Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

2 Chronicles Chapters

2 Chronicles 25 Verses

Bible Versions

Books

2 Chronicles Chapters

2 Chronicles 25 Verses

1 రాజు అయ్యేనాటికి అమజ్యా ఇరువదియైదు సంవత్సరాలవాడు. అతడు యెరూషలేము నుండి ఇరువై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు యెహోయద్దాను. యెహోయద్దాను యెరూషలేముకు చెందిన స్త్రీ.
2 యెహోవా అతని నుండి ఆశించిన పనులన్నీ అమజ్యా నిర్వర్తించాడు. కాని అతడు ఆ పనులను తన పూర్ణ హృదయంతో చేయలేదు.
3 అమజ్యా రాజుగా బలపడ్డాడు. తరువాత రాజైన తన తండ్రిని చంపిన అధికారులను అతడు చంపివేశాడు.
4 కాని అమజ్యా ఆ అధికారుల పిల్లలను మాత్రం చంపలేదు. ఎందువల్లనంటే, మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడిన నియమ నిబంధనలను అతడు పాటించాడు. యెహోవా యిలా ఆజ్ఞాపించాడు: “తమ పిల్లలు చేసిన నేరానికి వారి తండ్రులు చనిపోరాదు. తమ తండ్రులు చేసిన పాపాలకు వారి పిల్లలు చనిపోరాదు. ప్రతి వ్యక్తి తన పాపాలకు ఫలితంగా తానే చనిపోవాలి .”
5 యూదా ప్రజలందరినీ అమజ్యా సమావేశ పర్చాడు. వారందరినీ వారి వారి కుటుంబాల వారీగా విడగొట్టి, సహస్రాధిపతులను, శతాధిపతులను వారిపై నియమించాడు. ఈ అధికారులు యూదా, బెన్యామీనుకు చెందిన సైనికులపై నియమింపబడ్డారు. సైనికులుగా ఎన్నుకోబడిన వారంతా ఇరువది ఏండ్ల యువకులు, అంతకు పైబడినవారు. ఈటెలు, డాళ్లు పట్టి యుద్ధానికి సిద్ధంగా వున్న మూడు లక్షల మంది నిపుణులైన సైనికులున్నారు.
6 ఇశ్రాయేలు నుండి అమజ్యా ఒక లక్ష మంది సైనికులను కిరాయికి నియమించాడు. కిరాయి కింద వారికి రెండు వందల మణుగుల వెండిని అతడు చెల్లించాడు.
7 కాని ఒక దైవజ్ఞుడు (ప్రవక్త) అమజ్యా వద్దకు వచ్చాడు. ఆ ప్రవక్త యిలా అన్నాడు: “రాజా ఇశ్రాయేలు సైన్యాన్ని నీతో తీసుకొని వెళ్లవద్దు. యెహోవా ఇశ్రాయేలు పక్షానలేడు. యెహోవా ఎఫ్రాయిము ప్రజలతో లేడు.
8 “బహుశా నీవు యుద్ధానికి మంచి కట్టుదిట్టం చేసుకొని సిద్ధంగా వుండవచ్చు. కాని దేవుడు నీవు గెలిచేలా చేయవచ్చు, లేదా ఓడిపోయేలా చేయవచ్చు.”
9 అమజ్యా దైవజ్ఞునితో, “అయితే నేను ఇశ్రాయేలు సైన్యానికి ఇప్పటి వరకు చెల్లించిన డబ్బు సంగతి ఏమిటి?” అని అన్నాడు. దానికి దైవజ్ఞుడు, “ప్రభువైన యెహోవా వద్ద చాలా వుంది. ఆయన నీకు దానికంటె చాలా ఎక్కువ యివ్వగలడు!” అని చెప్పాడు.
10 అందువల్ల అమజ్యా ఇశ్రాయేలు సైన్యాన్ని ఎఫ్రాయిముకు తిప్పి పంపివేశాడు. ఈ సైనికులకు రాజు మీద, యూదా ప్రజలమీద చాలా కోపం వచ్చింది. మిక్కిలి కోపంతో వారు ఇండ్లకు తిరిగి వెళ్లారు.
