“ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: “ఒక స్త్రీ మగ శిశువుకు జన్మనిస్తే ఆ స్త్రీ ఏడు రోజుల వరకు అపవిత్రగావుంటుంది. ఇది ఆమె నెలసరి రక్తస్రావం విషయంలో అపవిత్రంగా ఉన్నట్టే.
అప్పుడు ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అయ్యేందుకు ముప్పయిమూడు రోజులు పడుతుంది. పరిశుద్ధమయింది దేన్నీ ఆమె తాకగూడదు. ఆమె పవిత్రపరచబడటం పూర్తి అయ్యేంతవరకు పరిశుద్ధ స్థలంలో ఆమె ప్రవేశించకూడదు.
కానీ ఆ స్త్రీ ఒక ఆడ శిశువుకు జన్మయిస్తే నెలసరి రక్తస్రావ సమయంలో ఉన్నట్టే రెండు వారాలు ఆమె అపవిత్రంగా ఉంటుంది. ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అయ్యేందుకు అరవై ఆరు రోజులు అవుతుంది.
“ప్రసవించిన తల్లి పవిత్రం అయ్యేందుకు ఒక ప్రత్యేక సమయం ఉంటుంది. పవిత్రపర్చబడే ఆ ప్రత్యేక సమయం అయిపోగానే ఆడపిల్ల తల్లియైనా, మగపిల్ల తల్లియైనా, ఆ తల్లి ప్రత్యేకమైన బలి అర్పణలను సన్నిధి గుడారానికి తీసుకొనిరావాలి. సన్నిధి గుడార ద్వారం దగ్గర ఆ బలి అర్పణలను ఒక యాజకునికి ఇవ్వాలి. దహన బలికోసం ఒక సంవత్సరం వయస్సుగల ఒక గొర్రెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావురం పిల్లను లేక ఒక గువ్వను ఆమె తీసుకొనిరావాలి.
(7-8) ఒకవేళ ఆ స్త్రీ గొర్రెపిల్లను ఇవ్వలేక పోతే, రెండు పావురపు పిల్లల్నిగాని రెండుగువ్వలనుగాని ఆమె తీసుకొని రావచ్చును. అందులో ఒకటి దహనబలి కోసం, మరొకటి పాప పరిహారార్థ బలికోసం. వాటిని యాజకుడు యెహోవా ఎదుట అర్పిస్తాడు. ఈ విధంగా ఆమెకోసం అతడు ఆమె పాపాలను తుడిచి వేస్తాడు. అప్పుడు ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అవుతుంది. ఒక మగశిశువుకు లేదా ఆడశిశువుకు జన్మనిచ్చే స్త్రీకి అవి నియమాలు.”