Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

2 Chronicles Chapters

2 Chronicles 20 Verses

Bible Versions

Books

2 Chronicles Chapters

2 Chronicles 20 Verses

1 ఇది యయిన తరువాత మోయాబీయులును అమ్మో నీయులును మెయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతుమీదికి వచ్చిరి.
2 అంతలో కొందరు వచ్చిసముద్రము ఆవలనుండు సిరియ నులతట్టునుండి గొప్ప సైన్యమొకటి నీమీదికి వచ్చుచున్నది; చిత్తగించుము, వారు హససోన్‌తామారు అను ఏన్గెదీలో ఉన్నారని యెహోషా పాతునకు తెలియజేసిరి.
3 అందుకు యెహోషాపాతు భయపడి యెహోవాయొద్ద విచారించుటకు మనస్సు నిలుపు కొని, యూదాయంతట ఉపవాసదినము ఆచరింపవలెనని చాటింపగా
4 యూదావారు యెహోవావలని సహాయ మును వేడుకొనుటకై కూడుకొనిరి, యెహోవాయొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలోనుండి జనులు వచ్చిరి.
5 యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాలయెదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనులమధ్యను నిలువబడి
6 మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై యున్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే; నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుట కెవరికిని బలము చాలదు.
7 నీ జనులైన ఇశ్రాయేలీయుల యెదుటనుండి ఈ దేశపు కాపురస్థులను తోలివేసి, నీ స్నేహితుడైన అబ్రాహాముయొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే.
8 వారు అందులో నివాసముచేసి, కీడైనను యుద్ధమైనను తీర్పైనను తెగులైనను కరవైనను,మామీదికి వచ్చినప్పుడు మేము ఈమందిరము ఎదుటను నీ యెదుటను నిలువబడి మా శ్రమలో నీకు మొఱ్ఱపెట్టినయెడల
9 నీవు ఆలకించి మమ్మును రక్షిం చుదువని అనుకొని, యిచ్చట నీ నామఘనతకొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా.
10 ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోను మోయా బీయులతోను శేయీరు మన్యవాసులతోను యుద్ధము చేయనియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలము చేయక వారియొద్దనుండి తొలగి పోయిరి.
11 మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మా కిచ్చిన నీ స్వాస్థ్య ములోనుండి మమ్మును తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టిం చుము.
12 మా దేవా, నీవు వారికి తీర్పుతీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు; ఏమి చేయుటకును మాకు తోచదు; నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను.
13 యూదావారందరును తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడిరి.
14 అప్పుడు మత్తన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయాకు జననమైన జెకర్యా కుమారుడును ఆసాపు సంతతివాడును లేవీయుడునగు యహజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతనిమీదికి రాగా అతడీలాగు ప్రకటిం చెను
15 యూదావారలారా, యెరూషలేము కాపు రస్థులారా, యెహోషాపాతు రాజా, మీరందరును ఆలకించుడి; యెహోవా సెలవిచ్చునదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును.
16 రేపు వారిమీదికి పోవుడి; వారు జీజు అను ఎక్కుడుమార్గమున వచ్చెదరు, మీరు యెరూవేలు అరణ్యము ముందరనున్న వాగుకొనదగ్గర వారిని కనుగొందురు.
17 ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు; యూదావారలారా, యెరూషలేమువారలారా, మీరు యుద్ధపంక్తులు తీర్చినిలువబడుడి; మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు; భయపడకుడి జడియకుడి, రేపు వారిమీదికి పోవుడి, యెహోవా మీతో కూడ ఉండును.
18 అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమ స్కారము చేసెను; యూదావారును యెరూషలేము కాపు రస్థులును యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి.
19 కహాతీయుల సంతతివారును కోరహీయుల సంతతి వారునగు లేవీయులు నిలువబడి గొప్ప శబ్దముతో ఇశ్రా యేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించిరి.
20 అంతట వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి; వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడియూదావారలారా, యెరూషలేము కాపురస్థులారా, నా మాట వినుడి; మీ దేవుడైన యెహో వాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు; ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురనిచెప్పెను.
21 మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడచుచుయెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను.
22 వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయుల మీదను శేయీరు మన్యవాసులమీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి.
23 అమ్మోనీయులును మోయాబీయులును శేయీరు మన్యనివాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలెనని పొంచియుండి వారిమీద పడిరి; వారు శేయీరు కాపురస్థులను కడముట్టించిన తరువాత తమలో ఒకరి నొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి.
24 యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యముతట్టు చూడగా వారు శవములై నేలపడియుండిరి, ఒకడును తప్పించుకొనలేదు.
25 యెహోషాపాతును అతని జనులును వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవములయొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలును కనబడెను; వారు తమకిష్టమైనంతమట్టుకు తీసికొని తాము కొని పో గలిగినంతకంటె ఎక్కువగా ఒలుచు కొనిరి; కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు మూడు దినములు పట్టెను.
26 నాల్గవ దినమున వారు బెరాకా1 లోయలో కూడిరి; అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటివరకును ఆ చోటికి బెరాకా1 లోయ యని పేరు.
27 ఈలాగున యెహోవా వారి శత్రువులమీద వారికి జయము అను గ్రహించి వారిని సంతోషపరచెను గనుక యెరూషలేమునకు ఉత్సవముతో మరలవలెనని యూదావారును యెరూషలేమువారును వారందరికి ముందు యెహోషా పాతును సాగి వెళ్లిరి;
28 వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలు ఊదుచువచ్చిరి.
29 ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధము చేసెనని దేశముల రాజ్యముల వారందరు వినగా దేవుని భయము వారందరిమీదికి వచ్చెను.
30 ఈ ప్రకారము అతని దేవుడు చుట్టునున్నవారిని జయించి అతనికి నెమ్మది ననుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను.
31 యెహోషాపాతు యూదారాజ్యమును ఏలెను. అతడు ఏలనారంభించినప్పుడు ముప్పదియయిదు సంవత్సర ములవాడై యెరూషలేములో ఇరువదియయిదు సంవత్సర ములు ఏలెను; అతని తల్లి షిల్హీ కుమార్తె, ఆమె పేరు అజూబా,
32 అతడు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి తన తండ్రియైన ఆసామార్గమందు నడచుచు దానిలోనుండి తొలగిపోకుండెను.
33 అయితే అప్పటికింకను జనులు తమ పితరుల దేవుని వెదకుటకు తమ హృదయములను స్థిరపరచుకొనలేదు, అతడు ఉన్నతస్థలములను తీసివేయలేదు.
34 యెహోషాపాతు చేసిన కార్యములన్నిటినిగూర్చి హనానీ కుమారుడైన యెహూ రచించిన గ్రంథమందు వ్రాయబడియున్నది. ఈ యెహూ పేరు, ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు కన బడుచున్నది.
35 ఇది యయిన తరువాత యూదా రాజైన యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో స్నేహము చేసెను.
36 తర్షీషునకు పోదగిన ఓడలను చేయింపవలెనని యెహోషాపాతు అతనితో స్నేహము చేయగా వారు ఎసోన్గెబెరులో ఆ ఓడలను చేయించిరి.
37 అప్పుడు మారేషా వాడును దోదావాహు కుమారుడునగు ఎలీయెజెరునీవు అహజ్యాతో స్నేహము చేసికొంటివి గనుక యెహోవా నీ పనులను భంగము చేయునని యెహోషాపాతుమీద ప్రవచనమొకటి చెప్పెను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్లజాల కుండ బద్దలైపోయెను.

2-Chronicles 20:9 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×