Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Leviticus Chapters

Leviticus 27 Verses

Bible Versions

Books

Leviticus Chapters

Leviticus 27 Verses

1 యెహోవా మోషేతో చెప్పాడు:
2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ఒకవ్యక్తి యెహోవాకు ఒక ప్రత్యేక వాగ్దానం చేయవచ్చు. ఆ వ్యక్తి ఒక మనిషిని యెహోవాకు అర్పిస్తానని వాగ్దానం చేసి ఉండొచ్చు. అలాగైతే ఆ మనిషి ఒక ప్రత్యేక విధానంలో యెహోవాను సేవించాలి. ఆ మనిషికి యాజకుడు కొంత విలువ నిర్ణయించాలి. ప్రజలు ఆ మనిషిని యెహోవా దగ్గర తిరిగి కొనాలంటే వారు ఆ విలువ చెల్లించాలి.
3 ఇరవై నుండి అరవై సంవత్సరాల వయసుగల ఒక మగవాడి విలువ యాభై తులాల వెండి. (వెండిని తూచేందుకు పవిత్ర స్థలంలోని అధికారిక కొలతనే మీరు ఉపయోగించాలి).
4 ఇరవై నుండి అరవై సంవత్సరాల వయస్సుగల ఒక స్త్రీ విలువ ముప్పైతులాలు.
5 ఐదు నుండి ఇరవై సంవత్సరాల వయస్సుగల ఒక మగవాని విలువ ఇరవైతులాలు. ఐదు నుండి ఇరవై సంవత్సరాల వయస్సుగల ఒక స్త్రీ విలువ పది తులాలు.
6 ఒక నెలనుండి ఐదు సంవత్సరాల వయస్సుగల ఒక మగ శిశువు వెల ఐదు తులాలు. ఆడ శిశువు వెల మూడు తులాలు.
7 అరవై సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న ఒక మగవాని వెల పదిహేను తులాలు. ఒక స్త్రీ వెల పది తులాలు.
8 “ఒక మనిషి ఆ వెల చెల్లించలేనంత పేదవాడైతే ఆ వ్యక్తిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. ఆ వ్యక్తి ఎంత మొత్తం చెల్లించగలడు అనే విషయం యాజకుడు తీర్మానిస్తాడు.
9 “కొన్ని జంతువులు యెహోవాకు బలిగా ఉపయోగపడతాయి. అలాంటి ఒక జంతువును ఒక వ్యక్తి తీసుకొని వస్తే, ఆ జంతువు పవిత్రం అవుతుంది.
10 ఆ వ్యక్తి ఆ జంతువునే యోహోవాకు ఇస్తానని వాగ్దానం చేసాడు గనుక దానికి బదులు ఇంకోదాన్ని యివ్వటానికి అతడు ప్రయత్నించకూడదు. ఇంకో దానితో దీన్ని మార్చేందుకు అతడు ప్రయత్నించకూడదు. మంచి జంతువుకు బదులుగా పనికిరాని జంతువును మార్చాలని అతడు ప్రయత్నించకూడదు. పనికిరాని జంతువుకు బదులుగా మంచి జంతువును మార్చాలనీ అతడు ప్రయత్నించకూడదు. ఆ మనిషి అలా జంతువుల్ని మార్చటానికి ప్రయత్నిస్తే, అప్పుడు ఆ జంతువులు రెండూ పవిత్రం అవుతాయి. అందుచేత అవి రెండూ యెహోవాకే చెందుతాయి.
11 “కొన్ని జంతువులు యెహోవాకు అర్పించేందుకు పనికిరావు. అలాంటి అపవిత్ర జంతువును ఒకదాన్ని ఒకడు యోహోవాకు యిచ్చేందుకు తీసుకొనివస్తే, అప్పుడు ఆ జంతువును యాజకుని దగ్గరకు తీసుకొనిరావాలి.
