1
|
సున్నతి పొందిన వాళ్ళలో ఏదైనా ప్రత్యేకత ఉందా? లేదు. మరి అలాంటప్పుడు యూదులుగా ఉండటంవల్ల వచ్చిన లాభమేమిటి? |
2
|
ఎంతో లాభం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమేమిటంటే దేవుడు వాళ్ళకు తన సందేశాన్ని అప్పగించాడు. |
3
|
మరి వాళ్ళల్లో కొందరు నమ్మతగని వాళ్ళున్నంత మాత్రాన దేవుడు నమ్మతగని వాడని అనగలమా? |
4
|
అలా అనలేము. ప్రతి ఒక్కడూ అసత్యం చెప్పినాసరే, దేవుడు మాత్రం సత్యవంతుడుగా ఉంటాడు! ఈ విషయమై ఇలా వ్రాయబడివుంది: "నీవు మాట్లడినప్పుడు నిజం చెప్పావని ఋజువౌతుంది. నీపై విచారణ జరిగినప్పుడు నీవు గెలుస్తావు!" కీర్తన 51:4 |
5
|
మనం అధర్మంగా ఉన్నాము కనుకనే దేవునిలో ఉన్న ధర్మం స్పష్టంగా కనిపిస్తోందంటే ఏమనగలము? దేవుడు మనల్ని శిక్షించి తప్పు చేస్తున్నాడనగలమా? నేను మానవ నైజం ప్రకారం తర్కిస్తున్నాను. |
6
|
ఎన్నటికీ కాదు. అలాగైనట్లైతే దేవుడు ప్రపంచంపై ఎట్లా తీర్పు చెప్పగలడు? |
7
|
"నేను అసత్యవంతునిగా ఉండటం వల్ల దేవుడు సత్యవంతుడనే కీర్తి పెరుగుతున్నట్లైతే, నేను పాపినని ఇంకా ఎందుకంటున్నారు? |
8
|
మంచి కలగటానికి మనం పాపంచేద్దాం" అని అనకూడదు. మేమీవిధంగా బోధించినట్లు కొందరు మమ్మల్ని నిందించి అవమానిస్తున్నారు. వాళ్ళకు తగిన శిక్ష లభిస్తుంది. |
9
|
మరి ఇంతకూ ఏమని నిర్ణయం చేద్దాం? మనం వాళ్ళకంటే ఉత్తమమైన వాళ్ళమనా? ఎన్నటికి కాదు. యూదులు, యూదులుకాని వాళ్ళు, అందరూ సమానంగా పాపం చేసారు. దీన్ని నేనిదివరకే ఋజువు చేసాను. |
10
|
ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది: "నీతిమంతుడు లేడు. ఒక్కడు కూడా లేడు! |
11
|
అర్థం చేసుకొనేవాడొక్కడూ లేడు. దేవుణ్ణి అన్వేషించే వాడెవ్వడూ లేడు. |
12
|
అందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు. అందరూ కలిసి పనికిరాని వాళ్ళైపోయారు. మంచి చేసే వాడొక్కడూ లేడు. ఒక్కడు కూడా లేడు!" కీర్తన 14:1-3 |
13
|
"వాళ్ళనోళ్ళు తెరుచుకొన్న సమాధుల్లా ఉన్నాయి. వాళ్ళ నాలుకలు మోసాలు పలుకుతూ ఉంటాయి;" కీర్తన 5:9 "వాళ్ళ పెదాలపై పాము విషం ఉంటుంది!" కీర్తన 140:3 |
14
|
"వాళ్ళ నోటినిండా తిట్లూ, ద్వేషంతో కూడుకొన్న మాటలు ఉంటాయి!" కీర్తన 10:7 |
15
|
"వాళ్ళ పాదాలు రక్తాన్ని చిందించటానికి తొందరపడ్తుంటాయి. |
16
|
వాళ్ళు తాము నడిచిన దారుల్లో వినాశ నాన్ని, దుఃఖాన్ని వదులుతుంటారు. |
17
|
వాళ్ళకు శాంతి మార్గమేదో తెలియదు!" యెషయా 59:7-8 |
18
|
"వాళ్ళ కళ్ళలో దైవభీతి కనిపించదు." కీర్తన 36:1 |
19
|
