Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Exodus Chapters

Exodus 16 Verses

Bible Versions

Books

Exodus Chapters

Exodus 16 Verses

1 తర్వాత ప్రజలు ఏలీము నుండి ప్రయాణం చేసి సీనాయి ఎడారి చేరుకొన్నారు. ఈ స్థలం ఏలీముకి, సీనాయికి మధ్య ఉంది. ఈజిప్టు వదలిన తర్వాత రెండోనెల 15వ రోజున వారు ఈ స్థలానికి వచ్చారు.
2 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మళ్లీ ఫిర్యాదు చేయటం మొదలు పెట్టారు. ఆ ఎడారిలో వారు మోషే అహరోనులకు ఫిర్యాదు చేసారు.
3 “ఈజిప్టు దేశంలోనే యెహోవా మమ్మల్ని చంపేసి ఉంటే మాకు బాగుండేది. ఈజిప్టులో తినేందుకు మాకు సమృద్ధిగా ఉండేది. మాకు కావాల్సిన భోజనం అంతా మాకు ఉండేది. కానీ ఇప్పుడు నీవు మమ్మల్ని ఈ ఎడారిలోనికి తీసుకొచ్చావు. మేమంతా ఆకలితో ఇక్కడే చస్తాము” అంటూ ప్రజలు మోషే అహరోనులతో చెప్పారు.
4 అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు, “ఆకాశం నుండి ఆహారం కురిపిస్తాను. ఈ ఆహారం మీరు తినేందుకే. ప్రతిరోజూ ప్రజలు బయటకు వెళ్లి ఆరోజు తాము తినేందుకు ఎంత భోజనం అవసరమో అంతే సమకూర్చు కోవాలి. నేను చెప్పినట్టు ప్రజలు చేస్తారో లేదో చూద్దామని నేను యిలా చేసాను.
5 ఒక్క రోజుకు ఎంత భోజనం సరిపోతుందో సరిగ్గా అంతే ప్రజలు ప్రతిరోజూ తీసుకోవాలి. అయితే శుక్రవారం నాడు ప్రజలు భోజనం సిద్ధం చేసుకొనేటప్పుడు రెండు రోజులకు సరిపడే భోజనం ఉండేటట్టు వారు చూసుకోవాలి.
6 కనుక మోషే అహరోనులు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పారు, “ఈ రాత్రి యెహోవా శక్తి మీరు చూస్తారు. ఈజిప్టు దేశం నుండి ఆయనే మిమ్మల్ని రక్షించాడని మీరు తెలుసుకొంటారు.
7 యెహోవా మహిమను రేపు ఉదయం మీరు చూస్తారు. యెహోవాకు మీరు ఫిర్యాదు చేసారు. ఆయన మా మనవి విన్నాడు. (ఆయన మీకు సహాయం చేస్తాడు) మీరు మా దగ్గర ఫిర్యాదు మీద ఫిర్యాదు చేసారు. మేము ఏ పాటి వారం?”
8 “మీరు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు, యెహోవా మీ ఫిర్యాదులు విన్నాడు. కనుక రాత్రివేళ ఆయన మీకు మాంసం ఇస్తాడు. మీకు అవసరం ఉన్న భోజనం అంతా ప్రతి ఉదయం మీకు ఉంటుంది. నా దగ్గర, అహరోను దగ్గర మీరు ఫిర్యాదు చేస్తూ ఉండినారు. కానీ ఇప్పుడు మేము కొంచెం విశ్రాంతి తీసుకొంటాం. మీరు ఫిర్యాదు చేస్తోంది నా మీద, అహరోను మీద కాదని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు యెహోవాకు విరోధంగా ఫిర్యాదు చేస్తున్నారు” అన్నాడు మోషే.
