మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహా సనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.
మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను; అందువలన భూమిలో మూడవ భాగము కాలి పోయెను, చెట్లలో మూడవ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డియంతయు కాలిపోయెను.
నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింప కుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను.
మరియు నేను చూడగా ఆకాశమధ్యమున ఒక పక్షి రాజు ఎగురుచు--బూరలు ఊదబోవుచున్న ముగ్గురు దూతల బూరల శబ్దములనుబట్టి భూనివాసులకు అయ్యో, అయ్యో, అయ్యో, అని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని.