నా ప్రియమైన సోదరులారా! మిమ్మల్ని చూడాలని నాకు ఎంతో ఆత్రుతగా ఉంది. మీరు నాకు చాలా ఆనందం కలిగించారు. మీ విషయంలో నేను చాలా గర్విస్తుంటాను. ప్రియ మిత్రులారా! ప్రభువును అనుసరించటం మానుకోకండి.
నిజమైన జత పనివాడా! నీవు నాతో కలిసి పని చేసావు. నీవు నమ్మకంగా పని చేసేవాడవని నాకు తెలుసు. ఈ స్త్రీలకు సహాయం చేయి. దైవసందేశాన్ని ప్రకటించటంలో వీళ్ళు క్లెమెంతుతోను, మరియు మిగతా వాళ్ళతోను కలిసి నా పక్షాన నిలిచారు. ఈ మిగతా వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి.
కనుక సోదరులారా! నేను చివరకు చెప్పేదేమిటంటే, సత్యమైనవాటిని, మంచివాటిని, ధర్మమైన వాటిని, పవిత్రమైన వాటిని, ఆనందమైన వాటిని, మెచ్చుకోతగ్గవాటిని, అంటే ఉత్తమంగా ఉన్న వాటిని గురించి, ప్రశాంతమైన వాటిని గురించి మీ మనస్సులో ఆలోచించండి.
మీరు నా ద్వారా నేర్చుకొన్న వాటిని, నా నుండి పొందిన వాటిని, నా నుండి విన్నవాటిని, నాలో చూసిన వాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు శాంతిని కలిగించే దేవుడు మీతో ఉంటాడు.
మీకు నా పట్ల ఉన్న అభిమానం మళ్ళీ మొలకెత్తినందుకు నేను ప్రభువు పేరిట చాలా ఆనందిస్తున్నాను. ఔను మీకు నా పట్ల అభిమానం ఉంది కాని, దాన్ని చూపించుకొనే అవకాశం మీకు చిక్కలేదు.
అవసరంలో ఉండటం అంటే ఏమిటో, అధికంగా కలిగి ఉండటం అంటే ఏమిటో నాకు తెలుసు. అన్ని పరిస్థితుల్లో, అంటే కడుపు నిండి ఉండుటను ఆకలితో ఉండుటను, అవసరాలలో ఉన్నప్పుడును అధికంగా కలిగి ఉన్నప్పుడును సంతృప్తికరంగా ఎలా ఉండాలో, దాని రహస్యమేమీటో, నేను తెలుసుకున్నాను.
పైగా దైవసందేశాన్ని గురించి మీరు క్రొత్తగా విన్నప్పుడు, ఫిలిప్పీలోవున్న మీరు తప్ప ఎవ్వరూ నాకు సహాయం చెయ్యలేదు. నేను మాసిదోనియ నుండి ప్రయాణం సాగించినప్పుడు ఒక్క సంఘం కూడా నాకు సహాయం చెయ్యలేదు. నాకు వాళ్ళు ఏమీ యివ్వలేదు. నానుండి ఏమీ పుచ్చుకోలేదు.
నాకు కావలసిన దానికన్నా ఎక్కవే చెల్లించారు. మీరు ఎపఫ్రొదితు ద్వారా నాకు పంపిన విరాళాలు నాకు ముట్టాయి. దానితో నా అవసరాలు పూర్తిగా తీరిపోయాయి. సుగంధ పరిమళాల వలే ఉన్న మీ విరాళాలను దేవుడు ఆనందంగా అంగీకరిస్తాడు.