మీ విషయంలో నాకు అసూయగా ఉంది. ఆ అసూయ దేవుని కోసం. మిమ్మల్ని ఒకే భర్తకు అంటే క్రీస్తుకు అప్పగిస్తానని వాగ్దానం చేసాను. మిమ్మల్ని పవిత్ర కన్యగా ఆయనకు బహూకరించాలని అనుకున్నాను.
సర్పం కుయుక్తిగా చెప్పిన అబద్దాలవల్ల “హవ్వ” మోసపోయినట్లే మీరునూ మోసపోతారని, మీ మనస్సులు మలినం అవుతాయని నా భయం. మీకు క్రీస్తుపట్ల ఉన్న భక్తి పవిత్రమైంది. సంపూర్ణమైనది. అది విడిచివేస్తారని నా భయం.
ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మేము యేసును గురించి బోధించినట్లుగాక, వేరే విధంగా బోధిస్తే మీరు దాన్ని ఆనందంగా అంగీకరిస్తారు. మా నుండి పొందిన దైవసందేశానికి, ఆత్మకు వ్యతిరేకంగా దైవసందేశాన్ని, ఆత్మను ఎవరైనా యిస్తే మీరు వాటిని అంగీకరిస్తారు. [*ఎవరైనా … అంగీకరిస్తారు ఇది వ్యంగ్యంగా చెప్పబడింది. దీని అర్థమేమంటే: వాళ్ళు అలాంటి విషయాల్ని సహించకలగాలి.]
నేను మీతో ఉన్నప్పుడు ఎవ్వరికీ భారంగా ఉండలేదు. మాసిదోనియ నుండి వచ్చిన సోదరులు నాకు కావలసినవన్నీ తెచ్చారు. నేను మీపై ఏ విధమైన భారం మోపలేదు. ఇకముందు కూడా మోపను.
వాళ్ళు తమను గురించి గర్వంగా చెప్పుకోవాలని చూస్తారు. తాము మాతో సమానంగా ఉన్నట్లు మీరు గమనించాలని వాళ్ళ ఉద్దేశ్యం. ఆ అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు గర్వించటానికి కారణం లేకుండా చెయ్యటానికి నేను చేస్తున్నది చేస్తూపోతాను.
నన్నొక తెలివతక్కువవానిగా పరిగణించవద్దని మళ్ళీ చెపుతున్నాను. మీరు నేను తెలివతక్కువ వాణ్ణని అనుకొంటే, తెలివిలేని వాణ్ణి అంగీకరించినట్లు నన్ను అంగీకరించండి. అప్పుడు దానికి నేను కొద్దిగా గర్వపడవచ్చు.
మిమ్మల్ని బానిసలుగా చేసుకొన్న వాళ్ళ పట్ల, దోచుకొనే వాళ్ళ పట్ల, మీ వల్ల లాభం పొందే వాళ్ళపట్ల, మిమ్మల్ని అణచి పెట్టే వాళ్ళ పట్ల, మీ చెంపమీద కొట్టిన వాళ్ళ పట్ల, మీరు సహనం చూపుతారు.
వాళ్ళలా ప్రవర్తించే ధైర్యం మాకు లేదు. ఇది చెప్పుకోవటానికి నాకు సిగ్గు వేస్తోంది. ఎవరికైనా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంటే, నేనూ ఒక అవివేకిగా మాట్లాడుతున్నాను, నాకు కూడా గర్వంగా మాట్లాడే ధైర్యం ఉంది.
వాళ్ళు క్రీస్తు సేవకులా? ఈ విధంగా మాట్లాడాలంటే నాకు మతిపోతుంది. నేను వాళ్ళకన్నా ఎక్కువ సేవ చేస్తున్నాను. నేను వాళ్ళకన్నా ఎక్కువ కష్టించి పని చేసాను. వాళ్ళకన్నా ఎక్కువ సార్లు కారాగారానికి వెళ్ళాను. వాళ్ళకన్నా తీవ్రమైన కొరడాదెబ్బలు తిన్నాను. ఎన్నోసార్లు చావుకు గురి అయ్యాను.
విరామం లేకుండా ప్రయాణం చేసాను. ఆ ప్రయాణాల్లో నదులవల్ల ప్రమాదం కలిగింది. బందిపోటు దొంగలవల్ల ప్రమాదం కలిగింది. నా జాతీయులవల్ల ప్రమాదం కలిగింది. యూదులుకాని వాళ్ళవల్ల ప్రమాదం కలిగింది. పట్టణాల్లో ప్రమాదం కలిగింది. నిర్మానుష్య ప్రాంతాల్లో ప్రమాదం కలిగింది. సముద్రం మీద ప్రమాదం కలిగింది. దొంగ సోదరుల వల్ల ప్రమాదం కలిగింది.
నేను కష్టాలు ఎదుర్కొని, కష్టించి పని చేసాను. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాను. ఆకలి దప్పులు అంటే ఏమిటో తెలుసుకొన్నాను. ఎన్నోసార్లు ఆహారం లేక గడిపాను. చలిలో వస్త్రాలు లేకుండా గడిపాను.
మీలో ఒకడు బలహీనుడైనప్పుడు, నేనూ బలహీనుడు కాకుండా ఉండగలనా? ఒకడు పాపంలో పడితే, నేను నా అంతరంగంలో మండి పోకుండా ఉండగలనా? పాపం చెయ్యటానికి మీలో ఎవరైనా కారకుడు అయితే అతని పట్ల నాకు కోపం కలగదా?