నీవు ఓడించబడి, నేల మట్టం చేయబడ్డావు. ఇప్పుడ ఒక పిశాచి స్వరంలా నీ స్వరం నేలల్లోంచి నాకు వినవస్తోంది. ధూళిలోంచి మెల్లగా వినబడే స్వరంలా నీ మాటలు వినవస్తున్నాయి.”
సర్వశక్తిమంతుడైన యెహోవా మిమ్మల్ని శిక్షించాడు. ఉరుములు, భూకంపాలు, మహా గొప్ప శబ్దాలు ప్రయోగించి యెహోవా మిమ్మల్ని శిక్షించాడు తుఫానులు, బలమైన గాలులు, కాల్చివేసే అగ్ని ఉపయోగించి యెహోవా నాశనం చేశాడు.
కానీ ఆ సైన్యాలకు గూడ అది ఒక కలలా ఉంటుంది ఆ సైన్యాలకు అవసరమైనవి దొరకవు. ఆకలితో ఉన్నవానికి అన్నం గూర్చి కలవచ్చినట్టు ఉంటుంది. వాడు మేల్కొన్నప్పుడు ఆకలి అలానే ఉంటుంది. దప్పిగొన్నవాడు నీళ్లను గూర్చి కలగన్నట్టు ఉంటుంది. వాడు మేల్కోంటాడు, దాహంతోనే ఉంటాడు. సీయోనుకు విరోధంగా పోరాడే రాజ్యాలన్నింటి విషయంలోను ఇదే సత్యం. ఆ రాజ్యాలకు కావాలనుకొన్నవి దొరకవు.
ఈ సంగతులు సంభవిస్తాయి, కానీ మీరు గ్రహించరు అని నేను మీతో చెబతున్నాను. మూసివేయబడి, ముద్ర వేయబడిన పుస్తకంలోని మాటల్లాంటివి నా మాటలు చదవటం వచ్చిన వానికి మీరు వుస్తకం ఇచ్చి, చదవమని వానితో చెప్పండి. కానీ ఆ వ్యక్తి, “ఈ పుస్తకం నేను చదవలేను. ఇది మూయబడి ఉంది. నేను దీన్ని తెరువలేను” అంటాడు.
నా ప్రభువు అంటున్నాడు, “ఈ ప్రజలు నన్ను ప్రేమిస్తున్నామని వారు అంటారు. వారి నోటి మాటలతో నన్ను ఘనపరుస్తారు. కానీ వారి హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. మానవపరమైన నియమాలను కంఠస్థం చేయటం తప్ప వారు నాకు చూపించే గౌరవం ఇంకొకటి లేదు.
అందుచేత శక్తిగల, అద్భుత కార్యాలు ఇంకా చేస్తూనే ఉండి, నేను ఈ ప్రజలను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాను. వారి జ్ఞానులు తమ జ్ఞానం పోగొట్టుకొంటారు. వారి జ్ఞానులు గ్రహించలేక పోతారు.”
ఆ ప్రజలు విషయాలను యెహోవాకు తెలియకుండా దాచిపెట్టాలని ప్రయత్నిస్తారు. యెహోవా గ్రహించలేడు అని వారు అనుకొంటారు. వారు తమ చెడుకార్యాలను చీకట్లో చేస్తారు. “మనల్ని ఎవరూ చూడలేరు. మనం ఎవరయిందీ ఎవరూ తెలుసుకోలేరు” అని వారు చెప్పుకొంటారు.
మీరు గందరగోళం అయ్యారు. మట్టి, కుమ్మరికి సమానం అని అనుకొంటారు మీరు. “నీవేమి నన్ను తయారు చేయలేదు” పొమ్మని సృష్టించబడినది, తనను సృష్టించిన వానితో చెప్పొచ్చని మీరు తలస్తారు. “నీకు తెలియదులే” అని కుమ్మరితో కుండ చెప్పినట్టుంది ఇది.
అతడు తన పిల్లలందర్నీ చూస్తాడు, నా నామం పవిత్రం అని చెబతాడు. ఈ ప్రజలందర్నీ నా చేతులతో నేనే చేశాను, యాకోబు యొక్క పరిశుద్ధుడు (దేవుడు) చాలా ప్రత్యేకం అని ఈ ప్రజలు చెబతారు. ఈ ప్రజలు ఇశ్రాయేలు దేవుణ్ణి సన్మానిస్తారు.