దేవుడు చెప్పాడు: “పతాకాన్ని బోడి కొండమీద [*కొండమీద బబులోనుమీద అని కూడా చెప్పవచ్చు.] ఎగుర వేయండి. మగ సిపాయిలను పిలువండి. మీ చేతులు ఊపండి. ప్రముఖుల ద్వారాల్లోంచి ప్రవేశించమని వారితో చెప్పండి.”
దేవుడు చెప్పాడు: “వాళ్లను నేను ప్రజల్లో నుండి వేరు చేశాను. నేనే వాళ్లకు సారథ్యం వహిస్తాను.” నేను కోపంగా ఉన్నాను. ప్రజలను శిక్షించటం కోసం నేను నా పరాక్రమవంతుల్ని సమావేశపర్చాను. ఆనంద భరితులైన ఈ మనుష్యులను గూర్చి నేను గర్విస్తున్నాను.
“కొండల్లో పెద్ద శబ్దం అవుతోంది. ఆ శబ్దం వినండి! అది విస్తారమైన ప్రజల శబ్దంలా ఉంది. అనేక రాజ్యాల ప్రజలు కూడుకొంటున్నారు. సర్వశక్తిమంతుడైన యెహోవా తన సైన్యాలను ఒక్కటిగా చేరుస్తున్నాడు.
ఈ సైన్యం, యెహోవా, చాలా దూరదేశంనుండి వస్తున్నారు. ఆకాశపు అంచుల ఆవలినుండి వారు వస్తున్నారు. యెహోవా తన కోపం ప్రదర్శించటానికి ఈ సైన్యాన్ని ఒక ఆయుధంలా వాడుకొంటాడు. ఈ సైన్యం దేశం మొత్తాన్ని నాశనం చేస్తుంది.”
యెహోవా ప్రత్యేక దినం దగ్గర్లో ఉంది. అందు చేత ఏడ్చి, మీ కోసం దుఃఖపడండి. శత్రువు మీ ఐశ్వర్యాలు దొంగిలించే సమయం వస్తుంది. సర్వశక్తిమంతుడైన దేవుడు దానిని సంభవింపజేస్తాడు.
ప్రతి వ్యక్తీ భయపడుతూంటాడు. స్త్రీ ప్రసవవేదనలా, వారి భయం వారికి కడుపులో బాధ పుట్టిస్తుంది. వారి ముఖాలు అగ్నిలా ఎర్రగా మారుతాయి. ఈ భయం చూపులు వారి పొరుగువారందరి ముఖాలమీద కూడా కనబడతాయి గనుక ప్రజలు ఆశ్చర్య పడతారు.
చూడండి, యెహోవా ప్రత్యేక దినం వచ్చేస్తుంది. అది చాలా భయంకర దినం. దేవుడు మహా కోపంతో, దేశాన్ని నాశనం చేస్తాడు. పాపం చేసే వాళ్లందరినీ దేవుడు దేశంలోనుండి బలవంతంగా వెళ్లగొట్టేస్తాడు.
దేవుడు చెబుతున్నాడు, “నేను ప్రపంచానికి కీడు జరిగిస్తాను. చెడ్డవాళ్ల పాపాన్ని బట్టి వాళ్లను నేను శిక్షిస్తాను. గర్విష్ఠుల గర్వం పోయేట్టు నేను చేస్తాను. ఇతరుల యెడల నీచంగా ప్రవర్తించే వారి అతిశయాన్ని నేను నిలిపివేస్తాను.
కొద్దిమంది ప్రజలు మాత్రమే మిగిలి ఉంటారు. బంగారం దొరకటం అరుదులాగే మనుష్యులు కూడ అరుదుగా కొద్ది మంది మాత్రమే ఉంటారు. ఈ మనుష్యులు స్వచ్చమైన బంగారం కంటె ఎక్కువ విలువగలిగి ఉంటారు.
అప్పుడు బబులోను ప్రజలు గాయపడిన జింకల్లా పారిపోతారు. కాపరి లేని గొర్రెల్లా వారు పారిపోతారు. యుద్ధానికి వచ్చే ప్రతి సైనికుడూ వెనుదిరిగి తన స్వదేశానికి, స్వజనుల దగ్గరకు పారిపోతాడు.
దేవుడు చెబుతున్నాడు: “చూడండి, మాదీయసైన్యాలు బబులోను మీద దాడి చేసేట్టు నేను చేస్తాను.” మాదీయ సైన్యాలకు వెండి బంగారాలు చెల్లించినా సరే, వారు దాడి చేయటం ఆపు చేయరు.
బబులోను నాశనం చేయబడుతుంది. అది సొదొమ గొమొర్రాల సర్వనాశనంలా ఉంటుంది. దేవుడు ఈ వినాశం కలుగచేస్తాడు, అక్కడ ఏమీ మిగిలి ఉండదు. “రాజ్యాలన్నింటిలో బబులోను చాలా అందమయింది. బబులోను ప్రజలకు వారి పట్టణం గూర్చి చాలా అతిశయం.
కానీ బబులోను అందంగా ఇక ఉండదు. భవిష్యత్తులో ప్రజలు యికమీదట అక్కడ నివసించరు. అరబ్బులు అక్కడ వారి గుడారాలు వేయరు. గొర్రెలను అక్కడ మేపేందుకు కాపరులు వాటిని అక్కడికి తీసుకొనిరారు.
అక్కడ నివసించే జంతువులు అడవి మృగాలు మాత్రమే. ప్రజలు బబులోనులోని ఇండ్లలో నివసించరు. ఆ ఇండ్ల నిండాగుడ్లగూబలు, పెద్ద పక్షులు ఉంటాయి. అడవి మేక పోతులు ఆ ఇండ్లలో ఆడుతూంటాయి.
బబులోనులోని అందమైన గొప్ప భవనాలలో అడవి కుక్కలు, తోడేళ్లు మొరుగుతూ ఉంటాయి. బబులోను అంతం అయిపోతుంది. బబులోను అంతం దగ్గర్లో ఉంది. బబులోను నాశనాన్ని తర్వాత వరకు వేచి ఉండనివ్వను.”