Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

1 Samuel Chapters

1 Samuel 19 Verses

Bible Versions

Books

1 Samuel Chapters

1 Samuel 19 Verses

1 దావీదును చంపి వేయుమని సౌలు తన కుమారుడైన యోనాతానుకు, మిగిలిన అధికారులకు చెప్పాడు. కానీ యోనాతాను దావీదును చాలా ప్రేమించాడు.
2 యోనాతాను దావీదును హెచ్చరించాడు. “జాగ్రత్తగా ఉండు. సౌలు నిన్ను చంపాలని అవకాశం కోసం చూస్తున్నాడు. ఉదయం పొలానికి వెళ్లి అక్కడ దాగి వుండు.
3 నేను నా తండ్రితో ఆ పొలానికి వస్తాను. నీవు దాగియున్న పొలాల వద్ద మేము నిలబడతాము. నీ విషయంలో నా తండ్రితో నేను మాట్లాడతాను. తరువాత నేను తెలుసు కున్నదంతా నీకు చెబతాను” అని యోనాతాను దావీదుతో చెప్పాడు.
4 యోనాతాను తన తండ్రి సౌలుతో మాట్లాడుతూ దావీదు గుణగణాలను కొనియాడాడు. “నీవు రాజువు. దావీదు నీ సేవకుడు. దావీదు నీకు ఏమీ కీడు చేయలేదు. కనుక అతనికి ఏమీ కీడు చేయకు. దావీదు ఎల్లప్పుడూ నీ ఎడల మేలునే చేసాడు.
5 దావీదు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఫిలిష్తీయుడైన గొల్యాతును చంపాడు. దాని ద్వారా యెహోవా ఇశ్రాయేలు అంతటికీ ఘనవిజయం సమకూర్చి పెట్టాడు. అదంతా నీవు చూశావు, ఆనందించావు. పైగా అటువంటి దావీదుకు నీవు ఎందుకు కీడు తలస్తున్నావు? అతడు అమాయకుడు. అతనిని చంపటానికి తగిన కారణమే లేదు” అని అన్నాడు.
6 యోనాతాను చెప్పినదంతా విని సౌలు ఒక ప్రమాణం చేసాడు. “యెహోవా సజీవంగా ఉన్నాడు అన్నంత నిజంగా, దావీదు చంపబడడు” అని చెప్పాడు సౌలు.
7 కనుక యోనాతాను దావీదును పిలిచి జరిగినదంతా అతనితో చెప్పాడు. అప్పుడు యోనాతాను దావీదును తన తండ్రి వద్దకు తీసుకుని వెళ్లాడు. అప్పటి నుండి దావీదు మొదట్లోలాగే సౌలు దగ్గర ఉన్నాడు.
8 మళ్లీ యుద్ధం వచ్చినప్పుడు దావీదు ఫిలిష్తీయులను ఎదుర్కోవటానికి వెళ్లాడు. దావీదు వారిని తరిమికొట్టాడు, వారు అతని దగ్గరనుండి పారిపోయారు.
9 కానీ ఒక దుష్ట ఆత్మ యెహోవా వద్దనుండి వచ్చి సౌలును ఆవరించింది. సౌలు తన ఇంట్లోనే కూర్చునివున్నాడు. సౌలు చేతిలో అతని ఈటెవుంది. దావీదు సితార వాయిస్తూ ఉన్నాడు.
10 సౌలు తన ఈటెను దావీదు మీదికి విసరి అతనిని వెనుక ఉన్న గోడకు గుచ్చివేయాలని ప్రయత్నించాడు. కాని ఈటెను దావీదు తప్పుకోవటంతో ఈటె గురి తప్పిగోడలోకి దిగిపోయింది. ఆ రాత్రి దావీదు పారిపోయాడు.
11 సౌలు తన మనుష్యులను దావీదు ఇంటికి పంపాడు. వారు దావీదు ఇంటిపై నిఘా వేసి రాత్రి అంతా అక్కడే ఉండి, ఉదయమే అతనిని చంపే ప్రయత్నంలో కనిపెట్టుకొని ఉన్నారు. కానీ దావీదు భార్య మీకాలు అతనిని హెచ్చరించింది. “ఈ రాత్రి నీవు పారిపోయి నీ ప్రాణాలను రక్షించుకో. లేనిచో ఉదయమే నీవు చంపబడతావు” అని ఆమె చెప్పింది.
12 అలా చెప్పి, దావీదును ఒక కిటికిగుండా బయటకుదింపింది. దావీదు తప్పించుకొని పారి పోయాడు.
