సన్నిధి గుడారంలో యెహోవా ఎదుట సాయంత్రం నుండి ఉదయం వరకు దీపం వెలిగేటట్లు అహరోను చూసుకొంటాడు. ఇది సాక్ష్యపు తెర ఎదుట ఉంటుంది. అతి పవిత్రస్థలంలో ఈ తెర వెనుకనే ఒడంబడిక పెట్టె ఉంటుంది. ఈ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది.
ఆ రొట్టె అహరోనుకు, అతని కుమారులకు చెందుతుంది. వారు ఈ రొట్టెను పరిశుద్ధ స్థలంలో తినాలి. ఎందుచేతనంటే యోహోవాకు హోమంగా అర్పించబడిన అర్పణల్లో అది ఒకటి. ఆ రొట్టె ఎప్పటికీ అహరోను భాగం అవుతుంది.”
ఒక ఇశ్రాయేలు స్త్రీకి కుమారుడు ఒకడు ఉన్నాడు. వాని తండ్రి ఈజిప్టువాడు. ఈ ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు ఇశ్రాయేలువాడే. అతడు ఇశ్రాయేలు ప్రజల మధ్య తిరుగుతూ, బసలో పోరాడటం మొదలుపెట్టాడు.
ఆ ఇశ్రాయేలు స్త్రీ కుమారుడు యెహోవా నామాన్ని శపిస్తూ, దూషణ మాటలు మాట్లాడటం మొదలు పెట్టాడు కనుక ప్రజలు అతణ్ణి మోషే దగ్గరకు తీసుకొని వచ్చారు. (అతని తల్లి పేరు షెలోమితు, దాను కుటుంబ వంశానికి చెందిన దిబ్రీ కుమార్తె)
“ఆ శపించినవాణ్ణి బసవెలుపలికి తీసుకొని రండి. తర్వాత అతడు శపిస్తూండగా విన్న ప్రజలందర్నీ సమావేశ పరచండి. వాళ్లు అతని తలమీద చేతులు వేయాలి. తర్వాత ప్రజలంతా వాణ్ణి రాళ్లతో కొట్టి చంపాలి.
యెహోవా నామానికి వ్యతిరేకంగా ఎవరైనా దూషణచేస్తే, వాణ్ణి చంపివేయాలి, ప్రజలంతా వాణ్ణి రాళ్ళతో కొట్టాలి. ఇశ్రాయేలీయులలో పుట్టిన వాడిలా గానే, విదేశీయులు కూడా శిక్షించబడాలి. ఏ వ్యక్తిగాని యెహోవా నామాన్ని శపిస్తే ఆ వ్యక్తిని చంపివేయాలి.
అప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడగా, శపించిన వ్యక్తిని బసవెలుపలకు వారు తీసుకొని వచ్చారు. అప్పుడు వాళ్లు రాళ్లతో కొట్టి అతణ్ణి చంపివేసారు. కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలు ప్రజలు చేసారు.