ధర్మశాస్త్ర నియమాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసిన వారికి వర్తిస్తాయని మనకు తెలుసు. తద్వారా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ, అంటే యూదులు కాని వాళ్ళేకాక, యూదులు కూడా దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. |
20
|
ధర్మశాస్త్రం తెలిస్తే పాపాన్ని గురించి జ్ఞానం కలుగుతుంది. అంతేకాని, ధర్మశాస్త్రాన్ని అనుసరించినంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులం కాలేము. |
21
|
కాని దేవుడు ఇప్పుడు ధర్మశాస్త్రం ఉపయోగించకుండా నీతిమంతులయ్యే విధానం మనకు తెలియచేసాడు. ఈ విధానాన్ని ప్రవక్తలు ముందే చెప్పారు. ఇది ధర్మశాస్త్రంలోనూ ఉంది. |
22
|
దీని ప్రకారం యేసు క్రీస్తులో మనకున్న విశ్వాసంవల్ల దేవుడు మనల్ని నిర్దోషులుగా పరిగణిస్తున్నాడని విదితమౌతుంది. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కనికి ఈ విధానం వర్తిస్తుంది. |
23
|
అందరూ పాపం చేసారు, కనుక దేవుని తేజస్సు పంచుకోవటానికి ఎవ్వరికీ అర్హత లేదు. అందువల్ల ఈ విధానం అందరికీ వర్తిస్తుంది. వ్యత్యాసం లేదు. |
24
|
కాని, దేవుడు వాళ్ళను తన ఉచితమైన కృపవల్ల నీతిమంతులుగా చేస్తున్నాడు. ఇది యేసు క్రీస్తు వల్ల కలిగే విముక్తి ద్వారా సంభవిస్తుంది. |
25
|
దేవుడు ఇది వరలో ప్రజలు చేసిన పాపాల్ని లెక్క చెయ్యకుండా సహనం వహించాడు. ఆయన తన నీతిని నిరూపించాలని యేసు క్రీస్తు రక్తాన్ని విశ్వసించే ప్రజలకోసం ఆయనను కరుణాపీఠంగా చేసాడు. |
26
|
అలా చేసి ఇప్పుడు తన నీతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రజలు తనను నీతిమంతునిగా పరిగణించాలని, యేసును విశ్వసించే ప్రజలను నీతిమంతులుగా చెయ్యాలని ఆయన ఉద్దేశ్యం. |
27
|
మరి, మనం గర్వించటానికి కారణం ఉందా? ఖచితంగా లేదు. ఏ న్యాయం ప్రకారం కారణం లేదని చెప్పగలుగుతున్నాము? విశ్వాసానికి సంభందించిన న్యాయంవల్ల కారణం లేదని చెపుతున్నాము. కాని క్రియా న్యాయం వల్లకాదు. |
28
|
మనిషిలో ఉన్న విశ్వాసం అతణ్ణి నీతిమంతునిగా చేస్తుంది. ధర్మశాస్త్రం ఆదేశించిన క్రియలు చేసినందుకు కాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. |
29
|
దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడొక్కడే కనుక ఆయన యూదులు కాని వాళ్ళకు కూడా దేవుడే. |
30
|
దేవుడు సున్నతి పొందిన వాళ్లను వాళ్ళలో విశ్వాసం ఉంది కనుక నీతిమంతులుగా పరిగణిస్తాడు. సున్నతి పొందని వాళ్ళను కూడా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా పరిగణిస్తాడు. |
31
|
మరి అలాగైతే, ఈ విశ్వాసాన్ని స్థాపించి మనం ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నామా? కాదు. దాని విలువను ఎత్తి చూపిస్తున్నాము. |
Romans 3:26 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...