ఆధ్యాత్మిక విషయాల్లో, తమ పక్షాన పని చెయ్యటానికి ప్రజలు తమ నుండి ప్రధాన యాజకుని ఎన్నుకొంటారు. పాప పరిహారార్థం అర్పించే కానుకల్ని, బలుల్ని దేవునికి యితడు సమర్పిస్తాడు.
ప్రధాన యాజకుని స్థానం గౌరవనీయమైంది. ఆ స్థానాన్ని ఎవ్వరూ, స్వయంగా ఆక్రమించలేరు దేవుడు అహరోనును పిలిచినట్లే ఈ స్థానాన్ని ఆక్రమించటానికి అర్హత గలవాణ్ణి పిలుస్తాడు.
క్రీస్తు ప్రధాన యాజకుని యొక్క గౌరవ స్థానాన్ని స్వయంగా ఆక్రమించలేదు. దేవుడాయనతో, “నీవు నా కుమారుడవు. నేడు నేను నీకు తండ్రినయ్యాను” కీర్తన 2:7 అని చెప్పి మహిమ పరచెను.
యేసు తాను భూమ్మీద జీవించినప్పుడు తనను చావునుండి రక్షించగల దేవుణ్ణి కళ్ళనిండా నీళ్ళు పెట్టుకొని పెద్ద స్వరంతో ప్రార్థించి వేడుకొన్నాడు. ఆయనలో భక్తి, వినయం ఉండటంవల్ల దేవుడాయన విన్నపం విన్నాడు.
నిజం చెప్పాలంటే, మీకిదివరకే భోధించి ఉండవలసింది. కాని దైవసందేశంలోని ప్రాథమిక సత్యాలను మీకు మళ్ళీ నేర్పించవలసిన అవసరం కలుగుతోంది. అంటే, మీరు పాలు త్రాగగలరు కాని, ఆహారం తినగల శక్తి మీకింకా కలుగలేదు.