Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Leviticus Chapters

Leviticus 16 Verses

Bible Versions

Books

Leviticus Chapters

Leviticus 16 Verses

1 యెహోవాకు ధూపం వేస్తూ అహరోను ఇద్దరు కుమారులూ చనిపోయారు. అది జరిగిన తర్వాత మోషేతో యెహోవా మాట్లాడాడు.
2 మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నీ సోదరుడైన అహరోనుతో మాట్లాడు.” పవిత్ర స్థలంలో తెర వెనుకకు అతడు వెళ్లజాలని కొన్ని ప్రత్యేక సమయాలు ఉన్నాయని అతనితో చెప్పు. ఆ తెర వెనుక గదిలో ఒడంబడిక పెట్టె ఉన్నది. ఆ పవిత్ర పెట్టెమీద కరుణాపీఠం ఉంది. ఆ పెట్టెకు పైగా మేఘంలో నేను ప్రత్యక్ష మవుతాను. అందుచేత యాజకుడు ఎల్లప్పుడూ ఆ గదిలోనికి వెళ్లజాలడు. అతడు ఆ గదిలోనికి వెళ్తే, అతడు మరణించవచ్చు!
3 “ప్రాయశ్చిత్తపు రోజున అహరోను పరిశుద్ధ స్థలంలో ప్రవేశించక ముందు, పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను, దహన బలిగా ఒక పొట్టేలును అతడు అర్పించాలి.
4 అహరోను నీళ్లతో పూర్తిగా స్నానంచేయాలి. అప్పుడు అహరోను ఈ బట్టలు ధరించాలి. అహరోను పవిత్రమైన చొక్కోధరించాలి. లోపల వేసు కొనే బట్టలు శరీరాన్ని అంటిపెట్టుకొనేవిగా ఉండాలి. మేలురకం దట్టిని నడుంకు కట్టుకోవాలి. మేలురకం బట్టతో తలపాగా చుట్టుకోవాలి. ఇవి పవిత్ర వస్త్రాలు.
5 “మరియు పాపపరిహారార్థ బలికోసం రెండు మగ మేకలను, దహనబలికోసం ఒక పొట్టేలును ఇశ్రాయేలు ప్రజల దగ్గర నుండి అహరోను తీసుకోవాలి.
6 అప్పుడు అహరోను పాపపరిహారార్థ బలిగా ఒక కోడెదూడను అర్పించాలి. ఈ పాపపరిహారార్థ బలి తనకోసమే. అప్పుడు అతనిని, అతని కుటుంబాన్ని పవిత్రంచేసే ఆచారాన్ని అహరోను జరిగించాలి.
7 “తర్వాత, అహరోను ఆ రెండు మేకలను సన్నిధి గుడార ద్వారం దగ్గరకు తీసుకొని రావాలి.
8 ఆ రెండు మేకలకు అహరోను చీట్లు వేయాలి. ఒకచీటి యెహోవాకు, ఇంకొకటి విడిచిపెట్టే అజాజేలుకు.
9 “అప్పుడు అహరోను చీటి ద్వారా నిర్ణయించబడిన మేకను యెహోవాకు అర్పించాలి. ఈ మేకను అహరోను పాపపరిహారార్థ బలిగా చేయాలి.
10 అయితే విడిచి పెట్టేందుకు చీటి ద్వారా నిర్ణయించబడిన మేకను ప్రాణంతోనే యెహోవా ఎదుటికి తీసుకొని రావాలి. దాన్ని పవిత్రం చేసే క్రమాన్ని యాజకుడు జరిగించాలి. తర్వాత ఈ మేక అర్యణంలో విడిచిపెట్టబడాలి.
11 “తర్వాత అహరోను తన కోసం ఒక కోడెదూడను పాపపరిహారార్థ బలిగా అర్పించాలి. తనను, తన కుటుంబాన్ని అహరోను పవిత్రం చేసుకోవాలి. అహరోను అతని కోసమే పాపపరిహారార్థ బలిగా ఆ కోడెదూడను వధించాలి.
12 అప్పుడు యెహోవా సన్నిధిలోని ధూపపీఠంనుండి ధూపార్తి నిండా నిప్పులు తీసుకోవాలి. చూర్ణం చేయబడిన పరిమళ ధూపాన్ని రెండు గుప్పెళ్ల నిండా అహరోను తీసుకోవాలి. తెర వెనుక నున్న గదిలోనికి అహరోను ఆ పరిమళ ధూపాన్ని తీసుకొని రావాలి.
