సోదరులారా! చివరి మాట, ప్రభువు మీకు కావలసినంత ఆనందం ప్రసాదించుగాక! వ్రాసిన విషయాలే మళ్ళీ వ్రాయటానికి నేను వెనుకాడను. దాని వల్ల మీకు యింకా ఎక్కువ లాభం కలుగుతుంది.
మనం దేవుణ్ణి ఆయన ఆత్మ ద్వారా ఆరాధిస్తున్నాము. [*మనం … ఆరాధిస్తున్నాము లేక దేవుని ఆత్మచేత ఆరాధిస్తున్నాము.] ఇది నిజమైన సున్నతి. వాళ్ళు పొందిన సున్నతిలాంటిది కాదు. మనము యేసు క్రీస్తులో ఉన్నందుకు గర్విస్తున్నాము. కనుక బాహ్యంగా కనిపించే ఈ ఆచారాలను మనము విశ్వసించము.
కాని అలాంటి ఆచారాలను విశ్వసించటానికి నాకు కారణాలు ఉన్నాయి. బాహ్యమైన ఈ ఆచారాలను నమ్మటం ముఖ్యమని యితరులు అనుకొంటున్నట్లైతే వాటిని నమ్మటానికి వాళ్ళకన్నా నాకు ఎక్కువ కారణాలు ఉన్నాయి.
నేను పుట్టిన ఎనిమిదవ రోజు నాకు సున్నతి చేసారు. నేను బెన్యామీను తెగకు చెందిన వాణ్ణి. పుట్టుకతో ఇశ్రాయేలు దేశస్థుణ్ణి. హెబ్రీయులకు జన్మించిన హెబ్రీయుణ్ణి. ధర్మశాస్త్రాన్ని అనుసరించే పరిసయ్యుణ్ణి.
అంతేకాక, నా ప్రభువైన యేసు క్రీస్తును తెలుసుకోవటం చాలా గొప్ప విషయం. ఆయనతో పోల్చి చూస్తే అన్నీ వృధా అనిపిస్తుంది. ఆయన కొరకు నేను అన్నీ వదిలి వచ్చాను. క్రీస్తును పొందాలని వాటిని చెత్తగా పరిగణిస్తున్నాను.
నాకు క్రీస్తును తెలుసుకోవాలని ఉంది. చావునుండి బ్రతికి రాగల శక్తిని గురించి తెలుసుకోవాలని ఉంది. ఆయన పొందిన కష్టాల్లో పాలుపంచుకొని ఆయనతో స్నేహం పొందాలని ఉంది. ఆయనతో మరణించి ఆయనలా అయిపోవాలని ఉంది.
వీటన్నిటిని నేను యింకా సాధించలేదు. నాలో పరిపూర్ణత యింకా కలుగలేదు. కాని క్రీస్తు దేనికోసం నన్ను ఎన్నుకొన్నాడో దాన్ని నేను చేజిక్కించుకోవాలని పట్టుదలతో సాగిపోతున్నాను.
ఆత్మీయంగా పరిపూర్ణత పొందిన మనమంతా అన్ని విషయాల్లో యిలాంటి దృక్పథం ఉంచుకోవాలి. ఒకవేళ మీలో ఎవరికైనా దేని మీదనన్నా వేరు అభిప్రాయం ఉంటే దేవుడు దాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాడు.