Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Exodus Chapters

Exodus 4 Verses

Bible Versions

Books

Exodus Chapters

Exodus 4 Verses

1 అప్పుడు మోషే, “నీవు నన్ను పంపించావు అని చెబితే ఇశ్రాయేలు ప్రజలు నమ్మరు గదా! ‘యెహోవా నీకు కనబడనే లేదు అంటారు వాళ్లు’ అన్నాడు దేవునితో.
2 అయితే దేవుడు, “నీ చేతిలోనిది ఏమిటి” అని మోషేను అడిగాడు. “ఇది నా చేతికర్ర” అని మోషే జవాబిచ్చాడు.
3 అప్పుడు దేవుడు, “నీ కర్ర కింద పడవెయ్యి” అన్నాడు. మోషే తన కర్రను నేల మీద పడేసాడు. ఆ కర్ర ఒక పాముగా మారిపోయింది. మోషే భయపడి దాని దగ్గర్నుండి పారిపోయాడు.
4 అయితే యెహోవా మోషేతో, “ముందుకు వెళ్లి ఆ పాము తోక అందుకో “ అన్నాడు. మోషే ముందుకు వెళ్లి పాముతోక అందుకొన్నాడు. మోషే అలా చేయగానే ఆ పాము మళ్లీ కర్ర అయిపోయింది.
5 “ఈ కర్రను ఇలా ప్రయోగించు, అప్పుడు మీ పూర్వీకుల దేవుడు, అబ్రాహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన యెహోవా నీకు ప్రత్యక్షమయ్యాడని నీ ప్రజలు నమ్ముతారు” అన్నాడు దేవుడు.
6 ఆ తర్వాత యెహోవా, “నీకు ఇంకో రుజువు ఇస్తాను. నీ చెయ్యి నీ చొక్కాలోపల పెట్టు” అన్నాడు మోషేతో. కనుక మోషే తన చొక్కా తెరిచి తన చేతిని లోపల పెట్టాడు. మళ్లీ మోషే తన చొక్కాలోనుంచి తన చేతిని బయటికి తీయగానే అది మారిపోయింది. అతని చేతినిండా మంచులాంటి తెల్లని కుష్ఠు మచ్చలు కప్పేసాయి.
7 “నీ చేతిని మళ్లీ నీ చొక్కాలో పెట్టు” అన్నాడు దేవుడు. మోషే తన చేతిని మళ్లీ తన చొక్కాలోపల పెట్టాడు. మోషే అలా పెట్టి మళ్లీ తన చేతిని బయటికి తీయగానే అతని చెయ్యి మారిపోయింది. ఇప్పుడు అతని చెయ్యి బాగైపోయి మళ్లీ మునుపటిలానే ఉంది.
8 “నీకర్రను ఉపయోగించినప్పుడు ప్రజలు నిన్ను నమ్మకపోతే, నీవు ఈ సూచన చూపెట్టినప్పుడు వాళ్లు నిన్ను నమ్ముతారు.
9 నీవు వాళ్లకు ఈ రెండు సూచనలు చూపించాక కూడ వాళ్లు నమ్మటానికి నిరాకరిస్తే, అప్పుడు నైలు నదిలోనుంచి కొన్ని నీళ్లు తీసుకో, ఆ నీళ్లను నేలమీద పొయ్యి. అవి నేలను తాకగానే రక్తం అవుతాయి” అన్నాడు దేవుడు.
10 అయితే మోషే దేవునితో, “కానీ ప్రభూ నేను నిజం చెప్పేస్తున్నాను. నేనేమీ నైపుణ్యంగల మాటకారిని కాను. నాకు మనుష్యులతో చక్కగా మాట్లాడ్డం ఎప్పుడూ చేతకాలేదు. కనీసం ఇప్పుడు నీతో మాట్లాడిన తర్వాత కూడ నేను మంచి మాటకారిని కాలేదు. నా మాట నిదానం అనీ, నాకు మంచి పద ప్రయోగం రాదనీ నీకు తెలుసు” అన్నాడు.
11 “మనిషి నోటిని చేసిందెవరు? ఒకన్ని చెవిటివాడిగా లేక మూగవాడిగా చేయగలిగింది ఎవరు? ఒకన్ని గుడ్డివానిగా చేయగలిగింది, చూడగలిగేటట్టు చేయగలిగింది ఎవరు? నీటన్నింటిని చేయగలిగింది నేనే, నేను యెహోవాను,
12 అందుచేత వెళ్లు. నీవు మాట్లాడేటప్పుడు నేను నీతో ఉంటాను. చెప్పాల్సిన మాటలు నేనే నీకు చెబతాను” అని అతనితో యెహోవా అన్నాడు.
13 కానీ మోషే, “నా ప్రభువా, నన్ను విడిచిపెట్టి మరెవర్నయినా పంపించుమని బతిమాలు కొంటున్నాను” అన్నాడు.
14 యెహోవాకు మోషేమీద కోపం వచ్చింది, “లేవీ వంశానికి చెందిన నీ సోదరుడు అహరోనును నేను వాడుకొంటాను. అతనికి మాట్లాడుటలో నైపుణ్యం ఉంది. అహరోను నీ దగ్గరకు వస్తాడు. నిన్ను చూచి సంతోషిస్తాడు,
15 అతడు నీతోకూడ ఫరో దగ్గరకు వస్తాడు. నీవు చెప్పాల్సిందేమిటో నేను నీకు చెబతాను, అది నీవు అహరోనుకు చెప్పాలి. ఫరోతో చెప్పటానికి అహరోను సరైన మాటల్ని సిద్ధం చేసుకొంటాడు.
