English Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

English

Tamil

Hebrew

Greek

Malayalam

Hindi

Telugu

Kannada

Gujarati

Punjabi

Urdu

Bengali

Oriya

Marathi

Assamese

Books

Leviticus Chapters

Leviticus 26 Verses

1 “మీకోసం మీరు విగ్రహాల్ని చేసుకోవద్దు. విగ్రహాల్ని, జ్ఞాపక చిహ్నాల్ని నిలబెట్టవద్దు. మీరు మొక్కేందుకు మీ దేశంలో రాతి విగ్రహాలను నిలబెట్టవద్దు. ఎందుచేతనంటే, నేను మీ దేవుణ్ణి, యెహోవాను.
2 “నా ప్రత్యేక విశ్రాంతి రోజుల్ని జ్ఞాపకం ఉంచు కొని, నా పవిత్ర స్థలాన్ని గౌరవించండి. నేను యోహోవాను.
3 “నా ఆజ్ఞలు, నియమాలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటికి విధేయులు అవ్వండి.
4 వాటిని మీరు జరిగిస్తే, నేను మీకు సకాలంలో వర్షాలు కురిపిస్తాను. భూమి పంటను యిస్తుంది, పొలంలో చెట్లు వాటి ఫలాలను ఇస్తాయి.
5 ద్రాక్షాపండ్ల కోతకాలం వచ్చేంతవరకు మీరు గానుగ పట్టడం కొనసాగుతుంది వరు మళ్ళ మొక్కలు నాటడం మొదలు పెట్టేంతవరకు మీరు ద్రాక్షాపండ్లు కూర్చుకోవటం కొనసాగుతుంది. అప్పుడు మీరు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది. మరియు మీరు మీ దేశంలో క్షేమంగా ఉంటారు.
6 నేను మీ దేశానికి శాంతిని ప్రసాదిస్తున్నాను. మీరు ప్రశాంతంగా పండుకొంటారు. ఎవరూ మిమ్మల్ని భయపెట్టేందుకు రారు. హానికరమైన జంతువులను నేను మీ దేశానికి దూరంగా ఉంచుతాను. మరియు సైన్యాలు మీ దేశం గుండా వెళ్లజాలవు.
7 “మీరు మీ శత్రువులను తరిమి, వారిని ఓడిస్తారు. మీరు మీ ఖడ్గంతో వారిని చంపుతారు.
8 మీలో అయిదుగురు 100 మందిని తరుముతారు, మీలో 100 మంది 10,000 మందిని తరుముతారు. మీరు మీ శత్రువులను ఓడించి, మీ ఖడ్గంతో వారిని చంపేస్తారు.
9 “అప్పుడు నేను మీ వైపు తిరుగుతాను. మీకు అధికంగా సంతానం కలుగనిస్తాను. మీతో నా ఒడంబడికను నేను నిలబెడతాను.
10 ఒక సంవత్సరం కంటె ఎక్కువ కాలానికి సరిపోయేంత పంట మీకు ఉంటుంది. మీరు కొత్త పంట కోసుకొంటారు. అయితే కొత్త పంట నిల్వ చేయటానికి స్థలం కావాలి గనుక పాత పంటను పారవేయాల్సి ఉంటుంది.
11 నేను నా పవిత్ర గుడారాన్ని కూడ మీ మధ్య ఉంచుతాను. మీనుండి నేను తిరిగిపోను.
12 నేను మీతో నడుస్తాను, మీ దేవునిగా ఉంటాను. మీరు నా ప్రజలుగా ఉంటారు.
13 నేను యోహోవాను, మీ దేవుణ్ణి. మీరు ఆ ఈజిప్టులో బానిసలుగా ఉన్నారుగాని నేను మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాను. బానిసలుగా భారమైన బరువులు మోసి మీరు చాలా వంగిపోయారు. అయితే మీ భుజాలమీద కాడిని నేను విరుగగొట్టేసాను. నేను మిమ్మల్ని మరల తల ఎత్తుకొని తిరిగేటట్టు చేస్తాను!
14 “అయితే మీరు నాకు విధేయులు కాకుండా, నా ఆజ్ఞలన్నింటినీ పాటించకుండా ఉంటే, అప్పుడు మీకు ఈ కీడులన్నీ జరుగుతాయి.
15 నా ఆజ్ఞలు, నియమాలు పాటించడానికి మీరు నిరాకరిస్తే, మీరు నా ఒడంబడికను ఉల్లంఘించినట్టే.
16 మీరు గనుక అలా చేస్తే అప్పుడు భయంకరమైన సంగతుల్ని మీకు సంభవింపజేస్తాను. నేను మీకు రోగం, జ్వరం వచ్చేటట్టు చేస్తాను. అవి మీ కళ్లను పాడుచేసి, మీ ప్రాణాల్ని తీస్తాయి. మీరు విత్తనాలు జల్లినప్పుడు ఫలితం ఉండదు. మీ శత్రువులు మీ పంటను తినివేస్తారు.
