Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Jeremiah Chapters

Jeremiah 49 Verses

Bible Versions

Books

Jeremiah Chapters

Jeremiah 49 Verses

1 ఈ వర్తమానం అమ్మోనీయులను గురించినది. యెహోవా ఇలా చెపుతున్నాడు, “అమ్మోను ప్రజలారా, ఇశ్రాయేలు ప్రజలకు పిల్లలు లేరని మీరు అనుకొంటున్నారా? తల్లి తండ్రులు చనిపోతే భూమిని స్వతంత్రించుకొనుటకు అక్కడ పిల్లలు లేరని మీరనుకొంటున్నారా? బహుశః అందువల్లనే మల్కోము గాదు రాజ్యాన్ని తీసికొన్నాడా?”
2 యెహోవా ఇలా చెపుతున్నాడు, “రబ్బోతు అమ్మోను ప్రజలు యుద్ధనాదాలు వినే సమయం వస్తుంది. రబ్బోతు - అమ్మోను నాశనమవుతుంది. అది కూలిపోయిన భవనాలతో నిండిన ఒక కొండలా ఉంటుంది. దాని చట్టూ ఉన్న పట్టణాలు తగులబడతాయి. ఆ జనం ఇశ్రాయేలీయులను తమ రాజ్యాన్ని వదిలి పొమ్మని వత్తిడి చేశారు. కాని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వారిని దేశం వదిలి పొమ్మని బలవంతం చేస్తారు.” మరియు వారు భూమిని వారి స్వంతము చేసుకుంటారు. యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
3 “హెష్బోను ప్రజలారా, విలపించండి! ఎందువల్లనంటే, హాయి పట్టణం పాడైపోయింది. రబ్బోతు - అమ్మోను మహిళల్లారా, విలపించండి! విషాద సూచకంగా మీరు నారబట్టలు ధరించి శోకించండి. రక్షణ కొరకు నగరానికి పరుగెత్తండి. ఎందువల్లనంటే, శత్రువు మీ మీదికి వస్తున్నాడు. వారు మల్కోము దైవాన్ని తీసికొనిపోతారు. వారు మల్కోము యాజకులను, అధికారులను చెరపట్టుతారు.
4 నీవు నీ బలాన్ని గురించి గొప్పలు చెప్పుకుంటావు. కాని నీవు నీ బలాన్ని కోల్పోతున్నావు. నీ డబ్బు నిన్ను రక్షిస్తుందని నీవు నమ్మావు. నిన్ను ఎదిరించటానికి ఏ ఒక్కడూ కనీసం ఆలోచన కూడా చేయడని నీవనుకున్నావు.”
5 కాని సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, “ నలుమూలల నుండి నేను మీకు కష్టాలు తెచ్చిపెడతాను. మీరంతా పారిపోతారు. మిమ్మల్నందరినీ మరల ఎవ్వరూ కూడదీయలేరు.”
6 “అమ్మోనీయులు బందీలుగా కొనిపోబడతారు. కాని అమ్మోనీయులను నేను వెనుకకు తీసికొనివచ్చే సమయం వస్తుంది.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
7 ఈ వర్తమానం ఎదోమును గురించినది. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “తేమాను పట్టణంలో జ్ఞానం ఏమాత్రం లేదా? ఎదోములోని జ్ఞానులు మంచి సలహా ఇవ్వలేక పోతున్నారా? వారి జ్ఞానాన్ని వారు కోల్పోయారా?
8 దదానులో నివసించే ప్రజలారా, పారిపోండి! దాగుకోండి! ఎందుకంటే, నేను ఏశావును తాను చేసిన చెడ్డ పనులు కారణంగా శిక్షిస్తాను.
