Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

1 Chronicles Chapters

1 Chronicles 22 Verses

Bible Versions

Books

1 Chronicles Chapters

1 Chronicles 22 Verses

1 “యెహోవా దేవుని ఆలయం మరియు దహనబలులకు బలిపీఠం ఇశ్రాయేలు ప్రజల ఉపయోగార్థం ఇక్కడ నిర్మింపబడతాయి” అని దావీదు అన్నాడు.
2 ఇశ్రాయేలులో వుంటున్న అన్యజాతి వారందరినీ ఒకచోట చేరుమని దావీదు ఉత్తరువు ఇచ్చాడు. వారిలో నుండి రాళ్లు కొట్టే వారిని ఎంపిక చేశాడు. దేవాలయ నిర్మాణానికి రాళ్లు చెక్కి సిద్ధం చేయటం వారి పని.
3 దేవాలయ ద్వారపు తలుపులకు, బందులకు, మేకులకు కావలసిన ఇనుమును దావీదు సేకరించాడు. బరువు తూకం వేయలేనంత కంచును కూడ దావీదు సమకూర్చాడు.
4 దావీదు ఇంకా లెక్కలేనన్ని దేవదారు దూలాలను కూడా తెప్పించాడు. సీదోను, తూరు నగర ప్రజలు దావీదుకు చాలా దేవదారు కలప పంపారు.
5 దావీదు ఇలా అన్నాడు: “మనం యెహోవాకు ఒక గొప్ప ఆలయం కడదాము. నా కుమారుడు సొలొమోను చిన్నవాడు కావటంతో, అతను నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా నేర్చుకోలేదు. యెహోవా ఆలయం చాలా గొప్పదై వుండాలి. దాని అందచందాలలోను, ఔన్నత్యంలోను ఆ దేవాలయం సాటి రాజ్యాలన్నిటిలోను మేటిదై వుండాలి. అందువల్ల దేవాలయ నిర్మాణానికి అవసరమైన అనేక ఏర్పాట్లు చేస్తాను.” తాను చనిపోయే ముందు దేవాలయ నిర్మాణానికి దావీదు అనేక ఏర్పాట్లు చేశాడు.
6 పిమ్మట దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలిచాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక ఆలయాన్ని కట్టుమని దావీదు సొలొమోనుకు చెప్పాడు.
7 సొలొమోనుతో దావీదు ఇలా అన్నాడు: “నా కుమారుడా! నా దేవుడైన యెహోవానామమున నేనొక ఆలయం కట్టించాలనుకున్నాను.
8 కాని యెహోవా నాతో, ‘దావీదూ, నీవు చాలా యుద్ధాలు చేసి అనేకమందిని వధించావు. కావున నా పేరుమీద నీవు ఆలయం కట్టించలేవు.
9 కాని నీకొక శాంతి పరుడైన కుమారుడున్నాడు. నీ కుమారునికి శాంతియుత వాతావరణాన్ని కల్పిస్తాను. తనచుట్టూ వున్న అతని శత్రువులు అతనిని ఏమీ బాధపెట్టరు. అతని పేరు సొలొమోను . సొలొమోను రాజుగా వున్న కాలంలో ఇశ్రాయేలు శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లేలా చేస్తాను.
10 “నా పేరు మీద సొలొమోను ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. సొలొమోను నా కుమారినిలా వుంటాడు. నేనతనికి తండ్రిలా వ్యవహరిస్తాను. నేను సొలొమోను రాజ్యాన్ని బలపరుస్తాను. పైగా అతని కుటుంబంలో నుండి ఎవ్వరో ఒక్కరు శాశ్వతంగా రాజవుతూనే వుంటారు!”‘
11 దావీదు ఇంకా ఇలా అన్నాడు: “కుమారుడా ఇప్పుడు యెహోవా నీకు తోడై వుండుగాక! యెహోవా నీవు నిర్మిస్తావని చెప్పినట్లు, దేవాలయ నిర్మాణంలో నీవు విజయం సాధించెదవుగాక!
12 యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను సమర్థవంతంగా పాలించే విధంగా యెహోవా నీకు తెలివితేటలు, అవగాహన యిచ్చు గాక! నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించు.
13 ఇశ్రాయేలు సంక్షేమం కొరకు దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, నియమాలను నీవు పాటించే జాగ్రత్త తీసుకొంటే, నీవు విజయం సాధిస్తావు. నీవు శక్తిమంతుడవై, ధైర్యంగావుండు. నీవు భయ పడవద్దు.
14 “సొలొమోనూ! యెహోవా ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయటంలో నేను చాలా కష్టపడ్డాను. నేను రెండు మణుగుల (మూడువేల ఏడువందల ఏభై టన్నులు) బంగారాన్ని, పదికోట్ల మణుగుల (ముఫై ఏడువేల ఐదువందల టన్నులు) వెండిని, తూకం వేయటానికి సాధ్యం కానంత కంచును, ఇనుమును ఇచ్చాను. కలపను, రాయిని కూడ ఇచ్చాను. సొలొమోనూ, నేనిచ్చిన దానికి తోడు నీవింకా కొంత సామగ్రిని సమకూర్చవచ్చు.
15 నీ వద్ద చాలా మంది రాతిని చెక్కే శిల్పులు, వడ్రంగులు వున్నారు. ప్రతి పనిలోనూ నిపుణులైన వారు నీకున్నారు.
16 బంగారం, వెండి, కంచు, ఇనుము పనులలో నేర్పరులు, అనుభవం వున్న వారు నీవద్ద వున్నారు. ప్రవీణతగల పనివారు నీ వద్ద లెక్కకు మించి వున్నారు. ఇప్పుడు పని మొదలు పెట్టు. యెహోవా నీకు తోడై ఉండుగాక!”
17 తరువాత ఇశ్రాయేలు పెద్దలందరికీ తన కుమారుడు సొలొమోనుకు సహాయపడుమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు.
18 ఆ పెద్దలందరికీ దావీదు యిలా చెప్పాడు: “మీ దేవుడైన యెహోవా మీతో వున్నాడు. ఆయన మీకు శాంతి నెలకొన్న కాలాన్ని ప్రసాదించాడు. మన చుట్టూ వున్న దేశాలను ఓడించేలా యెహోవా నాకు సహాయం చేశాడు. యెహోవా, ఆయన ప్రజలు ఇప్పుడీ దేశంమీద ఆధిపత్యం వహించి వున్నారు.
19 యెహోవా సంకల్పం నెరవేరటానికి మీరంతా హృదయపూర్వకంగా ఆయనకు అంకితమవ్వండి. యెహోవా దేవునికి పవిత్ర ఆలయాన్ని నిర్మించండి. యెహోవా పేరున ఆలయ నిర్మాణం చేయండి. పిమ్మట ఒడంబడిక పెట్టెను, ఇతర పవిత్ర పరికరాలను ఆలయంలోకి తీసుకురండి.”

1-Chronicles 22:1 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×