12 యాజకుడు ఆ జంతువుకు విలువ నిర్ణయం చేస్తాడు. యాజకుడు వెల నిర్ణయం చేసిన తర్వాత ఆ జంతువు మంచిదేగాని పనికిరానిదేగాని, దాని వెల అంతే.
13 ఒక వేళ ఆ వ్యక్తి తిరిగి జంతువును కొనుక్కోవాలనుకొంటే, అతడు దాని వెలకు అయిదో వంతు అదనంగా చెల్లించాలి.
14 “ఇప్పుడు ఒక వ్యక్తి తన ఇంటిని యెహోవాకు పవిత్రంగా ప్రతిష్ఠ చేస్తే, యాజకుడు దాని వెల నిర్ణయం చేయాలి. యాజకుడు అలా వెల నిర్ణయిస్తే ఆ ఇల్లు మంచిదేగాని, పనికి రానిదేగాని ఆ వెల అంతే.
15 అయితే ఆ ఇంటిని ఇచ్చిన వ్యక్తి తిరిగి దానిని తీసుకొనగోరితే, దాని విలువకు అయిదోవంతు అదనంగా చెల్లించాలి. అప్పుడు ఆ ఇల్లు ఆ వ్యక్తికి చెందుతుంది.
16 “ఒక వ్యక్తి తన పొలాల్లో కొంత భాగం యెహోవాకు ప్రతిష్ఠ చేస్తే, దానిలో నాటేందుకు ఎంత విత్తనం అవసరం ఉంటుందో అనేదానిమీద ఆ పొలాల వెల ఆధారపడి ఉంటుంది. పది తూముల యవల విత్తనాల వెల ఏబై తులాల వెండితో సమానము
17 ఒకవేళ బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ఆ వ్యక్తి తన పొలాన్ని కానుకగా యిస్తే, యాజకుడు నిర్ణయించేదేదాని వెల అవుతుంది.
18 కానీ ఆ వ్యక్తి బూరధ్వని మహోత్సన కాలం దాటిపోయాక తన పొలాన్ని కానుకగా యిస్తే, దాని ఖచ్చితమైన వెలను యాజకుడు నిర్ణయించాలి. తర్వాత వచ్చే బూరధ్వని మహోత్సవ కాలానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అతడు లెక్కించాలి. అప్పుడు ఆ లెక్క ఆధారంగా వెలకట్టాలి.
19 ఒకవేళ తన పొలాన్ని కానుకగా యిచ్చిన వ్యక్తి తిరిగి తన పొలాన్ని తీసుకోవాలనుకొంటే, దాని వెలకు అయిదో వంతు అతడు అదనంగా చెల్లించాలి. అప్పుడు ఆ పొలం తిరిగి అతనిదే అవుతుంది.
20 “ఆ వ్యక్తి ఆ పొలాన్ని తిరిగి కొనకపోతే, అప్పుడు ఆ పొలం ఎల్లప్పుడూ యాజకులకే చెందుతుంది. ఒకవేళ ఆ భూమిని మరొకరికి అమ్మివేస్తే, ఆ మొదటి వ్యక్తి తిరిగి ఆ పొలం కొనేందుకు వీల్లేదు.
21 ఒకవేళ ఆ వ్యక్తి గనుక ఆ పొలాన్ని మళ్లీ కొనకపొతే, బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ఆ భూమి యోహోవాకు పవిత్రంగా ఉండిపోతుంది. అది శాశ్వతంగా యాజకునిదే అవుతుంది. అది సంపూర్ణంగా యెహోవాకు ఇవ్వబడిన భూమిగా ఉంటుంది.
22 “ఒకవేళ ఒక వ్యక్తి అతడు కొన్న పొలాన్ని యోహోవాకు ప్రతిష్ఠస్తే, అది అతని స్వంత పొలంలో ఒక భాగం కానప్పుడు.
23 యాజకుడు బూరధ్వని చేసే మహోత్సవ కాలంవరకుగల సంవత్సరాలను లెక్కించి, దాని ప్రకారం ఆ పొలం వెల నిర్ణయించాలి. అప్పుడు ఆ భూమి యెహోవాదే అవుతుంది.