9 మీ ద్రాక్ష తీగల నుండి పనివారు వారికి కావలసినన్ని ద్రాక్షకాయలను కోస్తారు. అయినా వారు కొన్ని కాయలను చెట్లపై వదిలివేస్తారు. రాత్రిళ్లు దొంగలు వచ్చినా వారికి కావలసిన పరిమాణంలోనే తీసికొనిపోతారు.
10 కాని ఏశావు నుండి నేను అంతా తీసికుంటాను. అతడు దాచుకొనే స్థలాలన్నింటినీ నేను కనుగొంటాను. అతడు నానుండి ఏమీయు దాచలేడు. అతని పిల్లలు, బంధువులు, పొరుగువారు అంత చనిపోతారు.
11 అతని పిల్లల పట్ల శ్రద్ధ తీసికొనటానికి ఎవ్వరూ మిగలరు. అతని విధవరాండ్రు ఒంటరిగా విడువబడుతారు (యెహోవానైన) నేను మాత్రమే మీ అనాధుల ప్రాణాల్ని కాపాడుతాను. మరియు మీ విధవరాండ్రు నామీద నమ్మకముంచుతారు.”
12 యెహోవా ఇంకా ఇలా చెపుతున్నాడు: “కొంతమంది మనుష్యులు శిక్షకు అర్హులు కారు. అయినా వారు బాధ అనుభవించారు. కాని ఎదోమూ, నీవు శిక్షకు పాత్రుడవు. కావున నీవు నిజంగా శిక్షింపబడతావు. అర్హమైన నీ శిక్షను నీవు తప్పించుకొనలేవు. నీవు దండించబడతావు.”
13 యెహోవా చెపుతున్నాడు, “నా స్వయం శక్తితో నేనీ ప్రమాణం చేస్తున్నాను, బొస్రా నగరం నాశనమవుతుందని నిశ్చయంగా చెపుతున్నాను. ఆ నగరం పాడుబడి రాళ్లగుట్టలా మారిపోతుంది. ఇతర నగరాలకు ప్రజలు కీడు జరగాలని కోరుకున్నప్పుడు ఈ నగరానికి సంభవించినట్లు జరగాలని దీనిని ఉదహరిస్తారు. ప్రజలా నగరాన్ని అవమానపరుస్తారు. బొస్రా చుట్టుపట్లవున్న పట్టణాలన్నీ శాశ్వతంగా శిథిలాలైపోతాయి.”
14 యెహోవా నుండి నేనొక సందేశం విన్నాను, దేశాలకు యెహోవా ఒక దూతను పంపాడు. ఆ సందేశం ఇలా వుంది, “మీ సైన్యాలను సమకూర్చుకోండి! యుద్ధానికి సిద్ధపడండీ. ఎదోము దేశం మీదికి కదలి వెళ్లండి!
15 “ఏదోమూ, నేను నీ ప్రాముఖ్యతను, ఘనతను తగ్గించివేస్తాను. ప్రతివాడూ నిన్ను అసహ్యించుకుంటాడు.
16 ఎదోమా, నీవు ఇతర దేశాలను బెదరగొట్టావు. అందువల్ల నీవు గొప్పవాడివనుకున్నావు. కాని నీవు మోసపోయావు. నీ గర్వం నిన్ను మోసగించింది. ఎదోమూ, నీవు ఎత్తయిన కొండలపై నివసిస్తున్నావు. పెద్ద బండలు, కొండలు రక్షణ కల్గించే ప్రదేశాలలో నీవు నివసిస్తున్నావు. గద్ద గూటిలా నీ ఇంటిని ఎంత ఉన్నతమైన స్థలంలో కట్టుకున్నా నేను నిన్ను పట్టుకుంటాను. అక్కడినుండి నేను నిన్ను కిందికి దింపుతాను,” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
17 “ఎదోము నాశనం చేయబడుతుంది. నాశనమయిన నగరాన్ని చూచి ప్రజలు విస్మయం చెంది ఆశ్చర్యంతో ఈల వేస్తారు. నాశనమయిన నగరాలను చూచి ప్రజలు ధిగ్భ్రాంతి చెంది సంభ్రమాశ్చర్య పడతారు.
