అప్పుడు రాణియైన ఎస్తేరు ఈలాగు ప్రత్యుత్తరమిచ్చెనురాజా, నీ దృష్టికి నేను దయపొందిన దాననైన యెడల రాజవైన తమకు సమ్మతియైతే, నా విజ్ఞాపననుబట్టి నా ప్రాణమును, నా మనవినిబట్టి నా జనులును, నా కనుగ్ర హింపబడుదురు గాక.
సంహరింపబడుటకును, హతము చేయబడి నశించుటకును, నేనును నా జనులును కూడ అమ్మబడినవారము. మేము దాసులముగాను దాసు రాండ్రముగాను అమ్మబడిన యెడల నేను మౌనముగా నుందును; ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు.
రాజు ఆగ్రహమొంది ద్రాక్షా రసపు విందును విడిచి నగరు వనమునకు పోయెను. అయితే రాజు తనకు ఏదో హానిచేయ నుద్దేశించెనని హామాను తెలిసికొని, రాణియైన ఎస్తేరు ఎదుట తన ప్రాణముకొరకు విన్నపము చేయుటకై నిలిచెను.
నగరువనములోనుండి ద్రాక్షారసపు విందుస్థలమునకు రాజు తిరిగి రాగా ఎస్తేరు కూర్చుండియున్న శయ్యమీద హామాను బడియుండుట చూచివీడు ఇంటిలో నా సముఖము ఎదుటనే రాణిని బలవంతము చేయునా? అని చెప్పెను; ఆ మాట రాజు నోట రాగానే బంటులు హామాను ముఖమునకు ముసుకు వేసిరి.