1
|
మీరు దేవుని సంతానం. మీరు ఆయనకు ప్రియమైన బిడ్డలు. కనుక ఆయన వలె ఉండటానికి ప్రయత్నించండి. |
2
|
క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనకోసం దేవునికి తనను తాను ధూపంగా, బలిగా అర్పించుకొన్నాడు. మీరు ఆయనలా మీ తోటి వాళ్ళను ప్రేమిస్తూ జీవించండి. |
3
|
ని మీరు వ్యభిచారాన్ని గురించి గాని, అపవిత్రతను గురించి గాని, దురాశను గురించి గాని మాట కూడా ఎత్తకూడదు. ఇలాంటి దుర్గుణాలు విశ్వాసుల్లో ఉండకూడదు. |
4
|
అంతేకాక మీరు బూతు మాటలు, అర్థంలేని మాటలు పలుకకూడదు. అసభ్యమైన పరిహాసాలు చేయకూడదు. వీటికి మారుగా అన్ని వేళలా దేవునికి కృతజ్ఞతతో ఉండండి. |
5
|
ఒకటి మాత్రం తథ్యమని గ్రహించండి. అవినీతి పరులు, అపవిత్రులు, అత్యాశాపరులు, నిజానికి ఇలాంటి వాళ్ళు విగ్రహారాధకులతో సమానము, ఇలాంటి వాళ్ళు దేవుడు మరియు క్రీస్తు పాలిస్తున్న రాజ్యానికి వారసులు కాలేరు. |
6
|
వట్టిమాటలతో మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్తపడండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్ళు శిక్షింపబడతారు. |
7
|
వాళ్ళు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి. |
8
|
ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. కాని ప్రభువులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానంవలె జీవించండి. |
9
|
ఎందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి. |
10
|
ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి. |
11
|
చీకటికి సంబంధించిన కార్యాలు చెయ్యకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్న వాళ్ళను గురించి అందరికీ చెప్పండి. |
12
|
అవిధేయులు రహస్యంగా చేసినవాటిని గురించి మాట్లాడటం కూడా అవమానకరం. |
13
|
వాటిని వెలుగులోకి తెస్తే వాటి నిజస్వరూపం బయటపడుతుంది. |
14
|
వెలుగు అన్నీ కనిపించేలా చేస్తుంది. అందువల్లే ఈ విధంగా వ్రాయబడింది: “నిద్రిస్తున్న ఓ మనిషీ మేలుకో! బ్రతికి లేచిరా! క్రీస్తు నీపై ప్రకాశిస్తాడు.” |
15
|
మీరు ఏ విధంగా జీవిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. బుద్ధిహీనుల్లాకాక, బుద్ధిగలవారిలా జీవించండి. |
16
|
ఇవి మంచి రోజులు కావు. కనుక వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి. |
17
|
మూర్ఖంగా ప్రవర్తించకండి. ప్రభువు ఆంతర్యాన్ని తెలుసుకోండి. |
18
|
మత్తు పదార్థాలు త్రాగుతూ త్రాగుబోతుల్లా జీవించకండి. త్రాగుబోతుతనం వ్యభిచారానికి దారితీస్తుంది. కనుక దానికి మారుగా పరిశుద్ధాత్మతో నింపబడండి. |
19
|
స్తుతి గీతాలతో, పాటలతో, ఆత్మీయ సంకీర్తనలతో హెచ్చరింపబడుతూ, ప్రభువును మీ మనస్సులలో కీర్తిస్తూ స్తుతిగీతాలు, పాటలు పాడండి. |
20
|
మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట తండ్రియైన దేవునికి అన్ని వేళలా కృతజ్ఞతలు చెల్లించండి. |
21
|
మీకు క్రీస్తు పట్ల భయభక్తులు ఉన్నాయి. కనుక ఒకరికొకరు లోబడి ఉండండి. |
22
|
స్త్రీలు మీరు ప్రభువుపట్ల విశ్వాసం కనబరచండి. అలాగే మీ భర్తలపట్ల కూడా గౌరవము కనబరుస్తూ జీవించండి. |
23
|
క్రీస్తు సంఘానికి శిరస్సు. సంఘము ఆయనకు శరీరంలాంటిది. ఆయన దాన్ని రక్షిస్తున్నాడు. అదే విధంగా భర్త, భార్యకు శిరస్సులాంటివాడు. |
24
|
సంఘం క్రీస్తుకు విధేయతగా ఉన్నట్లే భార్య తన భర్తకు అన్ని విషయాల్లో విధేయతగా ఉండాలి. |
25
|
క్రీస్తు తన సంఘాన్ని ప్రేమించి దాని కోసం తనను అర్పించుకున్నట్లే భర్త తన భార్యను ప్రేమించి తనను అర్పించుకోవటానికి సిద్ధంగా ఉండాలి. |
26
|
క్రీస్తు తన సంఘాన్ని పవిత్రం చేయాలని తనను తాను అర్పించుకున్నాడు. ఆ సంఘాన్ని దేవుని వాక్యమను నీళ్ళతో కడిగాడు; సువార్త సందేశంతో దాన్ని శుద్ధీకరించాడు. |
27
|
దాన్ని తేజోవంతంగా, పవిత్రంగా మరకా మచ్చా లేకుండా, మరే తప్పూ లేకుండా, అపకీర్తి లేకుండా చేసేందుకు ఆ సంఘం కోసం తనకు తానే అర్పించుకొన్నాడు. |
28
|
అదే విధంగా భర్త తన భార్యను తన శరీరంగా భావించి ప్రేమించాలి. తన భార్యను ప్రేమిస్తే తనను తాను ప్రేమించుకొన్నదానితో సమానము. |
29
|
సహజంగా ఎవ్వరూ తమ శరీరాన్ని ద్వేషించరు. అందరూ తమ శరీరాన్ని పోషించుకొంటూ రక్షించుకొంటారు. |
30
|
అదే విధంగా మనము క్రీస్తు శరీరంలో భాగాలము. కనుక ఆయన సంఘంగా ఉన్న మనల్ని ఆయన పోషించి రక్షిస్తాడు. |
31
|
“ఈ కారణంగా పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి తన భార్యతో కలిసి జీవిస్తాడు. వాళ్ళిద్దరూ ఒకే శరీరంగా జీవిస్తారు.” |
32
|
ఇది గొప్ప రహస్యం. కాని నేను క్రీస్తును గురించి ఆయన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాను. |
33
|
ఏది ఏమైనా ప్రతి ఒక్కడూ తనను తాను ప్రేమించుకొన్నంతగా తన భార్యను ప్రేమించాలి. భార్య తన భర్తను గౌరవించాలి. |
Ephesians 5:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...