Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Isaiah Chapters

Isaiah 44 Verses

Bible Versions

Books

Isaiah Chapters

Isaiah 44 Verses

1 “యాకోబూ నీవు నా సేవకుడవు. నా మాట విను. ఇశ్రాయేలూ నేను నిన్ను ఏర్పాటు చేసుకొన్నాను. నేను చెప్పే సంగతులు విను.
2 నేను యెహోవాను, నేనే నిన్ను సృజించాను. నీవు ఏమై యున్నావో అలా ఉండేందుకు నిన్ను సృజించిన వాడను నేనే. నీవు నీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి నేను నీకు సహాయం చేశాను. యాకోబూ, నా సేవకా, భయపడవద్దు. యెషూరూనూ , నిన్ను నేను ఏర్పాటు చేసుకొన్నాను.
3 “దాహంగా ఉన్న మనుష్యులకు నేనే నీళ్లు పోస్తాను. ఎండిన భూమిమీద నేనే కాలువలను ప్రవహింపజేస్తాను. నీ పిల్లల మీద నేనే నా ఆత్మను కుమ్మరిస్తాను. అది మీ కుటుంబం మీద పొర్లుతున్న ఒక నీటి ప్రవాహంలా ఉంటుంది.
4 వారు ప్రపంచంలో ప్రజల మధ్య ఎదుగుతారు. నీటి కాలువల పక్కగా పెరిగే చెట్లలా ఉంటారు వారు.
5 “ఒక వ్యక్తి అంటాడు, ‘ నేను యెహోవాకు చెందిన వాడను అని, మరోవ్యక్తి ‘యాకోబు’ పేరు చెప్పుకొంటాడు. ఇంకొక వ్యక్తి నేను యెహోవావాడను, అని తన పేరు వ్రాసుకొంటాడు. ఇంకొకరు ‘ఇశ్రాయేలు’ పేరు ప్రయోగిస్తాడు.”
6 యెహోవా ఇశ్రాయేలీయుల రాజు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలును రక్షిస్తాడు. యెహోవా చెబతున్నాడు: “నేను ఒక్కడను మాత్రమే దేవుణ్ణి. ఇంక ఏ దేవుళ్లూ లేరు. నేనే ఆది, అంతము.
7 నావంటి దేవుడు ఇంకొకడు లేడు. అలా ఉంటే, ఆ దేవుడు ఇప్పుడు మాట్లాడాలి. ఆ దేవుడు వచ్చి, తాను నావలె ఉన్నట్టు రుజువు చూపించాలి. శాశ్వతంగా ఉండే ఈ ప్రజలను నేను సృజించినప్పుడు ఏమి జరిగిందో ఆ దేవుడు నాతో చెప్పాలి. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అది అతనికి తెలిసినట్టు చూపించుటకు ఆ దేవుడు సూచనలు ఇవ్వాలి.
8 భయపడవద్దు! దిగులుపడవద్దు! ఏమి జరుగుతుందో అది నేను నీతో ఎల్లప్పుడూ చెప్పలేదా? మీరే నాకు సాక్షులు. నాతోపాటు ఇంకొక దేవుడున్నాడా? ఏ దేవుడూ లేడు. నేను ఒక్కడను మాత్రమే. ఇంకొక దేవుడున్నట్టు నాకు తెలియదు.”
9 కొంత మంది మనుష్యులు విగ్రహాలు (అబద్ధపు దేవుళ్ళు) చేసుకొంటారు. కానీ అవి నిష్ప్రయోజనం. ప్రజలు ఆ విగ్రహాలను ప్రేమిస్తారు. కానీ ఆ విగ్రహాలు నిష్ప్రయోజనం. ఆ మనుష్యులే ఆ విగ్రహాలకు సాక్షులు, కానీ అవి మాట్లాడవు. వారికి ఏమీ తెలియదు. వారు చేసే పనుల విషయం వారు సిగ్గుపడేంత మాత్రం కూడా వారికి తెలియదు.
10 ఈ తప్పుడు దేవుళ్లను ఎవరు చేశారు? పనికిమాలిన ఈ విగ్రహాలను ఎవరు చేశారు?
11 చేతి పనివారు ఆ దేవుళ్లను చేశారు. ఆ పనివాళ్లంతా మనుష్యులే, దేవుళ్లు కారు. ఆ మనుష్యులంతా కలిసి వచ్చి, ఈ విషయాలను చర్చిస్తే, అప్పుడు వాళ్లంతా సిగ్గుపడతారు, భయపడతారు.
