1
|
యాకోబు కూడ అక్కడ నుండి వెళ్లి పోయాడు. అతడు ప్రయాణం చేస్తుండగా దేవుని దూతలను చూశాడు. |
2
|
యాకోబు వారిని చూసినప్పుడు, “ఇది దేవుని శిబిరం” అన్నాడు. కనుక ఆ స్థలానికి “మహనయీము” అని యాకోబు పేరు పెట్టాడు. |
3
|
యాకోబు అన్న ఏశావు శేయెరు అనే ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇది ఏదోం పర్వత ప్రాంతం. యాకోబు ఏశావుకు వార్తాహరులను పంపాడు. |
4
|
“ఏశావుకు ఇలా చెప్పండి అని వార్తాహరులతో చెప్పాడు యాకోబు: “మీ సేవకుడైన యాకోబు, నా యజమాని ఏశావుకు చెప్పేదేమిటంటే, ఇన్ని సంవత్సరాలు నేను లాబానుతో నివసించాను. |
5
|
పశువులు, గాడిదలు, మందలు, అనేక మంది సేవకులు, దాసీలు నాకు ఉన్నారు. అవన్నీ నేను నీకు పంపిస్తున్నాను. నీవు మమ్మల్ని చేర్చుకోవాలని మనవి.” |
6
|
వార్తాహరులు తిరిగి వచ్చి, “నీ అన్న ఏశావును కలుసుకొనేందుకు మేము వెళ్లాం. నిన్ను కలుసుకొనేందుకు అతడు వస్తున్నాడు. అతనితో 400 మంది మనుష్యులు ఉన్నారు” అని యాకోబుతో చెప్పారు. |
7
|
ఆ వార్త యాకోబుకు భయం కలిగించింది. తనతో ఉన్న మనుష్యులందరినీ అతడు రెండు గుంపులుగా విభజించాడు. మందలను, పశువులను, ఒంటెలను రెండు గుంపులుగా విభజించాడు. |
8
|
“ఏశావు వచ్చి ఒక గుంపును హతమార్చినా, మరో గుంపు పారిపోయి తప్పించుకోవచ్చు” అనుకున్నాడు యాకోబు. |
9
|
యాకోబు ఇలా అన్నాడు “నా తండ్రి అబ్రాహాము దేవా! నా తండ్రి ఇస్సాకు దేవా! ఓ యెహోవా, నన్ను మళ్లీ నా కుటుంబం దగ్గరకు, నా స్వదేశానికి నీవే వచ్చేయమన్నావు. నీకు నాకు మేలు చేస్తానన్నావు. |
10
|
నా యెడల నీవు ఎంతో దయ చూపించావు. నాకు ఎన్నో మేళ్లు చేసావు. మొదటిసారి నేను యోర్దాను దాటినప్పుడు, నా చేతి కర్ర తప్ప యింకేమీ నా స్వంతం లేదు. ఇప్పుడు రెండు గుంపులకు సరిపడినంత నాకు ఉన్నది. |
11
|
దయచేసి నా అన్న ఏశావు నుంచి నన్ను కాపాడు. నాకు అతడంటే భయంగా ఉంది. అతడు వచ్చి మమ్మల్ని అందరిని, చివరికి తల్లులను పిల్లలను కూడ చంపేస్తాడని భయంగా ఉంది. |
12
|
“నేను నీతో మంచిగా ఉంటాను. నేను నీ కుటుంబాన్ని వర్ధిల్లచేసి, నీ పిల్లల్ని ఇసుక రేణువులంత విస్తారంగా చేస్తాను. లెక్కింప జాలనంత విస్తారంగా వారుంటారు” అని నీవు నాతో అన్నావు గదా ప్రభూ. |
13
|
యాకోబు ఆ రాత్రి అక్కడే ఉండిపోయాడు. ఏశావుకు కానుకలుగా ఇచ్చేందుకు కొన్ని వస్తువులను యాకోబు సిద్ధం చేసాడు. |
14
|
యాకోబు 200 ఆడ మేకలను, 20 మేకపోతులను, 200 ఆడ గొర్రెలను, 20 పొట్టేళ్లను తీసుకొన్నాడు. |
15
|
30 ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఎద్దులను, 20 ఆడ గాడిదలను, 10 మగ గాడిదలు యాకోబు తీసుకొన్నాడు. |
16
|
“ఒక్కొక్క రకం జంతువుల మందను యాకోబు తన సేవకులకు అప్పగించాడు. అప్పుడు యాకోబు తన సేవకులతో ఒక్కో రకం జంతువుల మందను వేరు చేయండి నాకు ముందుగా నడుస్తూ, ఒక్కో మందకు మధ్య ఎడం ఉంచండి” అన్నాడు. |
17
|