9 ఆ తర్వాత మోషే అహరోనుతో, “నీవు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడు: ‘యెహోవా, మీ ఫిర్యాదులు విన్నాడు గనుక ఆయన ఎదుట సమావేశం అవ్వండి’ అని వారితో చెప్పు అన్నాడు.”
10 అహరోను ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడాడు. వాళ్లంతా ఒక్కచోట చేరారు. అహరోను మాట్లాడుతూ ఉండగా, ప్రజలంతా పక్కకు తిరిగి ఎడారిలోకి చూచారు. యెహోవా మహిమ ఒక మేఘంలా ప్రత్యక్షమవడం వారు చూశారు.
11 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు:
12 “ఇశ్రాయేలు ప్రజల ఫిర్యాదులు నేను విన్నాను. కనుక నేను చెబతున్న నా మాటలు వారికి చెప్పు. ‘రాత్రివేళ మాంసం మీరు తింటారు. ప్రతి ఉదయం మీకు కావాల్సినంత భోజనం మీరు తింటారు. అప్పుడు మీ యెహోవా దేవుణ్ణి నమ్ముకోవచ్చని మీరు తెలుసుకొంటారు.” ‘
13 ఆ రాత్రి వారి బస అంతటా పూరీళ్లు (పిట్టలు) వచ్చాయి. (మాంసం కోసం ప్రజలు ఈ పిట్టల్ని పట్టుకొన్నారు) ప్రతి ఉదయం బసకు దగ్గర్లో నేలమీద మంచు కురిసింది.
14 సూర్యోదయం కాగానే ఆ మంచు కరిగిపోయింది. అయితే మంచు పోగానే నేలమీద నూగుమంచు ఉండేది.
15 ఇశ్రాయేలు ప్రజలు అది చూసి “అది ఏమిటి?” అంటూ ఒకళ్లనొకళ్లు ప్రశ్నించుకొన్నారు. ఈ పదార్థం ఏమిటో వారికి అర్థం కాలేదు కనుక వాళ్లు ఈ ప్రశ్న అడిగారు. మోషే వాళ్లతో చెప్పాడు: “మీరు భోజనంచేయడానికి యెహోవా మీకు ఇచ్చిన భోజనం ఇది.
16 ప్రతి వ్యక్తి తనకు అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. మీ కుటుంబంలో ప్రతి వ్యక్తికీ 2 పావుల కొలత ప్రకారం మీలో ఒక్కొక్కరు తీసుకోవాలి అని యెహోవా చెబతున్నాడు.”
17 కనుక ఇశ్రాయేలు ప్రజలు అలాగే చేసారు. ప్రతి వ్యక్తి ఈ భోజనం కూర్చుకొన్నారు. కొంతమంది మిగతా వాళ్ల కంటె ఎక్కువ కూర్చుకొన్నారు.
18 ఆ ప్రజలు వారి కుటుంబంలో ప్రతివొక్కరికీ ఆ భోజనం పెట్టారు. ఆ భోజన పదార్థం కొలుచుకొన్నప్పుడల్లా, ప్రతి వ్యక్తికీ సరిపడ్డంత మాత్రమే ఉండేది. కాని ఎన్నడూ ఎక్కువ మిగిలేది కాదు. ప్రతి వ్యక్తీ తాను, తన కుటుంబం ఎంత తినగలరో సరిగ్గా అంతే తీసుకొన్నారు.
19 “రేపటికోసం ఆ భోజనం దాచుకోకండి” అని మోషే వారితో చెప్పాడు.
20 కానీ ప్రజలు మోషేకు లోబడలేదు. కొంత మంది మర్నాడు తినవచ్చని తమ భోజనంలో కొంత దాచుకొన్నారు. అలా దాచుకొన్న భోజనం పురుగులు పట్టేసి, కంపు కొట్టేసింది. ఇలా చేసినవాళ్ల మీద మోషేకు కోపం వచ్చింది.
21 ప్రతి ఉదయం ప్రజలు భోజనం కూర్చుకొన్నారు. ప్రతి వ్యక్తీ తాను తిన గలిగినంత కూర్చుకొన్నాడు. అయితే, ఎండ ఎక్కువ కాగానే ఆహారం కరిగిపోయి కనబడకుండా పోయింది.