24 బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ఆ భూమి దాని స్వంతదారునిది అవుతుంది. ఆ భూమి ఏ కుటుంబంవారి స్వంతమో తిరిగి వారికే దక్కుతుంది.
25 “ఆ ధరలు చెల్లించేందుకు పవిత్రస్థలంలోని అధికారిక కొల తనే మీరు ఉపయోగించాలి. పవిత్ర స్థలంలో అధికారతులం బరువు 20 చిన్నాలు.
26 “పశువుల్ని, గొర్రెల్ని, ప్రజలు యెహోవాకు కానుకగా ఇవ్వవచ్చును. అయితే ఆ జంతువు తొలిచూలు అయితే అది ముందే యెహోవాది. కనుక తొలిచూలు వాటిని ప్రజలు కానుకగా యివ్వలేరు.
27 తొలిచూలు జంతువులను ప్రజలు యెహోవాకు ఇవ్వాలి. అయితే ఆ తొలిచూలు జంతువు అపవిత్రమైనదిగా ఉంటే అప్పుడు ఆ వ్యక్తి తిరిగి దానిని కొనుక్కోవాలి. ఆ జంతువు వెల యాజకుడు నిర్ణయించగా, ఆ వ్యక్తి, దాని వెలకు అయిదోవంతు అదనంగా చెల్లించాలి. ఒకవేళ ఆ వ్యక్తి గనుక ఆ జంతువును తిరిగి కొనలేకపోతే, యాజకుడు తానే నిర్ణయించే వెలకు ఆ జంతువును అమ్మివేయాలి. ప్రత్యేక బహుమతులు
28 “ప్రజలు యెహోవాకు ఇచ్చే ఒక ప్రత్యేక రకమైన కానుక ఉంది. ఆ కానుక సంపూర్ణంగా యెహోవాదే అవుతుంది. ఆ కానుకను అమ్మటానికి, తిరిగి కొనడానికి వీల్లేదు. ఆ కానుక యెహోవాకు చెందినది. ప్రజలు, జంతువులు, కుటుంబపు ఆస్తిలోని పొలాలు ఆ కానుక కావచ్చును.”
29 “ఒకవేళ ఆ ప్రత్యేకమైన కానుక ఒక వ్యక్తి అయివుంటే ఆ వ్యక్తిని తిరిగి కొనేందుకు వీల్లేదు. ఆ వ్యక్తి చంపబడవలసినదే.”
30 “పంటలన్నింటిలో పదోవంతు యెహోవాకు చెందుతుంది. అంటే పొలాల్లోని పంటలు, చెట్ల ఫలాలు అని అర్ధం. ఆ పదోవంతు యెహోవదే అవుతుంది.
31 కనుక ఎవరైనా తన పదోవంతు తిరిగి తీసుకోవాలి అనుకొంటే. వారు దాని వెలకు అయిదో వంతు అదనంగా చెల్లించి, అప్పుడు దానిని తిరిగి కొనుక్కోవాలి.
32 “ఒక వ్యక్తికిగల పశువులు, గొర్రెలలో నుండి ప్రతి పదో జంతువును యాజకులు తీసుకోవాలి. పదోజంతువు ప్రతీదీ యెహోవాదే అవుతుంది.
33 కోరుకొన్న ఆ జంతువు మంచిదైనా చెడ్డదైనా, దాని స్వంతదారుడు చింతించవలసిన అవసరం లేదు. అతడు ఆ జంతువును మరో జంతువుతో మార్చకూడదు. అలా మరో జంతువుతో దాన్ని మార్చాలని అతడు నిర్ణయించుకొంటే అప్పుడు ఆ రెండు జంతువులూ యెహోవావే అవుతాయి. ఆ జంతువును తిరిగికొనేందుకు వీల్లేదు.”
34 సీనాయి పర్వతం దగ్గర మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అవి. అవి ఇశ్రాయేలు ప్రజలకోసమైన ఆజ్ఞలు.

Leviticus 27:1 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×