ఈ మెల్కీసెదెకు షాలేము రాజు; మరియు మహోన్నతుడైన దేవుని యాజకుడు. అబ్రాహాము రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కీసెదెకు అతన్ని కలుసుకొని ఆశీర్వదించాడు.
అబ్రాహాము తాను జయించిన వాటిలో పదవవంతు మెల్కీసెదెకుకు యిచ్చాడు. మొదటిదిగా “మెల్కీసెదెకు” అనే పదానికి నీతికిరాజు అనే అర్థం. రెండవదిగా “షాలేమురాజు” అను యితని పేరుకు శాంతికి రాజు అనే అర్థం కూడా వుంది.
మెల్కీసెదెకు తల్లిదండ్రులెవరో మనకు తెలియదు. అతని పూర్వీకులెవరో మనకు తెలియదు. అతని బాల్యాన్ని గురించి కాని, అంతిమ రోజుల్ని గురించికాని మనకు తెలియదు. దేవుని కుమారునివలె అతడు కూడా చిరకాలం యాజకుడుగా ఉంటాడు.
ఇశ్రాయేలు ప్రజలు అబ్రాహాము వంశానికి చెందిన వాళ్ళు, లేవి జాతికి చెందిన యాజకుల సోదరులు. అయినా ధర్మశాస్త్రంలో ఈ లేవి యాజకులు ప్రజలు ఆర్జించిన దానిలో పదవవంతు సేకరించాలని ఉంది.
మోషే ధర్మశాస్త్రంలో లేవి జాతికి చెందిన యాజకుల గురించి వ్రాసాడు. ఒకవేళ, ఆ యాజకుల ద్వారా ప్రజలు పరిపూర్ణత పొంద గలిగి ఉంటే అహరోనులాంటి వాడు కాకుండా మెల్కీసెదెకులాంటి యాజకుడు రావలసిన అవసరమెందుకు కలిగింది?
కాని యేసు ప్రమాణం ద్వారా యాజకుడైనాడు. ఈయన విషయంలో దేవుడాయనతో ఇలా అన్నాడు: “ప్రభువు ప్రమాణం చేశాడు. తన మనస్సును మార్చుకోడు: ‘నీవు చిరకాలం యాజకుడుగావుంటావు.’ ” కీర్తన 110:4
పవిత్రమైన వాడు, ఏ కళంకం లేనివాడు, పరిశుద్ధమైన వాడు, పాపుల గుంపుకు చెందనివాడు, పరలోకంలో ఉన్నత స్థానాన్ని పొందినవాడు, ఇలాంటి ప్రధాన యాజకుడై అవసరాన్ని తీరుస్తున్నాడు.
ఆయన, ఇతర ప్రధాన యాజకులవలె తన పాపాల కొరకు గానీ, ప్రజల పాపాల కొరకు గానీ ప్రతి రోజు బలుల్ని అర్పించవలసిన అవసరం లేదు. ఆయన తనను తానే బలిగా అర్పించుకున్నాడు. అంటే మొదటి బలి, చివరి బలి ఆయనే!
ధర్మశాస్త్రం బలహీనులైన వాళ్ళను యాజకులుగా నియమించింది: కాని, ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణం కుమారుణ్ణి ప్రధాన యాజకునిగా నియమించింది. అంతేకాక, ఆయన చిరకాలం పరిపూర్ణునిగా చేయబడ్డాడు.