యాకోబు వారికి ఇవ్వవలసిన ఆజ్ఞలన్నీ ఇచ్చాడు. మొదటి మంద వెంబడి ఉన్న సేవకులతో యాకోబు “నా అన్న ఏశావు నీ దగ్గరకు వచ్చి, ‘ఇవి ఎవరి జంతువులు? నీవు ఎక్కడికి వెళ్తున్నావు? నీవు ఎవరి సేవకుడువి?’ అని అడిగితే, |
18
|
‘ఇవి నీ సేవకుడైన యాకోబు మందలు. నా యజమాని ఏశావుకు కానుకగా యాకోబు వీటిని పంపించాడు. యాకోబు కూడా మా వెనుక వస్తున్నాడు’ అని నీవు చె ప్పాలి” అన్నాడు. |
19
|
అందరూ అలాగే చేయాలి అని రెండవ సేవకునికి, మూడవ సేవకునికి, మిగిలిన సేవకులందరికి యాకోబు ఆజ్ఞాపించాడు. “ఏశావును మీరు కలుసుకొన్నప్పుడు, ఏశావుకు మీరు ఇలానే చేయాలి.” |
20
|
ఇది నీ కోసం కానుక, నీ సేవకుడైన యాకోబు వెనుక ఉన్నాడు’ అని మీరు చె ప్పాలి అన్నాడు యాకోబు. “ఈ కానుకలు ఇచ్చి వీళ్లను ముందు పంపిస్తే ఒకవేళ ఏశావు నన్ను క్షమించి చేర్చుకొంటాడేమో” అనుకొన్నాడు యాకోబు. |
21
|
కనుక యాకోబు ఏశావుకు కానుకలు పంపించాడు. అయితే యాకోబు మాత్రం ఆ రాత్రి శిబిరంలోనే వుండిపోయాడు. |
22
|
ఆ రాత్రి చాలా గడిచిన తర్వాత యాకోబు లేచి బయల్దేరాడు. అతని భార్యలను, ఇద్దరు దాసీలను, తన పదకొండుమంది పిల్లలను అతడు తనతో కూడ వెంటబెట్టుకొని బయల్దేరాడు. యబ్బోకు నదిని దాటవలసిన చోట యాకోబు దాటాడు. |
23
|
తన కుటుంబాన్ని నది దాటించాడు యాకోబు. తర్వాత యాకోబు తనకి కలిగిన దాన్ని అంతటినీ నది దాటించాడు. |
24
|
అందరికంటే చివర యాకోబు నదిని దాటాడు. అయితే అతడు దాటక ముందు, అతడు ఇంకా ఒంటరిగా ఉండగానే, ఒక మనిషి వచ్చి అతనితో పోరాడాడు. సూర్యుడు ఉదయించే వరకు ఆ మనిషి అతనితో పోరాడాడు. |
25
|
ఆ మనిషి యాకోబును ఓడించలేనట్టు గ్రహించాడు. అందుచేత అతడు యాకోబు కాలును తాకాడు. అప్పుడే యాకోబు కాలి కీలు జారిపోయింది. |
26
|
అప్పుడు ఆ మనిషి, “నన్ను వెళ్లనివ్వు, సూర్యుడు వచ్చేస్తున్నాడు” అని యాకోబుతో అన్నాడు. కాని యాకోబు, “నేను నిన్ను వెళ్లనియ్యను. నీవు నన్ను ఆశీర్వదించాల్సిందే” అన్నాడు. |
27
|
“నీ పేరేమిటి?” ఆ మనిషి అడిగాడు. “నా పేరు యాకోబు” అన్నాడు యాకోబు. |
28
|
అప్పుడు, “నీ పేరు ఇకమీదట యాకోబు కాదు. ఇప్పుడు నీ పేరు ఇశ్రాయేలు. దేవునితోను, మనుష్యులతోను నీవు పోరాడి, ఓడిపోలేదు గనుక నీకు నేను ఈ పేరు పెడుతున్నాను” అన్నాడు ఆ మనిషి. |
29
|
అప్పుడు యాకోబు, “దయచేసి నీ పేరు ఏమిటో చెప్పు” అని అడిగాడు. అయితే ఆ మనిషి “నీవు నా పేరెందుకు అడగాలి?” అన్నాడు. అప్పుడే యాకోబును అతడు ఆశీర్వదించాడు. |
30
|
అందుచేత ఆ స్థలానికి పెనూయేలు అని యాకోబు పేరు పెట్టాడు. “ఇక్కడ దేవుణ్ణి నేను ముఖాముఖిగా చూసాను. అయినప్పుటికి నా ప్రాణం దక్కింది” అన్నాడు యాకోబు. |
31
|
అతడు పెనూయేలు దాటుతుండగా సూర్యుడు ఉదయించాడు. యాకోబు కాలికి అలా జరిగినందువల్ల అతడు కుంటుతున్నాడు. |
32
|
అందుచేత తొడ గూటి మీద ఉన్న కండరమును ఇశ్రాయేలీయులు ఈ రోజువరకు తినరు, ఎందుకంటే అక్కడే యాకోబుకు దెబ్బ తగిలింది. |
Genesis 32:13 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...