Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Exodus Chapters

Exodus 15 Verses

Bible Versions

Books

Exodus Chapters

Exodus 15 Verses

1 అప్పుడు మోషే, అతనితో బాటు ఇశ్రాయేలు ప్రజలూ యెహోవాకు ఈ పాట పాడటం మొదలు పెట్టారు. “యెహోవాను గూర్చి నేను గానం చేస్తాను. ఆయన గొప్ప కార్యాలు చేసాడు గనుక గుర్రాలను, రౌతులను ఆయనే సముద్రంలో పడవేసాడు.
2 యెహోవా నా బలం, నన్ను రక్షించేది ఆయనే ఆయన్ను గూర్చి నేను స్తుతిగీతాలు పాడుకొంటాను. యెహోవా నా దేవుడు, ఆయన్ను నేను స్తుతిస్తాను. నా పూర్వీకుల దేవుడు యెహోవా ఆయన్ని నేను ఘనపరుస్తాను.
3 యెహోవా గొప్ప వీరుడు ఆయన పేరే యెహోవా.
4 ఫరో రథాలను అశ్వదళాలను సముద్రంలో పడవేసాడు యెహోవా ఫరో ప్రధాన అధికారులు ఎర్ర సముద్రంలో మునిగిపోయారు.
5 లోతైన జలాలు వారిని కప్పేసాయి లోతు నీటిలో బండల్లా వాళ్లు మునిగిపొయ్యారు.
6 “నీ కుడిచేతిలో ఆశ్చర్యం కలిగించేటంత బలం ఉంది. ప్రభూ, నీ కుడిచేయి శత్రువును పటాపంచలు చేసింది.
7 నీకు వ్యతిరేకంగా నిలిచిన వారిని నీ మహా ఘనత చేత నాశనం చేసావు గడ్డిని తగుల బెట్టినట్టు నీ కోపం వారిని నాశనం చేసింది.
8 నీవు విసరిన పెనుగాలి నీళ్లను ఉవ్వెత్తున నిలిపేసింది వేగంగా ప్రవహించే నీళ్లు గట్టి గోడలా అయ్యాయి సముద్రం, దాని లోపలి భాగాలవరకు గడ్డ కట్టెను.
9 శత్రువు, “నేను వాళ్లను తరిమి పట్టుకొంటాను వాళ్ల ఐశ్వర్యాలన్నీ దోచుకొంటాను నేను నా కత్తి ప్రయోగించి, వాళ్ల సర్వస్వం దోచుకొంటాను సర్వం నా కోసమే నా చేతుల్తో దోచుకొంటాను” అని అన్నాడు.
10 కానీ నీవు వాళ్లు మీదకి గాలి రేపి సముద్రంతో వాళ్లను కప్పేసావు సముద్ర అగాధంలో సీసం మునిగిపోయినట్టు వాళ్లు మునిగిపొయ్యారు.
11 “యెహోవా, నీలాంటి పరాక్రమముగల దేవుడు మరొకడు లేడు పరిశుద్ధతలో నీవు గొప్పవాడవు. స్తుతి కీర్తనలతో ఆరాధించబడుటకు యోగ్యుడవు ఆశ్చర్యకార్యములు చేయువాడవు నీకు సాటి వేరెవ్వరూ లేరు.
12 నీ కుడి హస్తాన్ని పైకెత్త ప్రపంచాన్నే నాశనం చేయగలవు!
13 నీవు రక్షించిన ప్రజల్ని నీ దయతో నీవు నడిపిస్తావు ఉల్లాసకరమైన నీ పవిత్ర దేశానికి నీ బలంతో నీవు వీళ్లను నడిపిస్తావు.
14 “ఈ గాథను ఇతర జన సమూహాలు వింటారు ఎంతైనా వాళ్లు భయపడ్తారు. ఫిలిష్తీ ప్రజలు భయంతో వణకిపోతారు.
15 తరువాత ఎదోము నాయకులు భయంతో వణకిపోతారు మోయాబు నాయకులు భయంతో వణకిపోతారు. కనాను ప్రజలు తమ ధైర్యం కోల్పోతారు.
