ఆ స్త్రీ ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచారసంబంధమైన అపవిత్రకార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రను తనచేత పట్టుకొనియుండెను.
ఆ దూత నాతో ఇట్లనెనునీవేల ఆశ్చర్యపడితివి? యీ స్త్రీనిగూర్చిన మర్మమును, ఏడు తలలును పది కొమ్ములును గలిగి దాని మోయుచున్న క్రూరమృగమునుగూర్చిన మర్మమును నేను నీకు తెలిపెదను.
నీవు చూచిన ఆ మృగము ఉండెను గాని యిప్పుడు లేదు; అయితే అది అగాధ జలములోనుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగ దుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగముండెను గాని యిప్పుడు లేదు అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలిసికొని అశ్చర్యపడుదురు.
వీరు గొఱ్ఱపిల్లతో యుద్ధము చేతురు గాని, గొఱ్ఱపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై యున్నందునను, తనతోకూడ ఉండినవారు పిలువబడినవారై, యేర్పరచ బడినవారై, నమ్మకమైనవారై యున్నందునను, ఆయన ఆ రాజులను జయించును.
నీవు ఆ పది కొమ్ములుగల ఆ మృగమును చూచితివే, వారు ఆ వేశ్యను ద్వేషించి, దానిని దిక్కు లేనిదానిగాను దిగంబరిగాను చేసి, దాని మాంసము భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు.