశాలతో అయితేనేమిటి, దురుద్దేశాలతో అయితేనేమిటి క్రీస్తును గురించి బోధింపబడుతోంది. కనుక నాకు ఆనందంగా ఉంది. ఔను నేను యిదే విధంగా ఆనందిస్తూ ఉంటాను. |
19
|
ఎందుకంటే మీ ప్రార్థన వల్ల యేసు క్రీస్తు యొక్క ఆత్మ చేసిన సహాయం వల్ల నేను అనుభవిస్తున్న ఈ కష్టాలే నా విడుదలకు దారితీస్తాయని నాకు తెలుసు. |
20
|
నాకు ఎలాంటి అవమానం కలుగరాదని, నాకు ధైర్యం కలగాలని మనసారా కోరుకొంటున్నాను. ఎప్పటిలాగే యిప్పుడు కూడా క్రీస్తు, నా దేహంలో మహిమ పొందాలని ఆశిస్తున్నాను. ఇది నేను జీవించటంవల్ల సంభవించినా, లేక మరణంవల్ల సంభవించినా నాకు చింత లేదు. |
21
|
ఎందుకంటే, నాకు క్రీస్తే జీవితం. నేను మరణిస్తే, అది కూడా లాభకరమే. |
22
|
నేను ఈ దేహంతో జీవిస్తే దానివల్ల నా శ్రమకు తగిన ఫలం లభిస్తుంది. అయినా నేను ఏది కోరుకోవాలో నాకే తెలియదు. |
23
|
ఈ రెంటి మధ్య నేను నలిగిపోతున్నాను. ఒక విధంగా చూస్తే ఈ దేహాన్ని వదిలి క్రీస్తు సమక్షంలో ఉండాలని అనిపిస్తోంది. ఇది అన్నిటికన్నా ఉత్తమం. |
24
|
కాని యింకొక విధంగా చూస్తే మీ కొరకు నేనీ దేహంతో ఉండటం చాలా అవసరం. |
25
|
ఇది నాకు బాగా తెలుసు. అందువల్ల నేను బ్రతికి ఉండి అందరితో కలిసి విశ్వాసం ద్వారా సంభవిస్తున్న మీ అభివృద్ధి కోసం, ఆనందం కోసం పని చేస్తాను. |
26
|
నేను మళ్ళీ మీతో కలిసి జీవించునప్పుడు మీకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత కారణంగా యింకా ఎక్కువ గర్విస్తాను. |
27
|
ఏది ఏమైనా క్రీస్తు సువార్తకు తగిన విధంగా జీవించండి. అప్పుడు నేను మిమ్మల్ని చూసినా చూడకపోయినా, మీరు ఒక ఆత్మగా, ఒక మనిషిగా సువార్త వల్ల సంభవించే విశ్వాసంకోసం పని చేస్తున్నారని నేను వినాలి. |
28
|
మీ శత్రువులకు ఏ మాత్రం భయపడకండి. అన్ని వేళలా ధైర్యంగా ఉండండి. అప్పుడు మీరు గెలుస్తారని, తాము ఓడిపోతామని వాళ్ళకు తెలుస్తుంది. ఇది దేవుడు చేసాడు. |
29
|
ఎందుకంటే, క్రీస్తును విశ్వసించే అవకాశమే కాకుండా, ఆయన కోసం కష్టాలు అనుభవించే అవకాశం మీకు కూడా దేవుడు కలిగించాడు. |
30
|
గతంలో నేను సాగించిన పోరాటాన్ని చూసారు. దాన్ని గురించి విన్నారు. మీరు కూడా ఆ పోరాటాన్ని సాగిస్తున్నారు. |
Philippians 1:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...