Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Leviticus Chapters

Leviticus 7 Verses

Bible Versions

Books

Leviticus Chapters

Leviticus 7 Verses

1 “అపరాధ పరిహారార్థ బలుల నియమాలు ఇవి. ఇది అతి పరిశుద్ధం.
2 దహనబలి అర్పణలు వారు ఎక్కడ వధిస్తారో అక్కడే అపరాధ పరిహారార్థ బలులను కూడా యాజకుడు వధించాలి. అంతట యాజకుడు అపరాధ పరిహారార్థ బలి రక్తాన్ని బలిపీఠం చుట్టూ చిలకరించాలి.
3 “అపరాధ పరిహారార్థ బలిలోని కొవ్వు అంతటినీ యాజకుడు అర్పించాలి. దాని కొవ్విన తోకను, దాని లోపలి భాగాలమీది కొవ్వును,
4 రెండు మూత్ర గ్రంథులను, వాటిమీద కొవ్వును, నడుందగ్గరి కొవ్వును, కార్జం యొక్క కొవ్విన భాగాన్ని అతడు అర్పించాలి. దానిని మూత్ర గ్రంథులతో బాటు అతడు తీసివేయాలి.
5 వీటన్నింటినీ బలిపీఠం మీద యాజకుడు దహించాలి. అవి యెహోవాకు హోమంగా అర్పించబడ్డ అర్పణలు అవుతాయి. అది అపరాధ పరిహారార్థబలి.
6 “యాజకుని కుటుంబంలో ఏ పురుషుడై నాసరే అపరాధపరిహారార్థ బలిని తినవచ్చును. అది అతి పరిశుద్ధం గనుక దాన్ని ఒక పరిశుద్ధ స్థలంలోనే తినాలి.
7 అపరాధి పరిహారార్థ బలి కూడా పాపపరిహారార్థ బలిలాంటిదే. రెండు అర్పణలకు నియమాలు ఒక్కటే. బలులను చేసే యాజకుడు ఆహారంగా ఆ మాంసం తీసుకొంటాడు.
8 బలి అర్పణ చేసే యాజకుడు దహన బలిపశువు చర్మాన్ని కూడా తీసుకోవచ్చును.
9 ధాన్యార్పణ పెట్టే యాజకునికే ప్రతి ధాన్యార్పణ చెందుతుంది. పొయ్యిమీద వండిన ప్రతి ధాన్యార్పణ, పాత్రలోగాని, పెనంమీదగాని వండిన ప్రతి ధాన్యార్పణ ఆ యాజకునిదే అవుతుంది.
10 ధాన్యార్పణలన్నీ అహరోను కుమారులకే చెందుతాయి. అవి పొడివైనా, లేక నూనెతో కలుపబడినా భేదం ఏమీ లేదు. అహరోను కుమారులు (యాజకులు) అందరూ ఈ ఆహారాన్ని పంచుకోవాలి.
11 “ఒక వ్యక్తి యెహోవాకు అర్పించాల్సిన సమాధాన బలులను గూర్చిన విధి ఇది.
12 ఆ వ్యక్తి తన కృతజ్ఞతలు తెలుపుకొనేందుకు సమాధాన బలులు తేవచ్చును. కృతజ్ఞతలు చెల్లించేందుకు అతడు తన బలిని తీసుకొని వచ్చినట్లయితే, నూనెతో కలుపబడిను పులియని రొట్టెలను, నూనె పూసిన పొంగని అప్పడాలు, నూనెకలిపి కాల్చబడిన గోధుమ పిండివంటలు అతడు అర్పించాలి.
13 సమాధాన బలితో బాటు, పులియని రొట్టెలనుగూడ అతడు అర్పణగా తీసుకొనిరావాలి. ఇది ఒకడు తన కృతజ్ఞతను దేవునికి తెలియజేసేందుకు తీసుకొని రావాల్సిన అర్పణను గూర్చిన విధి.
14 సమాధాన బలుల రక్తాన్ని చిలకరించే యాజకునికి ఆ రొట్టెలలో ఒకటి చెందుతుంది.
15 ఈ సమాధాన బలి అర్పించిన రోజునే దాని మాంసం తినివేయాలి. దేవునికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు ఒక పద్ధతిగా ఒకడు కానుక అర్పిస్తాడు. కాని దాని మాంసంలో ఏమీ మర్నాటి ఉదయం వరకు మిగిలి ఉండకూడదు.
16 “ఒక వ్యక్తి కేవలం దేవునికి ఒక కానుకగా మాత్రమే సమాధాన బలిని తేవచ్చును. లేక ఒక వ్యక్తి దేవునికి ఒక ప్రత్యేక వాగ్దానం చేసుకొని ఉండొచ్చు. అదే నిజ మైతే ఆ బలిని అర్పించిన రోజునే దాన్ని తినివేయాలి. ఒకవేళ ఏమైనా మిగిలితే, మర్నాడు దాన్ని తినివేయాలి.
17 అయితే ఈ బలి పశువు మాంసం మూడోరోజుకు కూడా మిగిలి ఉంటే దానిని నిప్పుమీద కాల్చివేయాలి.
18 సమాధాన బలిలోని మాంసాన్ని ఎవరైనా మూడో రోజున తింటే. ఆ వ్యక్తి విషయంలో యెహోవా సంతోషించడు. ఆ బలిని అతని పక్షంగా యెహోవా లెక్కించడు. ఆ బలి ఆపవిత్రం అవుతుంది. ఆ మాంసంలో ఏదైనా తిన్నవాడు తన పాపానికి తానే బాధ్యుడవుతాడు.
