ఎవరి కొడుకునైతే సజీవునిగా ఎలీషా చేసేనో, ఆ స్త్రీతో ఎలీషా మాటలాడెను. ఎలీషా చెప్పాడు. “నీవు నీ కుటుంబము మరొక దేశానికి వెళ్లాలి. ఎందుకనగా, ఇక్కడ కరువుకాలం ఏర్పాడుతుందని యెహోవా నిశ్చయించినాడు. ఈ విధమైన కరువు ఈ దేశంలో ఏడు సంవత్సరముల పాటు ఉంటుంది.”
ఆ ఏడు సంవత్సరములు పూర్తి అయిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశంనుంచి తిరిగి వచ్చింది. ఆ స్త్రీ రాజుతో మాట్లడడానికి వెళ్లింది. తన ఇల్లు తన పొలము తనకు చేరునట్లుగా కోరుటకే ఆమె వెళ్లింది.
మృతజీవి ఒకనిని సజీవునిగా ఎలీషా చేసెనన్న విషయాన్ని గేహజీ రాజుకి చెప్పుచున్నాడు. ఆ సమయాన తన కొడుకుని ఎలీషా బ్రతికింపజేసిన ఆ స్త్రీ రాజువద్దకు పోయింది. తన పొలమూ తన యీల్లూ తాను పొందుటకు సహాయం చేయుమని రాజుని అడగటానికి ఆమె వెళ్లింది. గేహాజీ, “నా ప్రభువా, రాజా, ఈమెయే ఆ స్త్రీ. ఇతడే ఎలీషా బ్రతికించిన ఆ కుమారుడు” అని చెప్పాడు.
ఏమి కావలెనో చెప్పమని రాజు ఆమెని అడిగాడు. ఆ స్త్రీ రాజుతో చెప్పింది. తర్వాత ఆ స్త్రీ కి సహాయము చేయడానికై రాజు ఒక అధికారిని ఎన్నుకున్నాడు. “ఆమెకున్నదంతా ఆమెకు వచ్చేలా చేయండి. ఆమె దేశం విడిచిపెట్టిన నాటినుంచీ నేటిదాకా కోతలవల్ల ఆమెకు రావలసినదంతా ఇప్పించడి” అని చెప్పాడు.
అప్పుడు బెన్హదదు హజాయేలుతో ఇట్లన్నాడు: “ఒక కానుక తీసుకొని దేవుని వ్యక్తిని కలుసుకొనుము. నేను నా జబ్బునుండి కోలుకొందునో లేదో అతడు యెహోవాని అడగమని అతనితో చెప్పుము.”
అందువల్ల హజాయేలు ఎలీషాని కలుసు కొనడానికి వెళ్లాడు. తనతో పాటు హజాయేలు కానుకలు తెచ్చాడు. దమస్కు నుండి అతడు అన్ని రకాల మంచి వస్తువులు తెచ్చాడు. వాటిని మోయడానికి 40 ఒంటెలు కావలసిన వచ్చింది. హజాయేలు ఎలీషా వద్దకు పోయాడు. “నీ అనుచరుడైన [*అనుచరుడు అక్షరాల “కొడుకు”.] సిరియా రాజు నన్ను నీ వద్దకు పంపించాడు. ఆయన జబ్బునుండి కోలు కొనునో లేదో అడగమని, నన్ను పంపెను,” అని హజాయేలు చెప్పాడు.
“అయ్యా, మీరెందుకు ఏడుస్తున్నారు?” అని హజయేలు అడిగాడు. “ఇశ్రాయేలు వారికి మీరేమి చెడుపనులు చేయగలరో తెలిసి నేను ఏడుస్తున్నాను. మీరు వారి బలమైన నగరాలను దగ్ధం చేస్తారు. ఖడ్గాలతో మీరు ఆ యువకులను చంపుతారు. వారి పసిపిల్లలను కూడా మీరు హతమారుస్తారు. మీరు వారి గర్భవతులను చీల్చి వేస్తారు” అని ఎలీషా సమాధానం చెప్పాడు.
ఆ తర్వాత హజయేలు ఎలీషాని విడిచి తన రాజు వద్దకు వెళ్లాడు. “ఎలీషా నీతో ఏమి చెప్పాడు?” అని బెన్హదదు హజయేలును అడిగాడు. “నీవు జీవించెదవు అని ఎలీషా చెప్పాడు” అని హజయేలు చెప్పాడు.
కాని ఆ మరునాడే హజాయేలు ఒక ముతక వస్త్రం తీసుకుని దాన్ని నీటిలో తడిపాడు. తర్వాత బెన్హదదు ముఖాన్ని కప్పివేసి, వుక్కిరి బిక్కిరి చేయడంలో అతడు మరణించాడు. హజాయేలు కొత్తగా రాజు అయ్యాడు.
కాని తన సేవకుడైన దావీదుకు వాగ్దానం చేయడంవల్ల యెహోవా యూదాను నాశనం చేయలేదు. అతని వంశానికి చెందిన వారు ఎవరో ఒకరు ఎప్పుడూ రాజుగా వుంటారని దావీదుకు యెహోవా వాగ్దానం చేశాడు.
అప్పుడు యెహోరాము అతని రథములన్నిటినీ తీసుకుని జాయీరుకు వెళ్లెను. రాత్రివేళ ఎదోము సైన్యము వారిని చుట్టుముట్టింది. యెహోరాము అతని అధికారులు వారిని ఎదుర్కొని, తప్పించు కున్నారు. యెహోరాము సైనికులందురు పారిపోయి తమ దేశం చేరుకున్నారు.
అహజ్యా పరిపాలన ప్రారంభించినప్పుడు అతని వయస్సు ఇరవైరెండు సంవత్సరములు. అతను యెరూషలేములో ఒక సంవత్సరం పరిపాలించాడు. అతని తల్లి పేరు అతల్యా. ఆమె ఇశ్రాయేలు రాజయిన ఒమ్రీ కుమార్తె.
యెహోవా తప్పని చెప్పిన పనులనే అహజ్యా చేశాడు. అహాబు వంశీయులవలె అహజ్యా అనేక చెడుకార్యాలు చేశాడు. అతని భార్య అహాబు వంశానికి చెందినదగుట్టచే, అహజ్యా ఈ విధంగా నివసించాడు.
యెహోరాము అహాబు వంశానికి చెందినవాడు. సిరియా రాజయిన హజయేలుతో రామోత్గిలాదు అనేచోట యుద్ధం చేసేందుకు అహజ్యా యెహోరాముతో కలిసి వెళ్లాడు. సిరియన్లు యెహోరాముని గాయపరచిరి.
ఆ గాయముల నుండి బాగు పడుటకు గాను యెహోరాము రాజు ఇశ్రాయేలుకి తిరిగి వెళ్లిపోయాడు. యెహోరాము యెజ్రెయేలు అనే ప్రదేశానికి పోయాడు. యెహోరాము కుమారుడైన అహజ్యా యూదా యొక్క రాజు. అహజ్యా యెహోరాముని చూడటానికి యెజ్రెయేలు వెళ్లాడు.