11 పిమ్మట అమాజ్యా మంచి ధైర్యం తెచ్చుకొని తన సైన్యాన్ని ఎదోము దేశంలో ఉన్న ఉప్పు లోయకు నడిపించాడు. ఆ ప్రదేశంలో శేయీరు (ఎదోము) కు చెందిన పదివేల మందిని అమజ్యా సైన్యం చంపివేసింది.
12 యూదా సైన్యం శేయీరుకు చెందిన పదివేల మందిని బందీలుగా పట్టుకున్నది. ఆ బందీలను శేయీరు నుండి ఒక కొండ శిఖరం మీదికి వారు తీసుకొని వెళ్లారు. అప్పటికి బందీలంతా బతికే వున్నారు. వారందరినీ యూదా సైన్యం కొండ శిఖరం నుండి తోసివేయగా వారి శరీరాలు కింద రాళ్ల పైబడి ముక్కలు ముక్కలై పోయాయి.
13 కాని అదే సమయంలో ఇశ్రాయేలు సైన్యం యూదాలో కొన్ని పట్టణాలపై దాడి చేస్తూ వుంది. బేత్‌హోరోను నుండి సమరయ (షోమ్రోను) వరకు వున్న పట్టణాలపై వారు దాడి జరిపారు. వారు కూడ మూడ వేల మందిని చంపి, చాలా విలువైన వస్తువులను కొల్లగొట్టారు. అమజ్యా వారిని తన సైన్యంతో కలిసి యుద్ధానికి రానివ్వక పోవటంతో ఆ సైనికులు చాలా కోపగించి వున్నారు.
14 ఎదోమీయులను (శేయీరు వారిని) ఓడించిన పిమ్మట అమజ్యా ఇంటికి తిరిగి వచ్చాడు. శేయీరు ప్రజలు పూజించే విగ్రహాలన్నిటినీ అతడు తీసుకొని వచ్చాడు. అమజ్యా ఆ విగ్రహాలనే పూజించటం మొదలు పెట్టాడు. అతడా విగ్రహాలకు సాష్టాంగపడి, వాటికి దూపం వేయసాగాడు.
15 అమజ్యా పట్ల యెహోవాకు చాలా కోపం వచ్చింది. యెహోవా అమజ్యా వద్దకు ఒక ప్రవక్తను పంపాడు. ఆ ప్రవక్త యిలా అన్నాడు: “అమజ్యా, ఆ ప్రజలు పూజించిన దేవుళ్లను నీవెందుకు కొలుస్తున్నావు? ఆ దేవుళ్లు వారి ప్రజలనే నీనుండి కాపాడలేక పోయారు!”
16 ప్రవక్త చెప్పటం ముగించాక, అమజ్యా ప్రవక్తతో యిలా అన్నాడు: “మేము నిన్ను రాజుకు సలహాదారుగా ఎన్నడూ నియమించలేదే! నీవు మాట్లడవద్దు! నీవు నోరు మూయకపోతే నీవు చంపబడతావు!” ప్రవక్త మౌనం వహించాడు. తరువాత ప్రవక్త మళ్లీ యిలా అన్నాడు: “దేవుడు నిన్ను నాశనం చేయటానికే నిశ్చయించాడు. నీవు అటువంటి నీచకార్యాలు చేయటంతో పాటు, నా సలహా కూడ పెడచెవిని పెట్టావు.”
17 యూదా రాజైన అమజ్యా తన సలహాదారులతో సంప్రదించాడు. తరువాత యెహోయాషుకు ఒక వర్తమానం పంపాడు. యెహోయాషు’ “మనం ఒకరితో ఒకరు ముఖాముఖి పోరాడదాము” అని అమజ్యా కబురు పంపాడు. యెహోయాషు తండ్రిపేరు యెహోయాహాజు. యెహోయాహాజు తండ్రి పేరు యెహూ. యెహూ ఇశ్రాయేలు రాజు.