19 “ఏదైనా అపవిత్రమైన దానికి తగిలిన మాంసాన్ని కూడా ప్రజలు తినకూడదు. అలాంటి మాంసాన్ని వారు అగ్నితో కాల్చివేయాలి. పరిశుద్ధమైన ప్రతివ్యక్తీ మాంసం తినవచ్చును.
20 కానీ అపవిత్రమైనవాడు ఒకడు, యెహోవాకు చెందిన సమాధాన బలి మాంసం తిన్నట్లయితే, అతణ్ణి తన ప్రజల్లోనుండి వేరు చేయాలి.
21 “ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా అపవిత్రమైన దాన్ని ముట్టవచ్చు. అది మనుష్యులచేత అపవిత్రం చేయబడిందే కావచ్చు లోక అపవిత్రమైన జంతువు కావచ్చు లేక అసహ్యకరమైన అపవిత్రత కావచ్చును. అలాంటివాడు అపవిత్రుడు. యెహోవాకు చెందిన సమాధాన బలి మాంసం అతడు తిన్నట్లయితే ఆ వ్యక్తిని అతని ప్రజల్లోనుండి వేరు చేయాలి.”
22 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
23 “ఇశ్రాయేలు ప్రజలతో పశువుల, గొర్రెల, మేకల కొవ్వును మీరు తినకూడదని చెప్పు.
24 వాటంతట అవే చచ్చినా, లేక యితర జంతువుల చేత చంపబడినా వాటి కొవ్వును మీరు వాడుకోవచ్చును. కాని దాన్ని మాత్రం ఎప్పుడూ తినకూడదు.
25 యెహోవాకు హోమంగా అర్పించబడిన జంతువు కొవ్వును ఒక వ్యక్తి తింటే ఆ వ్యక్తిని అతని ప్రజల్లోనుంచి వేరు చేయాలి.
26 మీరు ఎక్కడ నివసించినాసరే జంతువు రక్తంగాని, పక్షిరక్తంగాని ఎప్పుడూ మీరు తినకూడదు.
27 ఎవరైనా సరే ఈ రక్తాన్ని తింటే ఆ వ్యక్తిని అతని ప్రజల్లోనుంచి వేరుచేయాలి.”
28 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు:
29 “ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, ఒక వ్యక్తి సమాధాన బలిని యెహోవాకు తీసుకొని వస్తే ఆ కానుకలో కొంత భాగాన్ని యెహోవాకు ఆ వ్యక్తి ఇవ్వాలి.
30 కానుకలోని ఆ భాగాన్ని హోమంగా కాల్చాలి. ఆ కానుకను అతడు స్వయంగా తన చేతుల్తో తీసుకొని రావాలి. ఆ జంతువు బోరమీదనున్న కొవ్వును, బోరను యాజకుని దగ్గరకు అతడు తీసుకొని రావాలి. ఆ బోర యెహోవా ఎదుట పైకి ఎత్తబడుతుంది. ఇదే ఆ నైవేద్యము.
31 అప్పుడు యాజకుడు బలిపీఠం మీద కొవ్వును దహించాలి. అయితే ఆ జంతువు బోర అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది.
32 సమాధాన బలి పశువు కుడితొడ కూడా మీరు యాజకునికి ఇవ్వాలి.
33 సమాధాన బలి పశువు రక్తాన్ని మరియు కొవ్వును అర్పించే యాజకునికే సమాధాన అర్పణలోని కుడి తొడ చెందుతుంది.
34 నైవేద్యంలోని బోరను, సమాధాన అర్పణలోని కుడి తొడను ఇశ్రాయేలు ప్రజలనుండి నేను తీసుకొని, అహరోనుకు, మరియు అతని కుమారులకు నేను వాటినిస్తున్నాను. ఇది ఇశ్రాయేలు ప్రజలకు శాశ్వతమైన విధి.”
35 యెహోవాకు అగ్నిచేత అర్పించబడు అర్పణల్లో, ఆ భాగాలు అహరోనుకు, అతని కుమారులకు చెందుతాయి. అహరోనుకు, అతని కుమారులు యెహోవాకు యాజకులుగా పని చేసినప్పుడు బలి అర్పణల్లో వారికి కొంతభాగం లభిస్తుంది.
36 యెహోవా, యాజకులను అభిషేకించినప్పుడే ఈ విషయాన్ని చెప్పాడు, ఇశ్రాయేలు ప్రజలు ఆ భాగాలను యాజకులకు ఇవ్వవలెను. వారి తరాలన్నింటిలో శాశ్వతంగా వారు ఆ భాగాలను యాజకులకు ఇవ్వాలి.
37 దహన బలి అర్పణ, నైవేద్యము, పాపపరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, యాజకుల నియామకం, సమాధాన బలి విధులు అవి.
38 సీనాయి పర్వతంమీద మోషేకు యెహోవా వాటిని ఇచ్చాడు. సీనాయి ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు వారి అర్పణలు తీసుకొని రావాలని ఆయన ఆజ్ఞాపించిన రోజునే ఈ విధులను యెహోవా ఇచ్చాడు.

Leviticus 7:7 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×