18 సొదొమ, గొమొర్రా నగరాలు, వాటి పరిసర పట్టణాల్లా ఎదోము కూడ నాశనం చేయబడుతుంది. అక్కడ ఎవ్వరూ నివసించరు. “ ఈ విషయాలు యెహోవా చెప్పాడు.
19 “యొర్దాను నది దగ్గర దట్టమైన పొదలనుండి కొన్నాసార్లు సింహం వస్తూ ఉంటుంది. పొలాల్లో ప్రజలు మందవేసిన గొర్రెల మీదికి, పశువుల మీదికి వెళుతుంది. నేను ఆ సింహంలాంటివాణ్ణి! నేను ఎదోము మీదికి వెళతాను. నేనా ప్రజలను బెదరగొడతాను. వారిని పారిపోయేలా నేను చేస్తాను. వారి యువకులలో ఎవ్వడూ నన్ను ఆపలేడు. నాలా మరెవ్వడూ లేడు! నన్నెవ్వరూ ఎదిరించలేరు. వారి గొర్రెల కాపరులలో (నాయకులు) ఏ ఒక్కడూ నన్నెదిరించి నిలువలేడు.”
20 కావున ఎదోముకు వ్యతిరేకంగా యెహోవా వేసిన పధకాన్ని వినండి. తేమాను వాసులకు యెహోవా ఏమి చేయ నిశ్చయించినది వినండి ఎదోము మంద (ప్రజలు)లో నుండి చిన్నవాటినన్నిటినీ శత్రువు ఈడ్చుకుపోతాడు. ఎదోము పచ్చిక బయళ్లు వారు చేసిన దాన్ని బట్టి ఆశ్చర్యపోతాయి.
21 ఎదోము పతనంతో పుట్టిన శబ్దానికి భూమి కంపిస్తుంది. వారి ఆక్రందన ఎర్ర సముద్రంవరకు ప్రతిధ్వనిస్తుంది.
22 దూసుకువచ్చి తనను తన్నుకుపోయే జంతువుపై తిరుగుతూ ఎగిరే గద్దలా యెహోవా ఉంటాడు. బొస్రా నగరంపై తన రెక్కలు విప్పుతున్న గద్దవలె యెహోవా ఉన్నాడు. ఆ సమయంలో ఎదోము సైనికులు మిక్కిలిగా బెదరిపోతారు. ప్రసవ వేదన పడుతున్న స్త్రీవలె వారు భయాందోళనలతో ఆక్రందిస్తారు.
23 ఈ వర్తమానము దమస్కు నగరాన్ని గురించి నది: “హమాతు, అర్పాదు పట్టణాలు భయపడ్డాయి. దుర్వార్త వినటంవల్ల అవి భయపడ్డాయి. వారు అధైర్యపడ్డారు. వారు వ్యాకులపడి బెదిరారు.
24 దమస్కు నగరం బలహీనమయ్యింది. ప్రజలు పారిపోవాలనుకుంటున్నారు. ప్రజలకు దిగులు పట్టుకున్నది. ప్రసవ స్త్రీ లా ప్రజలు బాధ, వేదన అనుభవిస్తున్నారు.
25 “దమస్కు సుఖసంతోషాలున్న ఒక నగరం. ప్రజలింకా ఆ ‘వేడుక నగరాన్ని’ వదిలి పెట్టలేదు.
26 అందువల్ల యువకులు ఆ నగరంలోని కూడలి స్థలాలలో చనిపోతారు. ఆ సమయంలో దాని సైనికులందరూ చంపబడతారు.” సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయారు చెప్పినాడు.
27 “దమస్కు గోడలన్నిటికీ నేను నిప్పు పెడతాను. బెన్హదదు బలమైన కోటలను అది పూర్తిగా కాల్చివేస్తుంది.”
28 ఈ వర్తమానం కేదారు వంశస్తులను గూర్చియు, మరియు హాసోరు పాలకులను గురించినది. బబులోను రాజైన నెబుకద్నెజరు వారిని ఓడించారు. యెహోవా ఇలా చెపుతున్నాడు, “కేదారు వంశీయుల మీదికి మీరు దండెత్తి వెళ్లండి. తూర్పునవున్న ప్రజలను నాశనం చేయండి.
29 వారి గుడారాలు, గొర్రెల మందలు తీసికొని పోబడతాయి. వారి గుడారంతో పాటు వారి వస్తువులన్నీ తీసికొనిపోబడతాయి. వారి శత్రువు ఒంటెలను పట్టుకుపోతాడు. ‘ఎటు చూచినా భయం, భయం’ అని మనుష్యులు కేకలు పెడతారు.