17 నేను మీకు విరోధంగా ఉంటాను గనుక మీ శత్రువులు మిమ్మల్ని ఓడిస్తారు. ఆ శత్రువులు మిమ్మల్ని ద్వేషించి, మీ మీద అధికారం చేస్తారు. ఎవరూ మిమ్మల్ని తరమకుండానే మీరు పారిపోతారు.
18 “ఇవన్నీ జరిగినా మీరు నాకు విధేయులు కాకపోతే, మీ పాపాలకోసం నేను మిమ్మల్ని ఏడంతలుగా శిక్షిస్తాను.
19 మీకు అతిశయ కారణమైన మీ గొప్ప పట్టణాలను నేను కూలగొట్టేస్తాను. ఆకాశంవర్షాన్ని ఇవ్వదు, భూమి పంటనివ్వదు.
20 మీరు కష్టపడి పనిచేస్తారు, కాని దానివల్ల ప్రయోజనం ఉండదు. మీ భూమి పంటలేమీ ఇవ్వదు, మీ చెట్లు వాటి ఫలాలను ఇవ్వవు.
21 “మీరు ఇంకా నాకు వ్యతిరేకంగా తిరిగి, నాకు విధేయులయ్యేందుకు తిరస్కరిస్తే, అప్పుడు ఇంకా ఏడు రెట్లు కఠినంగా నేను మిమ్మల్ని కొడతాను. మీరు ఎక్కువ పాపం చేసినకొద్దీ, మరింత ఎక్కువగా శిక్షించబడతారు.
22 నేను మీ మీదికి అడవి మృగాలను పంపిస్తాను. అవి మీ పిల్లలను మీ దగ్గరనుండి లాక్కొనిపోతాయి. అవి మీ పశువుల్ని నాశనం చేస్తాయి. అవి మీ సంఖ్యను క్షీణింప చేస్తాయి. రహదారులు ఖాళీగా ఉంటాయి గనుక ప్రయాణం చేయటానికి ప్రజలు భయపడతారు.
23 “అన్ని జరిగినా మీరు పాఠం నేర్చుకోకపోతే, ఇంకా అప్పటికీ నాకు మీరు విరుద్ధంగా తిరిగితే,
24 అప్పుడు నేను కూడా మీకు విరుద్ధంగా తిరుగుతాను. నేను, అవును నేనే, మీ పాపాలకోసం ఏడుసార్లు మిమ్మల్ని శిక్షిస్తాను.
25 మీరు నా ఒడంబడికను ఉల్లంఘించారు కనుక నేను మిమ్మల్ని శిక్షిస్తాను. సైన్యాలను నేను మీమీదికి రప్పిస్తాను. భద్రతకోసం మీరు మీ పట్టణాల్లోకి పారిపోతారు. కాని నేను మీ మధ్య వ్యాధుల్ని వ్యాపింప జేస్తాను. అప్పుడు మీ శత్రువు మిమ్మల్ని ఓడించేస్తాడు.
26 ఆ పట్టణంలో మిగిలిపోయిన ధాన్యంలో కొంత భాగం నేను మీకు ఇస్తాను. కానీ తినేందుకు బహుకొంచెం మాత్రమే ఆహారం ఉంటుంది. వారి భోజనాన్ని అంతా ఒక్క పాత్రలో పదిమంది ఆడవాళ్లు వండగలుగుతారు. ఆ భోజనం ముద్దలు ఒక్కొక్కదాన్ని వారు లెక్కబెట్టగలుగుతారు. మీరు తింటారు గాని మీ ఆకలి తీరదు.
27 “మీరు ఇంకా నా మాట వినకపోతే, ఇంకా నాకు విరోధంగా ఉంటే
28 అప్పుడు నేను నిజంగా నా కోపం చూపిస్తాను. నేను, అవును నేనే, మీ పాపాలకోసం ఏడుసార్లు మిమ్మల్ని శిక్షిస్తాను.
29 మీ కుమారులు, కుమార్తెల శరీరాల్ని మీరు తింటారు.
30 మీ ఉన్నత స్థలాలను నేను నాశనం చేస్తాను. మీ ధూప వేధికలను నేను పడగొట్టేస్తాను. మీ శవాలను మీ విగ్రహాల శవాల మీద నేను పడవేస్తాను. మీరు నాకు చాలా అసహ్యంగా ఉంటారు.
31 మీ పట్టణాలను నేను నాశనం చేస్తాను. మీ పరిశుద్ధ స్థలాన్ని నేను శూన్యం చేస్తాను. మీ అర్పణల సువాసన నేను ఆఘ్రాణించను.
32 మీ పట్టణాల్లో నివసించేందుకు వచ్చే మీ శత్రువులు చూచి అదిరి పోయేంతగా మీ దేశాన్ని నేను ఖాళీ చేస్తాను.
33 ఇంకా నేను మిమ్మల్ని రాజ్యాల్లో చెదరగొట్టేస్తాను. నేను నా ఖడ్గం దూసి, మిమ్మల్ని నాశనం చేస్తాను. మీ దేశం శూన్యంగాను, మీ పట్టణాలు చెత్తగాను ఉంటాయి.
34 “మిమ్మల్ని మీ శత్రువులు తమ దేశానికి తీసుకొని పోతారు. మీ దేశం ఖాళీ అయిపోతుంది. అందుచేత మీ భూమికి చివరికి విశ్రాంతి లభిస్తుంది. భూమి దాని విశ్రాంతిని అనుభవిస్తుంది.
