యేసు వాళ్ళ వెంట వెళ్ళాడు. ఆయన శతాధిపతి యింటికి వస్తుండగా ఆ శతాధిపతి తన స్నేహితుల్ని పంపి ఆయనతో యిలా చెప్పమన్నాడు: “ప్రభూ! మీరు నా గడప దాటి నా యింట్లో కాలు పెట్టే అర్హత నాకు లేదు. మీకా శ్రమ వద్దు.
ఆజ్ఞాపించటం అంటే ఏమిటో నాకు తెలుసు. ఎందుకంటే నేను ఒకరి అధికారంలో ఉన్నవాణ్ణి. నా క్రింద ఉన్న సైనికులపై నాకు అధికారం ఉంది. ఇతణ్ణి ‘వెళ్ళు’ అంటే వెళ్తాడు. అతణ్ణి ‘రా’ అంటే వస్తాడు. నా సేవకునితో ‘యిది చెయ్యి’ అంటే చేస్తాడు.”
యేసు శతాధిపతి చెప్పి పంపింది విని ఆశ్చర్యపొయ్యాడు. తనను అనుసరిస్తున్న ప్రజల వైపు తిరిగి, “ఇంత భక్తి నేను ఇశ్రాయేలులో కూడా చూడలేదని చెప్పగలను” అని అన్నాడు.
ఆయన ఆ పట్టణం యొక్క ముఖ్య ద్వారం చేరుకుంటుండగా కొందరు శవాన్ని మోసుకొని వెళ్తుండటం చూశాడు. అతని తల్లికి ఈ చనిపోయిన వాడు మాత్రమే కుమారుడు. తల్లి వితంతువు. ఆ వూరి వాళ్ళు అనేకులు ఆమె వెంటవున్నారు.
వాళ్ళందరిలో భక్తి, భయము నిండుకు పోయాయి. వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. వాళ్ళు, “ఒక గొప్ప ప్రవక్త మనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తన ప్రజల్ని కాపాడటానికి వచ్చాడు” అని అన్నారు.
వాళ్ళు యేసు దగ్గరకు వచ్చి, “బాప్తిస్మము నిచ్చి, ఉపదేశం చేసే యోహాను ఈ విధంగా అడిగి రమ్మని మమ్మల్ని పంపాడు: ‘రానున్నది మీరేనా? మరొకరి కోసం మేము ఎదురుచూడాలా?’ ” అని అన్నారు.
యేసు, ఆ వర్తమానం తెచ్చిన వాళ్ళతో, “వెళ్ళి యోహానుతో గ్రుడ్డివాళ్ళకు దృష్టి లభిస్తొందని, కుంటివాళ్ళు నడుస్తున్నారని, కుష్టురోగులకు నయమౌతుందని, చెవిటి వాళ్ళు వింటున్నారని, పేదవాళ్ళకు దైవ సందేశము బోధింపబడ్తోందని చెప్పండి. మీరు చూసిన వాటిని, విన్నవాటిని అతనికి చెప్పండి.
ఆ వార్త తెచ్చిన వాళ్ళు వెళ్ళి పొయ్యాక యేసు అక్కడ సమావేశమైన ప్రజలకు యోహానును గురించి ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఎడారి ప్రాంతాలకు ఏం చూడాలని వెళ్ళారు? రెల్లు గాలికి కదలటం చూడాలని వెళ్ళారా?
వాళ్ళు సంతలో కూర్చొని, ‘మేము మీకోసం పిల్లన గ్రోవి ఊదాము. కాని మీరు నాట్యం చేయలేదు. మేము చనిపోయిన వానికోసం పాట పాడాము. కాని మీరు దుఃఖించలేదు’ అని మాట్లాడుకొంటున్న చిన్న పిల్లల్లాంటి వాళ్ళు.
మనుష్యకుమారుడు తింటూ, త్రాగుతూ వచ్చాడు. ఆయన్ని మీరు తిండిపోతు, త్రాగుపోతు అని అన్నారు. పన్నులు వసూలు చేసే వాళ్ళతో, పాపులతో స్నేహం చేస్తాడని ఆయన్ని విమర్శించారు.
ఆ పట్టణంలో పాపాలు చేస్తూ జీవిస్తున్న ఒక స్త్రీ యేసు పరిసయ్యుని యింట్లో భోజనం చేస్తున్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళింది. వెళ్ళేముందు చలువరాతి బుడ్డిలో ఖరీదైన అత్తరు తన వెంట తీసుకువెళ్ళింది.
ఆయన్ని ఆహ్వానించిన పరిసయ్యుడు ఇది చూసి, “ఆయన ప్రవక్త అయినట్లైతే తనను ఎవరు తాకారో, ఆమె ఎలాంటి స్త్రీయో, అంటే ఆమె పాపం చేస్తూ జీవించే స్త్రీయని తెలుసుకుంటాడు” అని తన మనస్సులో అనుకున్నాడు.
ఇద్దరిలో ఎవ్వరి దగ్గర కూడా అప్పుతీర్చటానికి డబ్బులేదు. అందువల్ల ఆ షావుకారు వాళ్ళిద్దరి అప్పు రద్దు చేశాడు. ఆ యిద్దరిలో ఎవరు ఆ షావుకారి పట్ల ఎక్కువ ప్రేమ కనుబరుస్తారు?” అని అడిగాడు.
ఆ తర్వాత ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో, “ఈ స్త్రీని చూస్తున్నావా? నేను నీ యింటికి వచ్చాను. కాళ్ళు కడుక్కోవటానికి నీవు నీళ్ళు కూడా ఇవ్వలేదు. కాని ఈమె నా కాళ్ళు తన కన్నీటితో కడిగి తన వెంట్రుకలతో తుడిచింది.
అందువల్ల నేను చెప్పేదేమిటంటే ఆమె చేసిన పాపాలన్నీ క్షమించబడ్డాయి. దీనికి ఆమె చూపిన అమితమైన ప్రేమే నిదర్శనం. కొన్ని పాపాలు మాత్రమే క్షమించబడిన వానికి కొంత ప్రేమ మాత్రమే ఉంటుంది” అని అన్నాడు.