30 త్వరగా పారిపొండి! హాసోరు ప్రజలారా, దాగటానికి మంచి స్థలం చూడండి.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది “నెబుకద్నెజరు నీవు వ్యతిరేకంగా పధకం పన్నాడు. నిన్ను ఓడించటానికి అతడు ఒక తెలివైన పథకాన్ని ఆలోచించాడు.
31 “నిశ్చంతగావున్న దేశం ఒకటున్నది. దాన్ని ఎవ్వరూ ఓడించరని ఆ రాజ్యానికి ధీమా. ఆ దేశ రక్షణకు ద్వారాలుగాని, చుట్టూ కంచెగాని ఏమీ లేవు. వారు ఒంటరిగా నివసిస్తారు. ‘ఆ రాజ్యాన్ని ఎదుర్కోండి!’ అని యెహోవా అంటున్నాడు.
32 వారి ఒంటెలను, విస్తారమైన పశుసంపదను శత్రువు దొంగిలిస్తాడు. శత్రువు వారి పెద్ద మందలను దొంగిలిస్తాడు. చెంపలు కత్తిరించుకునే వారిని భూమి నలుదిక్కులకు పంపివేస్తాను. అన్నివైపుల నుండి వారి మీదికి మహా విపత్తులను తీసికొని వస్తాను.” ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది.
33 “హాసోరు రాజ్యం గుంటనక్కలకు నివాసమవుతుంది. అది శాశ్వతంగా వట్టి ఎడారిగా మారిపోతుంది. అక్కడ మనుష్యులెవ్వరూ నివసించరు. ఆ స్థలంలో ఏ ఒక్కడూ నివాసంచేయడు.”
34 యూదా రాజైన సిద్కియా పరిపాలనారంభంలో, ప్రవక్తయైన యిర్మీయా ఒక సందేశాన్ని యెహోవా నుండి అందుకున్నాడు. ఆ సందేశం ఏలాము దేశానికి సంబంధించినది.
35 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు, “ఏలాము యొక్క ధనుస్సును నేను త్వరలో విరచివేస్తాను. విల్లే ఏలాము యొక్క బలమైన ఆయుధం.
36 నాలుగు ప్రచండ వాయువులను ఏలాము మీదికి రప్పిస్తాను. ఆకాశపు నాలుగు మూలల నుండి వాటిని రప్పిసాను. భూమి మీదకు గాలి వీచే నలుమూలలకు ఏలాము ప్రజలను నేను చెదరగొడతాను. ఏలాము ప్రజలు ప్రతి దేశానికి బందీలుగా కొనిపోబడతారు.
37 వారి శత్రువులు చూస్తూవుండగా ఏలామును తునాతునకలు చేస్తాను. వారిని చంపజూచేవారి సమక్షంలో ఏలామును భయపెడతాను. వారికి మహా విపత్తులను తెచ్చిపెడతాను. నేనెంత కోపంగా ఉన్నానో నేను వారికి చూపిస్తాను.” ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది. “ఏలామును వెంటాడటానికి నేను కత్తిని పంపుతాను. నేను వారందరినీ చంపేవరకు కత్తి వారిని తరుముతుంది.
38 నా సింహాసనం ప్రతిష్ఠించి నేనే అదుపుదారుడనని నిరూపిస్తాను. దాని రాజును, రాజ్యాధికారులను నేను నాశనం చేస్తాను.” ఇదే యెహోవా సందేశం.
39 “కాని ఏలామును వెనక్కు తీసుకొని వచ్చి వారికి మంచి సంభవించేటట్లుగా చేస్తాను.” ఈ సమాచారం యెహోవా నుండి వచ్చినది.

Jeremiah 49:1 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×