“ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: ఒకవ్యక్తి యెహోవాకు ఒక ప్రత్యేక వాగ్దానం చేయవచ్చు. ఆ వ్యక్తి ఒక మనిషిని యెహోవాకు అర్పిస్తానని వాగ్దానం చేసి ఉండొచ్చు. అలాగైతే ఆ మనిషి ఒక ప్రత్యేక విధానంలో యెహోవాను సేవించాలి. ఆ మనిషికి యాజకుడు కొంత విలువ నిర్ణయించాలి. ప్రజలు ఆ మనిషిని యెహోవా దగ్గర తిరిగి కొనాలంటే వారు ఆ విలువ చెల్లించాలి.
“ఒక మనిషి ఆ వెల చెల్లించలేనంత పేదవాడైతే ఆ వ్యక్తిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. ఆ వ్యక్తి ఎంత మొత్తం చెల్లించగలడు అనే విషయం యాజకుడు తీర్మానిస్తాడు.
ఆ వ్యక్తి ఆ జంతువునే యోహోవాకు ఇస్తానని వాగ్దానం చేసాడు గనుక దానికి బదులు ఇంకోదాన్ని యివ్వటానికి అతడు ప్రయత్నించకూడదు. ఇంకో దానితో దీన్ని మార్చేందుకు అతడు ప్రయత్నించకూడదు. మంచి జంతువుకు బదులుగా పనికిరాని జంతువును మార్చాలని అతడు ప్రయత్నించకూడదు. పనికిరాని జంతువుకు బదులుగా మంచి జంతువును మార్చాలనీ అతడు ప్రయత్నించకూడదు. ఆ మనిషి అలా జంతువుల్ని మార్చటానికి ప్రయత్నిస్తే, అప్పుడు ఆ జంతువులు రెండూ పవిత్రం అవుతాయి. అందుచేత అవి రెండూ యెహోవాకే చెందుతాయి.
“కొన్ని జంతువులు యెహోవాకు అర్పించేందుకు పనికిరావు. అలాంటి అపవిత్ర జంతువును ఒకదాన్ని ఒకడు యోహోవాకు యిచ్చేందుకు తీసుకొనివస్తే, అప్పుడు ఆ జంతువును యాజకుని దగ్గరకు తీసుకొనిరావాలి.
“ఇప్పుడు ఒక వ్యక్తి తన ఇంటిని యెహోవాకు పవిత్రంగా ప్రతిష్ఠ చేస్తే, యాజకుడు దాని వెల నిర్ణయం చేయాలి. యాజకుడు అలా వెల నిర్ణయిస్తే ఆ ఇల్లు మంచిదేగాని, పనికి రానిదేగాని ఆ వెల అంతే.
“ఒక వ్యక్తి తన పొలాల్లో కొంత భాగం యెహోవాకు ప్రతిష్ఠ చేస్తే, దానిలో నాటేందుకు ఎంత విత్తనం అవసరం ఉంటుందో అనేదానిమీద ఆ పొలాల వెల ఆధారపడి ఉంటుంది. పది తూముల యవల విత్తనాల వెల ఏబై తులాల వెండితో సమానము
కానీ ఆ వ్యక్తి బూరధ్వని మహోత్సన కాలం దాటిపోయాక తన పొలాన్ని కానుకగా యిస్తే, దాని ఖచ్చితమైన వెలను యాజకుడు నిర్ణయించాలి. తర్వాత వచ్చే బూరధ్వని మహోత్సవ కాలానికి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో అతడు లెక్కించాలి. అప్పుడు ఆ లెక్క ఆధారంగా వెలకట్టాలి.
ఒకవేళ తన పొలాన్ని కానుకగా యిచ్చిన వ్యక్తి తిరిగి తన పొలాన్ని తీసుకోవాలనుకొంటే, దాని వెలకు అయిదో వంతు అతడు అదనంగా చెల్లించాలి. అప్పుడు ఆ పొలం తిరిగి అతనిదే అవుతుంది.
“ఆ వ్యక్తి ఆ పొలాన్ని తిరిగి కొనకపోతే, అప్పుడు ఆ పొలం ఎల్లప్పుడూ యాజకులకే చెందుతుంది. ఒకవేళ ఆ భూమిని మరొకరికి అమ్మివేస్తే, ఆ మొదటి వ్యక్తి తిరిగి ఆ పొలం కొనేందుకు వీల్లేదు.
ఒకవేళ ఆ వ్యక్తి గనుక ఆ పొలాన్ని మళ్లీ కొనకపొతే, బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ఆ భూమి యోహోవాకు పవిత్రంగా ఉండిపోతుంది. అది శాశ్వతంగా యాజకునిదే అవుతుంది. అది సంపూర్ణంగా యెహోవాకు ఇవ్వబడిన భూమిగా ఉంటుంది.
“పశువుల్ని, గొర్రెల్ని, ప్రజలు యెహోవాకు కానుకగా ఇవ్వవచ్చును. అయితే ఆ జంతువు తొలిచూలు అయితే అది ముందే యెహోవాది. కనుక తొలిచూలు వాటిని ప్రజలు కానుకగా యివ్వలేరు.
తొలిచూలు జంతువులను ప్రజలు యెహోవాకు ఇవ్వాలి. అయితే ఆ తొలిచూలు జంతువు అపవిత్రమైనదిగా ఉంటే అప్పుడు ఆ వ్యక్తి తిరిగి దానిని కొనుక్కోవాలి. ఆ జంతువు వెల యాజకుడు నిర్ణయించగా, ఆ వ్యక్తి, దాని వెలకు అయిదోవంతు అదనంగా చెల్లించాలి. ఒకవేళ ఆ వ్యక్తి గనుక ఆ జంతువును తిరిగి కొనలేకపోతే, యాజకుడు తానే నిర్ణయించే వెలకు ఆ జంతువును అమ్మివేయాలి.
“ప్రజలు యెహోవాకు ఇచ్చే ఒక ప్రత్యేక రకమైన కానుక ఉంది. ఆ కానుక సంపూర్ణంగా యెహోవాదే అవుతుంది. ఆ కానుకను అమ్మటానికి, తిరిగి కొనడానికి వీల్లేదు. ఆ కానుక యెహోవాకు చెందినది. ప్రజలు, జంతువులు, కుటుంబపు ఆస్తిలోని పొలాలు ఆ కానుక కావచ్చును.
కోరుకొన్న ఆ జంతువు మంచిదైనా చెడ్డదైనా, దాని స్వంతదారుడు చింతించవలసిన అవసరం లేదు. అతడు ఆ జంతువును మరో జంతువుతో మార్చకూడదు. అలా మరో జంతువుతో దాన్ని మార్చాలని అతడు నిర్ణయించుకొంటే అప్పుడు ఆ రెండు జంతువులూ యెహోవావే అవుతాయి. ఆ జంతువును తిరిగికొనేందుకు వీల్లేదు.”