13 మీకాలు గృహ దేవత విగ్రహాన్ని తెచ్చి పక్కమీద ఉంచి దుప్పట్లు కప్పింది. ఆ విగ్రహం తల మీద కొన్ని మేక వెంట్రుకలు కూడ ఆమె అమర్చింది.
14 దావీదును బంధించమని సౌలు తన సైనికులను పంపాడు. కానీ “దావీదుకు అనారోగ్యంగా వుందని” మీకాలు చెప్పింది.
15 ఈ విషయం తన మనుష్యులు చెప్పేసరికి, “అవసరమైతే దావీదును మంచంతో సహా ఎత్తుకు రండి. నేను అతనిని అవసరమైతే చంపేస్తాను” అని ఆ మనుష్యులతో సౌలు చెప్పాడు.
16 సౌలు మనుష్యులు దావీదు కోసం మళ్లీ దావీదు ఇంటికి వెళ్లి చూడగా పక్కమీద ఉన్నది ఒక దేవతా విగ్రహం మాత్రమేనని, దాని తలమీద ఉన్నవి కేవలం మేక వెంట్రుకలు మాత్రమేననీ వారు తెలుసుకున్నారు.
17 “ఇలా నన్నెందుకు మోసగించావు, నా శత్రువును వదిలిపెట్టావు, వాడు పారిపోయాడు” అని సౌలు మీకాలును అడిగాడు. “తనకు సహాయం చేయకపోతే నన్ను చంపుతానని అతడు బెదిరించాడు. అందుకే నేను అలా చేశానని” మీకాలు జవాబు ఇచ్చింది.
18 దావీదు సౌలు బారి నుండి తప్పించుకుని రామాలోవున్న సమూయేలు వద్దకు వెళ్లాడు. సౌలు తన పట్ల చేసినదంతటినీ దావీడు సమూయేలుకు చెప్పాడు. తరువాత దావీదు, సమూయేలు కలిసి ప్రవక్తల గుడారాలకు వెళ్లారు. దావీదు అక్కడే ఉండి పోయాడు.
19 రామాలో వున్న గుడారాలలో దావీదు ఉంటున్నట్లు సౌలు విన్నాడు.
20 దావీదును బంధించి తీసుకుని రావలసిందిగా సౌలు మనుష్యులను పంపాడు. కానీ వారు ఆ గుడారాలకు వచ్చేసరికి అక్కడ ప్రవక్తల గుంపు ఒకటి ప్రవచిస్తూ ఉండటం కనబడింది. సమూయేలు ఆ ప్రవక్తలకు నాయకత్వం వహించి ఉన్నాడు. దేవుని ఆత్మ సౌలు పంపిన మనుష్యుల మీదికి రాగావారు కూడ దేవుని విషయాలు చెప్పనారంభించారు.
21 ఈ వార్త సౌలు వరకూ పోయింది. అతను మరి కొంతమంది మనుష్యులను పంపాడు. వారుకూడ దేవుని విషయాలు చెప్పటం మొదలు పెట్టారు. కనుక మూడవసారి మళ్లీ సౌలు మనుష్యులను పంపాడు. వారుకూడ దేవుని విషయాలు చెప్పటం మొదలు పెట్టారు.
22 చివరికి సౌలు స్వయంగా బయలుదేరి రామా చేరుకున్నాడు. సేఖూలో ఒక నూర్పిడి కళ్లము దగ్గరవున్న పెద్ద బావి వద్దకు సౌలు వచ్చాడు. “సమూయేలు, దావీదు ఎక్కడ ఉన్నారని” సౌలు అక్కడున్న వారిని అడిగాడు. “రామాదగ్గర ఉన్న నాయోతులో ఉన్నారని” వాళ్లు జవాబు చెప్పారు.
23 అప్పుడు సౌలు రామా దగ్గర్లో వున్న నాయోతుకు వెళ్లాడు. దేవుని ఆత్మ సౌలు మీదికి కూడ రావటంతో అతను దేవుని విషయాలు చెబుతూ ముందుకు నడిచాడు. రామాలో వున్న నాయోతుకు వెళ్లేవరకు సౌలు మరింత ఎక్కువగా దేవుని విషయాలు చెబతూనే ఉన్నాడు.
24 అప్పుడు సౌలు తన బట్టలు విడిచి, సమూయేలు ఎదుట అతడు దేవుని విషయాలు పలికాడు. ఆ పగలూ, ఆ రాత్రి శరీరంమీద బట్టలు లేకుండానే సౌలు గడిపాడు. ఆ కారణం చేతనే, “సౌలుకూడ ప్రవక్తల్లో ఒకడు అయ్యాడా?” అని ప్రజలు అనుకోవటం మొదలయ్యింది.

1-Samuel 19:1 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×