వాళ్ళు భూమ్మీదనున్న పరిశుద్ధ స్థలములో సేవచేస్తూ ఉంటారు. భూలోకంలో ఉన్న ఈ పరిశుద్ధ స్థలము పరలోకంలో ఉన్న దానికి నీడ లాంటిది, అంటే ప్రతిబింబం. ఈ కారణంగానే, మోషే గుడారాన్ని నిర్మించటానికి మొదలు పెట్టినప్పుడు దేవుడు అతనితో, “నేను నీకు కొండమీద చూపించిన విధంగా దాన్ని నిర్మించు!” [✡ఉల్లేఖము: నిర్గమ. 25:40.] అని హెచ్చరించాడు.
యేసు మధ్యవర్తిగా ఉండి నియమించిన ఒడంబడిక పాత దానికన్నా ఉత్తమమైనది. అందులో ఉత్తమ వాగ్దానాలున్నాయి. అందువల్ల దేవుడు యేసుకిచ్చిన యాజకత్వము వాళ్ళు చేసే యాజకత్వం పనికన్నా ఉత్తమమైనది.
వాళ్ళ ముత్తాతల్ని ఈజిప్టు దేశంనుండి, చేయి పట్టుకొని వెలుపలికి పిలుచుకొని వచ్చాను. ఆనాడు వాళ్ళతో ఒక ఒడంబడిక చేసాను. నేను మీతో చేయబోతున్న ఒడంబడిక ఆనాటి ఒడంబడికలా ఉండదు. వాళ్ళు నా ఒడంబడిక ప్రకారం నడుచుకోలేదు గనుక వాళ్ళను నేను లేక్క చేయ్యలేదు.
ఆతర్వాత, ఇశ్రాయేలు ప్రజలతో ఈ విధంగా ఒడంబడిక చేస్తాను: నా నియమాల్ని వాళ్ళ మనస్సుల్లో ఉంచుతాను. వాటిని వాళ్ళ హృదయాలపై వ్రాస్తాను. నేను వాళ్ళ దేవునిగా ఉంటాను. వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు.
అప్పుడు ప్రభువుని తెలుసుకోమని ప్రక్కింటి వానికి గాని, తన సోదరునికి గాని బోధించవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ రోజుల్లో అధముడు, గొప్పవాడు, అందరు నన్ను తెలుసుకొంటారు.