16 ఆ ప్రజలు నీ బలాన్ని చూచి భయంతో నిండిపోతారు యెహోవా ప్రజలు దాటి పొయ్యేంత వరకు ఆ ప్రజల్ని నీవు దాటించేంత వరకు వాళ్లు బండలా మౌనంగా ఉండిపోతారు.
17 యెహోవా నీవు నీ సింహాసనం కోసం సిద్ధం చేసిన నీ పర్వతానికి నీ ప్రజల్ని నడిపిస్తావు ఓ ప్రభో, నీ హస్తాలతో నీ ఆలయాన్ని నిర్మించు
18 యెహోవా శాశ్వతంగా సదా ఏలునుగాక!”
19 ఫరో గుర్రాలు, రౌతులు, రథాలు సముద్రంలోకి వెళ్లిపొయ్యాయి. సముద్ర జలాలతో యెహోవా వాళ్లను కప్పేసాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు పొడి నేల మీద సముద్రంలో నడిచివెళ్లారు.
20 అప్పుడు అహరోను సోదరి, మహిళా ప్రవక్తి మిర్యాము తంబుర పట్టుకొంది. మిర్యాము, మిగతా స్త్రీలు పాటలు పాడుతూ నాట్యం చేయడం మొదలు పెట్టారు. మిర్యాము ఈ మాటనే మరల మరల పల్లవిగా పలికింది,
21 “ఆయన గొప్ప కార్యాలు చేసాడు గనుక యెహోవాకు గానం చేయండి గుర్రాలను, దాని రౌతులను ఆయన సముద్రంలో పడవేసాడు.”
22 మోషే మాత్రం ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం నుండి దూరంగా నడిపిస్తూనే ఉన్నాడు. ప్రజలు షూరు ఎడారిలోకి వెళ్లారు. ఎడారిలో మూడు రోజులు వాళ్లు ప్రయాణం చేసారు. ప్రజలకు నీళ్లు ఏవీ దొరకలేదు.
23 మూడురోజుల తర్వాత ప్రజలు మారాకు ప్రయాణమై వెళ్లారు. మారాలో నీళ్లున్నాయి గాని అవి త్రాగలేకపోయారు. ఆ నీళ్లు త్రాగలేనంత చేదుగా ఉన్నాయి. అందుకే ఆ స్థలానికి మారా అని పేరు.
24 ప్రజలు మోషేకు ఫిర్యాదు చేయటం మొదలు బెట్టారు, “ఇప్పుడు మేము ఏమి త్రాగాలి?” అన్నారు ప్రజలు.
25 మోషే యెహోవాకు మొర పెట్టాడు. యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. మోషే ఆ చెట్టును నీళ్లలో వేసాడు. అతను యిలా చేయగానే ఆ నీళ్లు తాగే మంచి నీళ్లయ్యాయి. ఆ స్థలంలో ప్రజలకు యెహోవా తీర్పు తీర్చి వారికి ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఆ ప్రజల విశ్వాసాన్ని కూడ యెహోవా పరీక్షించాడు.
26 “మీ యెహోవా దేవునికి మీరు విధేయులు కావాలి. ఆయన ఏవి సరైనవని చెబతాడో వాటిని మీరు చేయాలి. యెహోవా ఆజ్ఞలకు, చట్టానికి మీరు విధేయులైతే, ఈజిప్టు వాళ్లలా మీరు రోగులు అవ్వరు. నేను, యెహోవాను, ఈజిప్టు వాళ్ల మీదకు పంపిన రోగాలు ఏవీ మీ మీదకు పంపించను. నేనే యెహోవాను. మిమ్మల్ని స్వస్థపరచేవాడ్ని నేనే.”
27 అప్పుడు ప్రజలు ఏలీమునకు ప్రయాణమయ్యారు. ఏలీములో 12 నీటి ఊటలు ఉన్నాయి. ఇంకా అక్కడ 70 ఈత చెట్లు ఉన్నాయి. అందుచేత ఆ నీళ్ల దగ్గర వారు బసను ఏర్పాటు చేసుకొన్నారు.

Exodus 15:19 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×