18 పిమ్మట యెహోయాషు తన సమాధానాన్ని అమజ్యాకు పంపాడు. యెహోయాషు ఇశ్రాయేలు రాజు. అమజ్యా యూదా రాజు. యెహోయాషు ఈ కథ చెప్పి పంపాడు: “లెబనోనుకు చెందిన ఒక చిన్న ముండ్ల పొద లెబానోనులోని ఒక పెద్ద దేవదారు వృక్షానికి ఒక వర్తమానం పంపింది. ఆ చిన్న ముండ్ల పోద’ ‘నా కుమారుణ్ణి నీ కుమార్తెను వివాహం చేసుకోనియ్యి,’ అని అన్నది. కాని ఈలోపల ఒక అడవి జంతువు వచ్చి ఆ చిన్న ముండ్ల పొదను తొక్కి నాశనం చేసేసింది.
19 ‘నేను ఎదోమును ఓడించాను’ అని నీవు గర్వపడుతున్నావు. గొప్పలు చెప్పుకొంటున్నావు. ఇక నీవు ఇంటి వద్దనే వుండు. కోరి కష్టాలు తెచ్చుకోకు.నీవు నాతో యుద్ధం చేస్తే నీవు, యూదా నాశనమవ్వటం ఖాయం.”
20 కాని ఆమజ్యా ఈ సలహా వినటానికి నిరాకరించాడు. ఇదంతా దేవుని సంకల్పంతోనే జరుగుతూవుంది. ఎదోమీయులు కొలిచిన దేవుళ్లను యూదా ప్రజలు ఆరాధించిన నేరానికి, ఇశ్రాయేలు చేతిలో యూదా ఓడిపోయేలా యెహోవా పథకం సిద్ధం చేశాడు.
21 కావున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాను బేత్షెమెషు పట్టణం వద్ద ముఖాముఖి ఎదుర్కొన్నాడు. బేత్షెమెషు పట్టణం యూదాలో వుంది.
22 ఇశ్రాయేలు యూదాను ఓడించింది. యూదా సైన్యంలో ప్రతివాడూ తన ఇంటికి పారిపోయాడు.
23 అమజ్యాను బేత్షేమెషు పట్టణం వద్ద యెహోయాషు పట్టుకుని, యెరూషలేముకు తీసుకొని పోయాడు. అమజ్యా తండ్రి పేరు యోవాషు. యోవాషు తండ్రి పేరు యెహోయాహాజు. యెహోయాషు ఆరువందల అడుగుల (నాలుగువందల మూరలు) మేరకు యెరూషలేము గోడను ఎఫ్రాయిము ద్వారం నుండి మూల ద్వారం వరకు పడగొట్టాడు.
24 పిమ్మట యెహోయాషు వెండిని, బంగారాన్ని, ఇతర పరికరాలన్నిటినీ ఆలయం నుండి పట్టుకుపోయాడు. ఆలయంలో వస్తువుల సంరక్షణ బాధ్యత ఓబేదె దోముది. యెహోయాషు రాజగృహం నుండి విలువైన వస్తువులను కూడ తీసుకొని పోయాడు. కొంతమంది మనుష్యులను బందీలుగా పట్టుకున్నాడు. పిమ్మట అతడు సమరయకు వెళ్లిపోయాడు.
25 యెహోయాషు చనిపోయిన తరువాత అమజ్యా పదిహేను సంవత్సరాలు బతికాడు. అమజ్యా తండ్రిపేరు యూదా రాజైన యోవాషు.
26 మొదటి నుండి చివరి వరకు అమజ్యా చేసిన ఇతర కార్యాలన్నీ యూదా, ఇశ్రాయేలు రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి.
27 అమజ్యా యెహోవాకు విధేయుడుగా వుండటం మానివేసినప్పటి నుండి, యెరూషలేము ప్రజలు అమజ్యాకు వ్యతిరేకంగా కుట్రచేశారు. అతడు లాకీషు పట్టణానికి పారిపోయాడు. కాని ప్రజలు కొందరు మనుష్యులను లాకీషు పట్టణానికి పంపగా వారు అమజ్యాను అక్కడ చంపివేశారు.
28 వారతని శావాన్ని గుర్రాలమీద వేసుకొని తెచ్చి యూదా నగరంలో అతని పితరుల దగ్గర సమాధి చేశారు.

2-Chronicles 25:1 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×