కొరింథులోని దేవుని సంఘానికి అంటే యేసు క్రీస్తులో పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన మీకును, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న వారందరికి శుభం కలుగుగాక!
సోదరులారా! మీలో చీలికలు కలుగకుండా అంతా ఒకే మాటపై నిలబడండి. మీరంతా ఒకే ధ్యేయంతో, ఒకే మనస్సుతో ఉండాలని మన యేసు క్రీస్తు ప్రభువు పేరిట మిమ్మల్ని వేడుకొంటున్నాను.
ఎందుకంటే, క్రీస్తు బాప్తిస్మము యివ్వటానికి నన్ను పంపలేదు. సువార్త ప్రకటించటానికి పంపాడు. తెలివిగా మాట్లాడి బోధించటానికి నన్ను పంపలేదు. అలా చేస్తే క్రీస్తు సిలువకు ఉన్న శక్తి తగ్గిపోతుంది.
దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది: “విజ్ఞానుల్లో ఉన్న విజ్ఞానాన్ని నేను నాశనం చేస్తాను. పండితుల్లో ఉన్న తెలివిని నిష్ప్రయోజనం చేస్తాను.” యెషయా 29:14]
మరి విజ్ఞానులు ఏమయ్యారు? పండితులు ఏమయ్యారు? సమకాలిక తర్క శాస్త్రజ్ఞులు ఏమయ్యారు? అంటే, దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం నిష్ప్రయోజనమని రుజువు చేసినట్లే కదా!
తనను జ్ఞానంతో కనుక్కోవటం సాధ్యం కారాదని దేవుడే నిర్ణయించాడు. దానికి మారుగా ప్రజలు “మూర్ఖత్వం” అని భావిస్తున్న “మా సందేశాన్ని” విశ్వసించిన వాళ్ళు రక్షింపబడాలని ఆయన నిర్ణయించాడు.
సోదరులారా! మిమ్నల్ని పిలిచినప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో జ్ఞాపకం ఉందా? ప్రపంచ మిమ్నల్ని జ్ఞానులుగా పరిగణించలేదు. మీకు పేరు ప్రతిష్టలు లేవు. మీరు ఉన్నత కుటుంబాలకు చెందలేదు.
ప్రపంచం ముఖ్యమైన వాళ్ళని భావిస్తున్న మనుష్యుల ప్రాముఖ్యతను తీసివేయటానికి, దేవుడు ఈ లోకంలో చిన్న చూపుతో చూడబడే వాళ్ళనూ, ఏవగించుకొనబడే వాళ్ళనూ, లెక్క చెయ్యబడని వాళ్ళను ఎన్నుకొన్నాడు.