సమూయేలు యెహోవా పవిత్ర గుడారంలో పడుకున్నాడు. దేవుని పవిత్ర పెట్టె [*దేవుని … పెట్టె దీనిని “ఒడంబడిక పెట్టె” అని కూడ అంటారు. ఇశ్రాయేలీయులు సీనాయి ఎడారిలో ఉన్న రోజులనుంచి జరిగిన అనేక విషయాలు దీనిలో భద్ర పర్చబడ్డాయి.] కూడా గుడారంలోనే వుంది. గుడారంలో యెహోవా దీపం ఇంకా వెలుగుతూనే వుంది.
(ఏలీ తనను పిలిచాడని అనుకొని) సమూయేలు ఏలీ వద్దకు పరుగున పోయాడు. “మీరు పిలిచారుగా అందుకే, వచ్చాను” అన్నాడు. “నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ. సమూయేలు పోయి పడుకున్నాడు.
దేవుడు మళ్లీ, “సమూయేలూ!” అని పిలిచాడు. సమూయేలు ఏలీ వద్దకు వెళ్లి, “నేనిక్కడే ఉన్నాను, నన్ను పిలిచారా?” అని అడిగాడు. “నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ.
సమూయేలుకు ఇంకా యెహోవాతో అనుభవంలేదు. అతనితో యెహోవా ఇంతవరకూ ప్రత్యక్షంగా మాట్లాడి వుండలేదు. [†మాట్లాడి వుండలేదు అంటే దేవుని వాణి సమూయేలుకు ఇంకా తెలియపర్చబడలేదు.]
మూడవసారి యెహోవా సమూయేలును పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ వద్దకు వెళ్లి, “నేను ఇక్కడే వున్నాను; నన్ను పిలిచారా?” అని అన్నాడు. యెహోవా ఆ బాలుని పిలుస్తున్నాడని అప్పుడు ఏలీకి అర్థమయింది.
ఏలీ సమూయేలుతో, “నీవు పోయి పడుకో. మళ్లీ ఎవరైనా నిన్ను పిలిస్తే ‘యెహోవా, సెలవియ్యండి! నేను తమ దాసుణ్ణి. నేను వింటున్నాను’ ” అని చెప్పమన్నాడు. తరువాత సమూయేలు వెళ్లి పక్కమీద పడుకున్నాడు.
యెహోవా సమూయేలుతో ఇలా అన్నాడు: “చూడు, నేను ఇశ్రాయేలులో ఒక కార్యాం నిర్వహించదలిచాను. దీనిని గురించి విన్న ప్రతి ఒక్కడూ ఆశ్చర్యపోతాడు. [‡దీనిని … ఆశ్చర్యపోతాడు ఇది విన్న ప్రతివాని చెవులూ గింగురుమంటాయి అని శబ్దార్థం.]
తన వంశాన్ని శాశ్వతంగా శిక్షిస్తానని ఏలీతో చెప్పాను. అలా ఎందుకు చేయదలిచానంటే తన కుమారులు దైవదూషణ చేసినట్లు, అకృత్యాలకు పాల్పడినట్లు ఏలీకి తెలుసు. అయినా వారిని అదుపులో పెట్టలేక పోయాడు.