(4-5) బీదలకు అతడు న్యాయంగా, నిజాయితీగా తీర్పుచెబుతాడు. దేశంలో పేద ప్రజలకు జరగాల్సిన విషయాల్లో నిర్ణయాలు చేయాల్సినప్పుడు అతడు న్యాయంగా ఉంటాడు. ప్రజలు కొట్టబడాలని అతడు నిర్ణయిస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు, ఆ ప్రజలు కొట్టబడతారు. ఎవరైనా చావాలని అతడు నిర్ణయం చేస్తే, అప్పుడు అతడు ఆదేశం ఇస్తాడు. ఆ దుష్టులు చంపబడతారు. మంచితనం, న్యాయం ఈ శిశువుకు బలం ప్రసాదిస్తాయి. అవి అతడు తన నడుముకు కట్టుకొనే పట్టాలా ఉంటాయి.
ఆ సమయంలో తోడేళ్లు గొర్రెపిల్లలతో కలిసి శాంతిగా జీవిస్తాయి. పెద్ద పులులు మేక పిల్లలతో కలిసి శాంతంగా పండుకొంటాయి. దూడలు, సింహాలు, ఎద్దులు కలిసి శాంతిగా జీవిస్తాయి. ఒక చిన్న పిల్లాడు వాటిని తోల్తాడు.
ఆవులు, ఎలుగుబంట్లు కలిసి శాంతిగా జీవిస్తాయి. వాటి పిల్లలన్నీ కలసి పండుకొంటాయి, ఒక దానిని ఒకటి బాధించవు. సింహాలు, ఆవుల్లా గడ్డి మేస్తాయి. చివరికి సర్పాలు కూడా మనుష్యులకు హాని చేయవు.
అంతా శాంతిగా ఉంటుందనీ, ఎవరూ ఒకరిని ఒకరు బాధించుకోరనీ ఈ విషయాలు తెలియ జేస్తున్నాయి. నా పరిశుద్ధ పర్వతం మీద ప్రజలు దేనినీ నాశనం చేయాలని ఆశించరు. ఎందుకంటే, ప్రజలు వాస్తవంగా యెహోవాను తెలుసుకొని ఉంటారు గనుక. సముద్రంనీళ్లతో నిండిపోయినట్టు, వారు దైవజ్ఞానంతో నిండిపోయి ఉంటారు.
ఆ సమయంలో యెష్షయి కుటుంబంలో ఒక ప్రత్యేక వ్యక్తి ఉంటాడు. ఈ వ్యక్తి ఒక పతాకంలా ఉంటాడు. రాజ్యాలన్నీ తన చుట్టూ సమావేశం కావాలని ఈ “పతాకం” చూపిస్తుంది. తాము చేయాల్సిన వాటిని గూర్చి రాజ్యాలు అతణ్ణి అడుగుతాయి. అతడు ఉండే స్థలం మహిమతో నిండిపోతుంది.
ఆ సమయంలో నా ప్రభువు (దేవుడు) మరలతన చేయిచాచి, మిగిలిన తన ప్రజలను తీసుకొంటాడు. దేవుడు ఇలా చేయటం రెండోసారి. (అష్షూరు, ఉత్తర ఈజిప్టు, దక్షిణ ఈజిప్టు, ఇథియోపియ, ఏలాము, బబులోను, హమాతు ప్రపంచంలోని దూర దేశాలన్నింటిలో మిగిలి ఉన్న దేవుని ప్రజలు వీరు.)
దేవుడు ఈ “పతాకాన్ని” మనుష్యులందరికీ ఒక సంకేతంగా నిలబెడతాడు. ఇశ్రాయేలు, యూదా ప్రజలు బలవంతంగా వారి దేశంనుండి వెళ్ల గొట్టబడ్డారు. ఆ ప్రజలు భూమిమీద దూర దేశాలన్నింటికీ చెదర గొట్టబడ్డారు. అయితే దేవుడు వాళ్లందరినీ మళ్లీ ఒక చోట సమావేశపరుస్తాడు.
అయితే ఎఫ్రాయిము, యూదా కలిసి ఫిలిష్తీయుల మీద దాడిచేస్తారు. ఈ రెండు రాజ్యాలు భూమి మీద ఒక చిన్న జంతువును పట్టుకొనేందుకు, కిందగా ఎగిరే రెండు పక్షుల్లా ఉంటారు. వారిద్దరూ కలిసి తూర్పు ప్రజల ఐశ్వర్యాలు దోచుకొంటారు. ఎదోము, మోయాబు, అమ్మోను ప్రజలను ఎఫ్రాయిము, యూదా తమ ఆధీనంలో ఉంచుకొంటారు.
యెహోవా కోపగించి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అదే విధంగా యూఫ్రటీసు నదిమీద యెహోవా తన చేయి ఊపుతాడు. ఆయన నదిని కొడ్తాడు. ఆ నది ఏడు చిన్న నదులుగా విభజించబడుతుంది. ఆ చిన్న నదులు లోతుగా ఉండవు. ప్రజలు చెప్పులతోనే ఆ నదులు దాటగలుగుతారు.