ఏడవ రోజును దేవుడు ఆశీర్వదించి, దానిని పవిత్ర దినంగా చేసాడు. దేవుడు ప్రపంచాన్ని చేసేటప్పుడు జరిగించిన పని అంతటి నుండి ఆ రోజున విశ్రాంతి తీసుకొన్నాడు గనుక, ఆ రోజును ఆయన ప్రత్యేకమైనదిగా చేసాడు.
భూమి మీద మొక్కలు ఏమీ లేవు. పొలాల్లో ఏమీ పెరగటం లేదు. అప్పటికి యింకా ఎక్కడా మొక్కలు మొలవలేదు. అప్పటికి భూమిమీద యింకా వర్షం యెహోవా కురిపించలేదు. మొక్కలను గూర్చి జాగ్రత్త తీసుకొనే ఏ మనిషి అప్పటికి లేడు.
అప్పుడు చూచుటకు అందంగా కనబడే చెట్లన్నింటినీ, మరియు ఆహారానికి మంచివైన చెట్లు అన్నింటినీ భూమి పుట్టించునట్లు దేవుడు చేసాడు. జీవ వృక్షమును, మంచి చెడుల తెలివిని ఇచ్చే వృక్షమును ఆ తోట మధ్యలో ఉన్నాయి.
అప్పుడు యెహోవా దేవుడు, “పురుషుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అతనికి సాటియైన సహకారిణిని నేను చేస్తాను. మరియు ఆ సహకారిణి అతనికి సహాయం చేస్తుంది” అనుకొన్నాడు.
పొలాల్లోని ప్రతి జంతువును, గాలిలోని ప్రతి పక్షిని నేలనుండి యెహోవా దేవుడు చేసాడు. ఈ జంతువులన్నింటిని యెహోవా దేవుడు మనిషి దగ్గరకు రప్పించాడు, మనిషి ప్రతిదానికి పేరు పెట్టాడు.
సాధు జంతువులన్నింటికీ, ఆకాశ ఫక్షులన్నింటికి, అడవి క్రూర జంతువులన్నింటికి మనిషి పేర్లు పెట్టాడు. ఎన్నెన్నో జంతువుల్ని పక్షుల్ని మనిషి చూశాడు. అయితే తనకు సరిపోయే సహాయంగా ఏదీ అతనికి కనబడలేదు.
అందుచేత ఆ పురుషుడు గాఢనిద్ర పోయేటట్టు చేసాడు యెహోవా దేవుడు. అతడు నిద్రపోతూ ఉండగా, అతని శరీరంలోని పక్క ఎముకలలో ఒకదాన్ని తీసాడు. పక్క ఎముకను తీసిన చోటును అతని మాంసముతో యెహోవా దేవుడు పూడ్చి వేసాడు.
అప్పుడు ఆ పురుషుడు ఇలా అన్నాడు: “ఇప్పుడు, ఇది నావంటి మనిషే అమె ఎముక నా ఎముకల్లోనుంచి వచ్చింది. ఆమె శరీరం నా శరీరంలోనుంచి వచ్చింది. ఆమె నరుని లోనుండి తీయబడింది గనుక ఆమెను నారి అంటాను.”