12 ఒక పనివాడు వేడి నిప్పుల మీద ఇనుము వేడిచేయటానికి తన పనిముట్లు వాడతాడు. లోహాన్ని కొట్టడానికి ఇతడు తన సుత్తెను ఉపయోగిస్తాడు, అప్పుడు ఆ లోహం ఒక విగ్రహం అవుతుంది. ఈ మనిషి బలమైన తన చేతులను ఉపయోగిస్తాడు. అయితే అతనికి ఆకలి వేసినప్పుడు అతని బలం పోతుంది. అతడు నీళ్లు తాగకపోతే, అతడు బలహీనం అవుతాడు.
13 మరో పనివాడు చెక్కమీద గీతలు గీసేందుకు నూలు వేసి చీర్ణంతో గీతలు గీస్తాడు. అతడు ఎక్కడ కోయాలో ఇది తెలియజేస్తుంది. అప్పుడు అతడు తన ఉలితో చెక్క నుండి విగ్రహాన్ని చెక్కుతాడు. ఆ విగ్రహాన్ని కొలిచేందుకు అతడు కర్కాటం ఉపయోగిస్తాడు. ఈ విధంగా ఆ పనివాడు ఆ చెక్క సరిగ్గా మనిషిలా కనబడేట్టు చేస్తాడు. మరియు ఈ మనిషిని పోలిన విగ్రహం ఇంట్లో కూర్చోవటం తప్ప చేసేది ఏమీ లేదు.
14 ఒకడు దేవదారు, సరళ లేక సింధూర వృక్షాన్ని సరికివేయవచ్చును. (ఆ చెట్లు పెరిగేటట్టు అతడేంచేయలేదు. ఆ చెట్లు అడవిలో వాటి స్వంత శక్తి మూలంగా పెరిగాయి. ఒకడు ఒక తమాల వృక్షాన్ని నాటితే వర్షం దాన్ని పెంచుతుంది.)
15 అప్పుడు అతడు మంట వేసుకొనేందుకు ఆ చెట్టును వాడుకొంటాడు. అతడు ఆ వృక్షాన్ని చిన్న కట్టె ముక్కలుగా నరుకుతాడు. వంట చేసుకొనేందుకు, చలి కాచుకొనేందుకు అతడు ఆ కట్టెలను వాడుకొంటాడు. కొన్ని కట్టెలతో అతడు మంట చేసి, రొట్టె కాల్చుకొంటాడు. అయితే అతడు ఆ కట్టెల్లో ఒక భాగాన్ని దేవునిగా చేయటానికి ఉపయోగిస్తాడు. మరియు ఆ మనిషి ఆ దేవుణ్ణి పూజిస్తాడు. ఆ దేవుడు ఆ మనిషి చేసిన విగ్రహమే కానీ ఆ మనిషి ఆ విగ్రహం ముందు సాష్టాంగపడతాడు.
16 ఆ మనిషి సగం కట్టెలు మంటలో కాలుస్తాడు. అతడు ఆ కట్టెలతో మాంసం వండుకొని, కడుపు నిండే అంతవరకు ఆ మాంసం తింటాడు. అతడు వెచ్చదనం కోసం ఆ కట్టెలను మంట పెడతాడు. “బాగుంది, ఇప్పుడు నాకు వెచ్చగా ఉంది. మంట ద్వారా వెలుగు వస్తుంది గనుక ఇప్పుడు నేను చూడగలను” అని అతడు అంటాడు.
17 అయితే కొంచెం కట్టె మిగిలింది. కనుక అతడు ఆ కట్టెతో ఒక విగ్రహం చేసి, దాన్ని తన దేవుడు అని పిలుస్తాడు. ఈ దేవుని ముందు అతడు సాష్టాంగపడి, దానిని పూజిస్తాడు. అతడు ఆ దేవుని ప్రార్థించి, “నీవే నా దేవుడివి, నన్ను రక్షించు” అంటాడు.
18 ఆ మనుష్యులు ఏమి చేస్తున్నారో వారికే తెలియదు. అది వారు గ్రహించరు. అది వారి కళ్లు మూసుకొనిపోయి, వారు చూడలేనట్టు ఉంటుంది. వారి హృదయాలు (మనసులు) అర్థం చేసుకొనేందుకు ప్రయత్నించవు.
19 ఆ మనుష్యులు ఈ విషయాలను గూర్చి ఆలోచించలేదు. ఆ మనుష్యులు గ్రహించరు గనుక, “సగం కట్టెలు నేనే కాల్చేశాను, నా రొట్టె కాల్చుకొనేందుకు, నా మాంసం వండుకొనేందుకు ఆ నిప్పులు నేను వాడుకొన్నాను. ఆ మాంసం నేను తిన్నాను. మరి మిగిలిన కట్టెను ఉపయోగించి ఈ భయంకరమైన పని చేశాను. నేను ఒక చెక్క ముక్కనే పూజిస్తున్నాను” అని వారి మట్టుకు వారు ఎన్నడూ తలంచలేదు.