35 ఏడేండ్లకు ఒకసారి ఒక సంవత్సరం పాటు భూమికి విశ్రాంతి ఉండాలని ఆజ్ఞ ప్రబోధిస్తుంది. మీరు దానిలో నివసించినప్పుడు దానికి మీరు ఇవ్వని విశ్రాంతిని, భూమి ఖాళీగా ఉన్న ఆ సమయంలో అది పొందుతుంది.
36 శేషించిన ప్రజలు వారి శత్రు దేశంలో ధైర్యం కోల్పోతారు. ప్రతిదానికీ వారు భయపడిపోతారు. గాలికి కొట్టుకొని పోయే ఆకులా వారు అటుఇటు పరుగులెత్తుతారు. ఎవరో వారిని కత్తితో తరుముతున్నట్టు వారు పరుగులెడతారు. వారిని ఎవరూ తరమక ముందే వారు పడిపోతారు.
37 ఎవరో వారిని కత్తితో తరుముతున్నట్టుగా వారు పరుగులెడతారు. వారిని ఎవరూ తరమకుండానే వారు ఒకరిమీద ఒకరు కూలిపోతారు. “మీరు మీ శత్రువులను ఎదిరించి నిలిచే అంతటి బలం మీకు ఉండదు.
38 ఇతర దేశాల్లో తప్పిపోతారు. మీ శత్రుదేశాల్లోనికి మీరు అదృశ్యమవుతారు.
39 కనుక మిగిలిన వాళ్లు వారి పాపంవలన వారి శత్రుదేశంలో క్షీణించిపోయెదరు. వారు కూడా వారి పూర్వీకులవలెనే, వారి పాపంవలన క్షీణించిపోయెదరు.
40 “అయితే ఒకవేళ ప్రజలు వారి పాపాలు ఒప్పుకొంటారేమో. వారు, వారి పూర్వీకుల పాపాలు ఒప్పు కొంటారేమో. ఒకవేళ వారు నాకు విరోధంగా తిరిగినట్టు ఒప్పుకోవచ్చు. ఒకవేళ వారు నాకు విరోధంగా పాపం చేసినట్టు ఒప్పుకోవచ్చు.
41 ఒకవేళ నేను వారికి విరోధంగా తిరిగి వారి శత్రుదేశంలోనికి నేనే వాళ్ళను తీసుకొని పోయినట్టు వారు ఒప్పుకోవచ్చు. ఆ ప్రజలు నన్ను ఎరుగని వాళ్లలా ప్రవర్తించారు. వాళ్లు తగ్గించు కొని, వారి పాపపు శిక్షను స్వీకరిస్తే
42 అప్పుడు యాకోబుతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఇస్సాకుతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. అబ్రాహాముతో నా ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఈ దేశాన్ని నేను జ్ఞాపకం చేసుకొంటాను.
43 “ఈ దేశం ఖాళీ అవుతుంది. భూమి దాని విశ్రాంతి సమయాన్ని అనుభవిస్తుంది. అప్పుడు మిలిగిన వాళ్లు వారి పాపపు శిక్షను అంగీకరిస్తారు. వారు నా ఆజ్ఞలను ద్వేషించి, నా నియమాలను విధేయులయ్యేందుకు నిరాకరించినందువల్లే వారు శిక్ష పొందినట్టు వారు గ్రహిస్తారు.
44 వాస్తవంగా వారు పాపం చేసారు. అయితే సహాయంకోసం వారు నా దగ్గరకు వస్తే, నేను వారినుండి తిరిగిపోను. వారు వారి శత్రువుల దేశంలో ఉన్నప్పుటికీ నేను వారి మొర అలకిస్తాను. నేను వారిని పూర్తిగా నాశనం చెయ్యను. వారితో నా ఒడంబడికను తెగతెంపులు చేయను. నేను యెహోవాను, వారి దేవుణ్ణి.
45 వారి పూర్వీకులతో నాకుగల ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నేను వారికి దేవునిగా ఉండేందుకు నేను వారి పూర్వీకుల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించాను. ఇతర రాజ్యాలు వాటన్నింటినీ చూసాయి. నేను యెహోవాను!”
46 అవి యెహోవా ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చిన చట్టాలు, నియమాలు, ప్రబోధాలు. యెహోవాకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్య ఆ ఆజ్ఞలే ఒక ఒడంబడిక. సీనాయి పర్వతం దగ్గర ఆ ఆజ్ఞలను యెహోవా ఇచ్చాడు. ఆయన వాటిని మోషేకు ఇవ్వగా, మోషే వాటిని ప్రజలకు యిచ్చాడు.
×

Alert

×