ఎందుకంటే శారీరకమైన బాధననుభవించే వ్యక్తి తన మిగతా భౌతిక జీవితాన్ని, మానవులు కోరే దురాశల్ని తీర్చుకోవటానికి ఉపయోగించకుండా దైవేచ్ఛ కోసం ఉపయోగిస్తాడు. అలాంటి వానికి పాపంతో సంబంధముండదు.
ఈ కారణంగానే సువార్త ఇప్పుడు చనిపోయిన వాళ్ళకు కూడా ప్రకటింపబడింది. వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా జీవించాలని దేవుడు మానవులపై తీర్పుచెప్పినట్లు గానే వాళ్ళ మీద కూడా తీర్పు చెపుతాడు.
మాట్లాడాలని అనుకున్నవాడు దైవసందేశానుసారం మాట్లాడాలి. సేవ చేయదలచిన వాడు దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించి సేవచెయ్యాలి. అలా చేస్తే, శాశ్వతంగా తేజోవంతుడూ, శక్తివంతుడూ అయినటువంటి దేవుణ్ణి యేసు క్రీస్తు ద్వారా అన్ని విషయాల్లో స్తుతించినట్లు అవుతుంది.
ఎందుకంటే, తీర్పు చెప్పే సమయం దగ్గరకు వచ్చింది. మొదట దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళ మీద తీర్పు చెప్పబడుతుంది. మరి ఆ తీర్పు మనతో ప్రారంభమైతే దేవుని సువార్తను నిరాకరించిన వాళ్ళగతేమౌతుంది?