13 యెహోవా సన్నిధిలో అహరోను ఆ ధూపాన్ని నిప్పులు మీద వేయాలి. అప్పుడు ఒడంబడిక పెట్టె మీద ఉన్న కరుణా పీఠాన్ని ఆ ధూపపొగ ఆవరిస్తుంది. ఈ విధంగా చేస్తే అహరోను మరణించడు.
14 అహరోను ఆ కోడెదూడ రక్తంలో కొంచెం తీసుకొని, తన వేలితో తూర్పుకు కరుణాపీఠం మీదికి చిలకరించాలి. కరుణాపీఠం ముందర అతడు తన వేలితో ఏడుసార్లు రక్తాన్ని చిలకరించాలి.”
15 తర్వాత అహరోను ప్రజలకోసం పాప పరిహారార్థ బలి మేకను వధించాలి. తెరవెనుక ఉన్న గదిలోనికి ఈ మేక రక్తాన్ని అహరోను తీసుకొని రావాలి. కోడెదూడ రక్తంతో ఏమైతేచేసాడో అలాగే మేక రక్తంతోకూడ అహరోను చేయాలి. కరుణాపీఠం మీద, కరుణాపీఠం ఎదుట ఆ మేక రక్తాన్ని అహరోను చిలకరించాలి.
16 ఇశ్రాయేలు ప్రజలు అపవిత్రమయిన సందర్భాలెన్నో ఉన్నాయి కనుక ఇశ్రాయేలు ప్రజల పాపాలు, నేరాలనుండి ఆ అతిపరిశుద్ధ స్థలాన్ని పవిత్రం చేసేందుకు జరగాల్సిన ప్రాయశ్చిత్తాన్ని అహరోను చేయాలి. అహరోను ఎందుకు ఇవన్నీ చేయాలి? సన్నిధిగుడారం అపవిత్ర ప్రజల మధ్య ఉంటుందిగనుక.
17 అతి పరిశుద్ధ స్థలాన్ని అహరోను పవిత్రం చేసే సమయంలో సన్నిధిగుడారంలో ఎవ్వరూ ఉండకూడదు. అహరోను బయటకు వచ్చేంతవరకు ఏ వ్యక్తీ లోకిని వెళ్లకూడదు. కనుక అహరోను తనను, తన కుటుంబాన్ని పవిత్రం చేసుకోవాలి. తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరినీ అతడు పవిత్రం చేయాలి.
18 తర్వాత యెహోవా సన్నిధిలో ఉన్న బలిపీఠం దగ్గరకు అహరోను వెళ్లాలి. అహరోను బలిపీఠాన్ని పవిత్రం చేస్తాడు. కోడెదూడ రక్తంలో కొంచెం, మేక రక్తంలో కొంచెం తీసుకొని బలిపీఠం అన్ని వైపులా ఉన్న దాని కొమ్ములకు అహరోను పూయాలి.
19 తర్వాత అహరోను తన వేలితో కొంత రక్తాన్ని బలి పీఠం మీద ఏడుసార్లు చిలకరించాలి. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల పాపాలన్నింటి నుండి బలిపీఠాన్ని అహరోను పరిశుద్ధంగా, పవిత్రంగా చేయాలి.”
20 “అతి పరిశుద్ధ స్థలాన్ని, సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని, అహరోను పవిత్రం చేస్తాడు. అలా జరిగిన తర్వాత ఆ మేకను ప్రాణంతోనే యెహోవా సన్నిధికి అహరోను తీసుకొని వస్తాడు.
21 బతికే ఉన్న ఆ మేక తలమీద అహరోను తన రెండు చేతులు ఉంచుతాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజల పాపాలను, నేరాలను ఆ మేకమీద అహరోను ఒప్పుకొంటాడు. ఈ విధంగా అహరోను ప్రజల పాపాలను మేక నెత్తిమీద మోపుతాడు. అప్పుడు ఆ మేకను అరణ్యంలోకి వదిలి పెట్టేస్తాడు. ఈ మేకను అతను తోలివేయటానికి పక్కనే ఒక మనిషి సిద్ధంగా నిలబడి ఉంటాడు.