22 శుక్రవారంనాడు, రెండంతల ఆహారం ప్రజలు కూర్చుకొన్నారు. ఒక్కొక్క మనిషికి 4 పావుల ప్రకారం వారు కూర్చుకొన్నారు. కనుక ప్రజానాయకులు మోషే దగ్గరకు వచ్చి ఈ విషయం తెలియజేసారు.
23 “ఇలా జరుగుతుందని యెహోవా చెప్పాడు. ఎందుచేత? రేపు సబ్బాతు కనుక. అది యెహోవాకు ప్రత్యేకంగా విశ్రాంతి రోజు. ఈరోజు వండుకోవాల్సిన భోజనం అంతా వండుకోండి, అయితే మిగతా భోజనం రేపు ఉదయానికి దాచుకోండి” అన్నాడు మోషే వాళ్లతో.
24 కనుక ప్రజలు ఆ భోజనంలో మిగిలినదాన్ని మర్నాటికోసం దాచుకొన్నారు. ఆ భోజనంలో ఏమీ చెడిపోలేదు. అందులో కొంచెము కూడా పురుగుపట్టలేదు.
25 శనివారం నాడు ప్రజలతో మోషే ఇలా చెప్పాడు: “ఈవేళ సబ్బాతు, అంటే యెహోవా విశ్రాంతి రోజు. అందుచేత మీలో ఏ ఒక్కరూ బయట పొలాల్లో ఉండకూడదు. నిన్న కూర్చుకొన్న భోజనాన్ని తినండి.
26 ఆరు రోజుల కోసం మీరు ఆహారం కూర్చుకోవాలి. అయితే ఏడోరోజు విశ్రాంతి రోజు కనుక నేల మీద ప్రత్యేక ఆహారం ఏమీ దొరకదు.”
27 శనివారంనాడు ప్రజల్లో కొంతమంది ఆహారం కూర్చుకోవాలని బయటకు వెళ్లారు కాని వారికి ఆహారం ఏమీ కనబడలేదు.
28 అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు. “నా ఆజ్ఞలకు ఉపదేశాలకు లోబడకుండా ఎన్నాళ్లు మీరు తిరస్కరిస్తారు?”
29 చూడండి, శనివారం మీకు విశ్రాంతి రోజుగా చేసాడు యెహోవా. అందుచేత రెండు రోజులకు సరిపడేంత ఆహారం శుక్రవారమే యెహోవా మీకు ఇస్తాడు. కనుక శనివారంనాడు మీలో ప్రతి ఒక్కరూ కూర్చొని విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కడి వాళ్లు అక్కడే ఉండండి.”
30 కనుక శనివారంనాడు ప్రజలు విశ్రాంతి తీసుకొన్నారు.
31 ఆ ప్రత్యేక ఆహారాన్ని “మన్నా” అని పిలవడం మొదలుబెట్టారు ప్రజలు. మన్నా కొత్తిమెర గింజల్లా చిన్నగా తెల్లగా ఉండి, తేనెపూసిన పూతరేకుల్లా ఉంది.
32 అప్పుడు మోషే అన్నాడు, “నేను మిమ్మల్ని ఈజిప్టునుండి బయటికి రప్పించినప్పుడు ఎడారిలో నేను మీకు ఇచ్చిన ఆహారాన్ని మీ సంతానం వాళ్లు చూడ గలిగేటట్టు ఈ ఆహారం 2 పావులు దాచి ఉంచమని’ యెహోవా చెప్పాడు.”
33 కనుక మోషే అహరోనుతో ఇలా అన్నాడు: “ఒక పాత్ర తీసుకొని దానిలో 8 పావులు మన్నా నింపు. ఈ మన్నాను మన సంతానం వారి కోసం దాచిపెట్టు”
34 మోషే యెహోవా చెప్పినట్టు చేసాడు. మన్నా పాత్రను ఒడంబడిక పెట్టె ముందర పెట్టాడు అహరోను.
35 40 సంవత్సరాల పాటు ప్రజలు మన్నా తిన్నారు. కనాను దేశ సరిహద్దుల వచ్చేంతవరకు వారు దాన్ని తిన్నారు
36 (మన్నా కొలిచేందుకు వారి ఉపయోగించిన కొలత ఓమెరు. ఓమెరు అంటే ఏపాలో పదో భాగం).

Exodus 16:1 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×