క్రీస్తులో ఐక్యత పొందటం వలన మీకు శక్తి కలిగింది కదా! ఆయన ప్రేమ మీకు ఆనందం యిస్తుంది కదా! ఆయన ఆత్మతో మీకు స్నేహం కలిగింది గదా! మీలో దయాదాక్షిణ్యాలు అభివృద్ధి చెందుతున్నాయి కదా!
నా ప్రియ మిత్రులారా! నేను మీతో ఉన్నప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని అతిక్రమించలేదు. ప్రస్తుతం నేను మీతో లేను కనుక యిప్పుడు మీరు దేవుని ఆజ్ఞల్ని పాటించుచూ మీ స్వంత రక్షణను భయముతోను, వణకుతోనూ, కార్యసాధకము చేయండి.
అప్పుడు మీరు నిష్కళంకులై మంచి వాళ్ళుగా ఉంటారు. దుర్మార్గులై నీతి లేకుండా జీవిస్తున్న వీళ్ళ మధ్య ఏ అపరాధమూ చెయ్యని దేవుని బిడ్డల్లా ఉంటారు. మీరు వాళ్ళ మధ్య ఆకాశంలోని నక్షత్రాల్లా ప్రకాశిస్తారు.
మీరు జీవంగల దైవసందేశాన్ని ప్రకటిస్తున్నారు. కనుక క్రీస్తు వచ్చిన రోజున మీ విషయంలో గర్వించటానికి నాకు ఆస్కారం ఉంటుంది. నా కృషి, సాధన వ్యర్థం కాలేదని ఋజువౌతుంది.
మీ విశ్వాసం వల్ల అర్పిస్తున్న బలికి తోడుగా నా రక్తాన్ని బలిగా ధార పోయవలసివస్తే నేను వెనుకాడను. చాలా ఆనందిస్తాను. నా ఆనందాన్ని మీతో పంచుకోవాలని నా కోరిక.
నాకు సహాయం చెయ్యటానికి మీరు ఎపఫ్రొదితును పంపారు. అతడు మీరు పంపిన దూత. అతణ్ణి తిరిగి మీ దగ్గరకు పంపటం అవసరమని భానిస్తున్నాను. ఎపఫ్రొదితు నాతో కలిసి నా సోదరునివలే పోరాడి, పని చేసాడు.
అతనికి నిజంగా చనిపోయేటంత జబ్బు చేసింది. కాని దేవుని దయ అతనిపై ఉంది. కనుక అతను బ్రతికాడు. దేవుడు అతనికే కాకుండా, నాకు మరొకసారి దుఃఖం కలుగరాదని నాపై కూడా దయచూపాడు.