22 కనుక ప్రజలందరి పాపాలను ఆ మేక తనమీద మోసుకొని ఖాళీ అరణ్యంలోనికి తీసుకొనిపోతుంది. ఆ మేకను తోలు కొనిపోయిన వాడు అరణ్యంలో దానిని విడిచి పెట్టివేయాలి.
23 “అప్పుడు అహరోను సన్నిధి గుడారంలో ప్రవేశించాలి. పవిత్రస్థలంలోనికి వెళ్లినప్పుడు తాను ధరించిన వస్త్రాలను అతడు తీసివేయాలి. వాటిని అక్కడే వదిలివేయాలి.
24 ఒక పవిత్ర స్థలంలో అతడు నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు అతడు తన ఇతర ప్రత్యేక వస్త్రాలు ధరించాలి. అతడు బయటకు వచ్చి తనకోసం దహన బలిని, ప్రజలకోసం దహనబలిని అర్పించాలి. అతని కోసం, ప్రజలకోసం అతడు తనను పవిత్రంచేసుకోవాలి.
25 అప్పుడు పాపపరిహారార్థ బలి పశువు యొక్క కొవ్వును అతడు బలిపీఠం మీద దహించాలి.”
26 “విడిచిపెట్టే మేకను అరణ్యంలో విడిచి పెట్టిన వ్యక్తి తన బట్టలు ఉతుక్కొని, నీళ్లలో స్నానం చేయాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి బసలోనికి రావచ్చును.”
27 “పాపపరిహారార్థ బలిపశువులైన కోడెదూడను, మేకలను బస వెలుపలికి తీసుకొనిపోవాలి. ఈ జంతువుల రక్తం పవిత్ర వస్తువులను పవిత్రం చేసేందుకు పవిత్ర స్థలానికి తీసుకొని రాబడింది. ఆ జంతువుల చర్మాలను శవాలను, వాటి మలమును యాజకులు అగ్నితో కాల్చివేయాలి.
28 తర్వాత వాటిని కాల్చిన వ్యక్తి తన వస్త్రాలను ఉతుక్కొని, నీళ్లలో స్నానంచేయాలి. ఆ తర్వాత ఆ వ్యక్తి బసలోనికి రావచ్చును.
29 ఆ ఆజ్ఞ మీకు శాశ్వతంగా ఉంటుంది. ఏడవ నెల పదో రోజున మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. మీరేమీపని చేయకూడదు. మీ మధ్య నివసిస్తున్న విదేశీ యాత్రికులు ఎవరూ పని చేయకూడదు.
30 ఎందుచేతనంటే ఆ రోజు యాజకుడు మిమ్మల్ని పవిత్రంచేసి, మీ పాపాలను కడిగివేస్తాడు. అప్పుడు మీరు యెహోవాకు పవిత్రం చేయబడిన వారవుతారు.
31 ఇది మీకు చాల ముఖ్యమైన విశ్రాంతి రోజు. మీరు భోజనం చేయకూడదు. ఈ ఆజ్ఞ ఎప్పటికీ కొన సాగుతుంది.
32 “కనుక నియమించబడిన ప్రధాన యాజకుడు, అంటే యాజకత్వం చేసేందుకు నియమించబడ్డ మనిషి. అతడు అన్నింటినీ పవిత్రం చేసే కార్యక్రమాన్ని జరిగిస్తాడు. ఆ యాజకుడు పవిత్ర నార వస్త్రాలు ధరించాలి.
33 అతి పరిశుద్ధ స్థలాన్ని, సన్నిధి గుడారాన్ని, బలిపీఠాన్ని అతడు పవిత్రం చేయాలి. యాజకులను, ఇశ్రాయేలు ప్రజలందరినీ అతడు పవిత్రం చేయాలి.
34 ఇశ్రాయేలు ప్రజలను పవిత్రం చేసేందుకు ఇవ్వబడ్డ ఆ ఆజ్ఞ శాశ్వతంగా కొనసాగుతుంది. ప్రతి సంవత్సరంలో ఒక సారి మీరు వాటిని జరిగించాలి. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల పాపాల మూలంగా వీటిని చేయవలెను.” కనుక మోషేకు యెహోవా ఆజ్ఞాపించిన వీటన్నింటినీ వారు జరిగించారు.

Leviticus 16:1 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×