20 ఆ మనిషి ఏమి చేస్తున్నాడో అతనికి తెలియదు. అతడు గందరగోళం అయ్యాడు, కనుక అతని హృదయం అతన్ని తప్పు మార్గంలో నడిపించింది. అతడు తనను తాను రక్షించుకోలేడు. అతడు చేస్తున్నది తప్పు అని అతడు చూడలేడు. “నేను పట్టుకొన్న ఈ విగ్రహం అబద్ధపు దేవుడు” అని అతడు చెప్పడు.
21 “యాకోబూ, ఈ విషయాలు జ్ఞాపకం ఉంచుకో. ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడవని జ్ఞాపకం ఉంచుకో. నిన్ను నేను సృజించాను. నీవు నా సేవకుడవు. కనుక ఇశ్రాయేలూ, నన్ను మరచిపోవద్దు.
22 నీ పాపాలు ఒక పెద్ద మేఘంలా ఉండేవి. కాని ఆ పాపాలను నేను తుడిచి వేశాను. గాలిలో అదృశ్యమైన ఒక మేఘంలా నీ పాపాలు పోయాయి. నేను నిన్ను తప్పించి కాపాడాను, కనుక తిరిగి నా దగ్గరకు వచ్చేయి.”
23 యెహోవా గొప్ప కార్యాలు చేశాడు. గనుక ఆకాశాలు ఆనందిస్తున్నాయి. భూమి, దాని అగాధ స్థలాల్లో సహితం సంతోషిస్తుంది. పర్వతాలు దేవునికి వందనాలు చెల్లిస్తూ పాటలు పాడుతున్నాయి. అరణ్యంలో చెట్లన్నీ ఆనందంగా ఉన్నాయి. ఎందుకు? ఎందుకంటే యాకోబును యెహోవా రక్షించాడు గనుక ఇశ్రాయేలుకు యెహోవా గొప్ప కార్యాలు చేశాడు గనుక.
24 నీవు ఏమైయున్నావో అలా నిన్ను యెహోవా చేశాడు. నీవు ఇంకా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే యెహోవా దీనిని చేశాడు. “యెహోవాను, నేనే సమస్తం చేశాను. ఆకాశాలను నేనే అక్కడ ఉంచాను. నేనే భూమిని నా యెదుట పరచాను.” అని యెహోవా చెబతున్నాడు.
25 అబద్ధపు ప్రవక్తలు అబద్ధాలు చెబతారు. అయితే వారి అబద్ధాలు, అబద్ధాలుగా యెహోవా చూపిస్తాడు. మంత్రాలు చేసే మనుష్యులను యెహోవా వెర్రివారిగా చేస్తాడు. జ్ఞానులను గూడ యెహోవా కలవరపెడ్తాడు. వారికి చాలా తెలుసు. అని వారు అనుకొంటున్నారు. కాని వాళ్లు వెర్రివాళ్లలా కనిపించేట్టు యెహోవా చేస్తాడు.
26 ప్రజలకు సందేశాలు అందించేందుకు యెహోవా తన సేవకులను పంపిస్తాడు. ఆ సందేశాలను యెహోవా వాస్తవం చేస్తాడు. ప్రజలు చేయాల్సిన వాటిని గూర్చి వారికి చెప్పడానికి యెహోవా సందేశహరులను పంపిస్తాడు. వారి సలహా మంచిది అని యెహోవా సూచిస్తున్నాడు. “ప్రజలు మరల నీలో నివసిస్తారు” అని యెరూషలేముతో యెహోవా చెబతున్నాడు. “మీరు మరల నిర్మించబడతారు” అని యూదా పట్టణాలతో యెహోవా చెబతున్నాడు. “నేను మరల మిమ్మల్ని పట్టణాలుగా చేస్తాను” అని నాశనం చేయబడిన పట్టణాలతో యెహోవా చెబతున్నాడు.
27 “ఎండిపొండి! మీ కాలువలను నేను ఎండిపోయేట్టు చేస్తాను” అని లోత్తెన జలాలతో యెహోవా చెబతున్నాడు.
28 యెహోవా కోరేషుతో చెబతున్నాడు, “నీవు నా గొర్రెల కాపరివి. నేను కోరిన వాటిని నీవు చేస్తావు. ‘నీవు మరల కట్టబడతావు’ అని యెరూషలేముతో నీవు చెబతావు. ‘నీ పునాదులు మరల నిర్మించబడతాయి”‘ అని నీవు ఆలయంతో చెబతావు.

Isaiah 44:23 Telugu Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×