16 ప్రజలతో కూడ అహరోనే నీ పక్షంగా మాట్లాడుతాడు. అతనికి నీవు ఒక మహారాజులా ఉంటావు. అతనే అధికారంతో నీ తరపున మాట్లాడతాడు.
17 కనుక వెళ్లు. నీతోకూడ నీ కర్ర తీసుకొని వెళ్లు. నీకు నేను తోడుగా ఉన్నానని ప్రజలకు తెలియడానికి నీ కర్రను, మిగతా అద్భుతాలను ప్రయోగించు” అన్నాడు దేవుడు.
18 అప్పుడు మోషే తన మామ యిత్రో ఇంటికి తిరిగి వెళ్లాడు. “ఈజిప్టులో నా ప్రజల దగ్గరకు నేను మళ్లీ వెళతాను, నన్ను పోనివ్వండి. వాళ్లు ఇంకా బతికే ఉన్నారేమో నేను వెళ్లి చూడాలి” అని యిత్రోతో చెప్పాడు మోషే. “నీవు సమాధానంగా వెళ్లొచ్చు” అన్నాడు యిత్రో మోషేతో.
19 తర్వాత మోషే ఇంకా మిద్యానులో ఉండగానే దేవుడు మోషేతో, “ఇప్పుడు నీవు మళ్లీ ఈజిప్టు వెళ్లడం నీకు క్షేమం. నిన్ను చంపాలని చూస్తున్న వాళ్లు ఇప్పుడు చనిపోయారు” అని చెప్పాడు.
20 కనుక మోషే తన భార్యను, తన కొడుకును బయల్దేరదీసి గాడిదల మీద ఎక్కించాడు. తిరిగి ఈజిప్టు దేశానికి ప్రయాణం కట్టాడు. దేవుని శక్తిగల తన కర్రను మోషే తనతో తీసుకొని వెళ్లాడు.
21 మోషే ఈజిప్టుకు ప్రయాణం చేస్తూండగా దేవుడు అతనితో మాట్లాడాడు: “నీవు ఫరోతో మాట్లాడేటప్పుడు నీవు ఏమేమి అద్భుతాలు చేసేందుకు నీకు శక్తి ఇచ్చానో వాటన్నింటినీ చేయాలని జ్ఞాపకం ఉంచుకో! అయితే నేను మాత్రం ఫరో ఇంకా మొండికెత్తేటట్లు చేస్తాను. అతడు ప్రజల్ని వెళ్లనియ్యడు.
22 అప్పుడు నీవు ఫరోతో
23 ‘ఇశ్రాయేలు నా ప్రథమ సంతానంగా పుట్టిన కుమారుడు. నా కుమారుడు వెళ్లి నన్ను ఆరాధించనివ్వు అని నేను నీతో చెబతున్నాను. నీవే గనుక ఇశ్రాయేలీయులను వెళ్లనివ్వకపోతే, నీ పెద్ద కుమారుణ్ణి నేను చంపేస్తాను.”‘ అని యెహోవా అనుచున్నాడని అతనితో చెప్పెను.
24 మోషే ఈజిప్టుకు తన ప్రయాణం కొనసాగించాడు. నిద్రపోవాలని అతడు ఒక సత్రములో ఆగాడు. అక్కడ దేవుడు మోషేను కలుసుకొని అతణ్ణి చంపదలచాడు.
25 కాని సిప్పోర పదునైన ఒక కత్తి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసింది. ఆ చర్మం పట్టుకొని ఆమె అతని పాదాలను తాకింది. అప్పుడు ఆమె (మోషేతో) “నీవు రక్త సంబంధమైన భర్తవు అని అంది”
26 సిప్పోర తన కుమారునికి సున్నతి చేసినందువల్ల ఇలా చెప్పింది. అందుచేత దేవుడు మోషేను క్షమించాడు (అతణ్ణి చంపలేదు).
27 యెహోవా అహరోనుతో, “అరణ్యంలోకి వెళ్లి మోషేను కలుసుకో “ అని చెప్పాడు. కనుక అహరోను వెళ్లి దేవుని పర్వతం దగ్గర మోషేను కలుసుకొన్నాడు. అహరోను మోషేను చూడగానే అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు.
28 దేవుడు తనతో చెప్పినదంతా మోషే అహరోనుతో చెప్పాడు. దేవుడు తనను ఎందుకు పంపిందీ, అహరోనుతో చెప్పాడు మోషే. అలాగే అతను చేయాల్సిన అద్భుతాలు, చూపాల్సిన రుజువులు అన్నింటిని మోషే అహరోనుకు వివరించాడు.
29 అందుచేత మోషే, అహరోనూ వెళ్లి ఇశ్రాయేలు పెద్దలందర్నీ సమావేశం చేసారు.
30 అప్పుడు ఆ ప్రజలతో వారు మాట్లాడారు. యెహోవా మోషేతో చెప్పిన విషయాలన్నీ అతడు వాళ్లతో చెప్పాడు. అప్పుడు వాళ్లందరూ చూచేటట్టు మోషే అద్భుతాలు చేసి రుజువు చేసాడు.
31 దేవుడు మోషేను పంపించాడని ఆ ప్రజలు నమ్మారు. ఇశ్రాయేలీయులకు సహాయం చేసేందుకు దేవుడు వచ్చాడని తెలిసి ఆ ప్రజలు దేవుని ముందర తలలు వంచుకొని ఆరాధించారు. వారి కష్టాలను దేవుడు చూసాడని తెలిసి వాళ్లు దేవుడ్ని ఆరాధించారు.

Exodus 4:1 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×