“కనుక ఆ బానిస స్త్రీని, ఆమె కుమారుణ్ణి బలవంతంగా వెళ్లగొట్టు. మన మరణం తరువాత మన కుమారుడు ఇస్సాకు మన ఆస్తి అంతటికి వారసుడవుతాడు. దానిలో దాసీ కుమారుడు ఇస్సాకుతో భాగం పంచుకోవటం నాకు ఇష్టం లేదు అంటూ” శారా అబ్రాహాముతో చెప్పింది.
కానీ అబ్రాహాముతో దేవుడన్నాడు: “ఆ పిల్లవాణ్ణి గూర్చి నీవు చింతించకు. ఆ బానిస స్త్రీని గూర్చి నీవు చింతపడకు. శారా కోరినట్టే చేయి. ఇస్సాకు మాత్రమే నీకు వారసుడయిన కుమారుడు.
మర్నాడు వేకువనే అబ్రాహాము కొంత భోజనాన్ని, తిత్తిలో నీళ్లు తెచ్చాడు. అబ్రాహాము వీటిని హాగరుకు ఇచ్చాడు. హాగరు వీటిని తీసుకొని, తన కుమారునితో కలసి వెళ్లిపోయింది. హాగరు ఆ చోటు విడిచి బెయేర్షెబా అరణ్యంలో సంచరించింది.
హాగరు కొంచె దూరం నడచి వెళ్లింది. అక్కడ ఆగిపోయి కూర్చుంది. నీళ్లు లేవు గనుక తన కుమారుడు చనిపోతాడనుకొంది హాగరు. వాడు చస్తోంటే చూడటం ఆమెకు ఇష్టం లేదు. ఆమె అక్కడ కూర్చొని ఏడ్వటం మొదలు పెట్టింది.
ఆ పిల్లవాడు ఏడ్వడం దేవుడు విన్నాడు. పరలోకంనుండి దేవుని దూత హాగరును పిలిచాడు. అతడన్నాడు, “హాగరూ, ఏం జరిగింది? భయపడకు. అక్కడ పిల్లవాడు ఏడ్వడం యెహోవా విన్నాడు.
అంతలో హాగరుకు ఒక బావి కనబడేటట్టు చేసాడు దేవుడు. కనుక హాగరు ఆ బావి దగ్గరకు వెళ్లి తన తిత్తిని నీళ్లతో నింపుకొన్నది. తర్వాత పిల్లవాడు తాగటానికి ఆమె నీళ్లు ఇచ్చింది.
అంతట ఆబీమెలెకు, ఫీకోలు అబ్రాహాముతో మాట్లాడారు. అబీమెలెకు, అతని సైన్యాధిపతి ఫికోలు అబ్రాహాముతో ఇలా చెప్పారు: “నీవు చేసే ప్రతి దానిలోను దేవుడు నీతో ఉన్నాడు.
కనుక ఇక్కడ దేవుని యెదుట నాకు ఒక వాగ్దానం చేయాలి. నాతో, నా పిల్లలతో నీవు న్యాయంగా వ్యవహరిస్తావని వాగ్దానం చేయాలి. నీవు నివసించిన ఈ దేశం మీద, నా మీద నీవు దయగలిగి ఉంటానని వాగ్దానం చేయాలి. నీపైన నేను ఎంత దయ చూపెట్టానో, నాపైన నీవు కూడా అంత దయ చూపెడ్తానని వాగ్దానం చేయాలి.”
అప్పుడు అబ్రాహాము అబీమెలెకుతో ఒక ఫిర్యాదు చేసాడు. అబీమెలెకు సేవకులు ఒక మంచి నీటి బావిని స్వాధీనం చేసుకొన్నందుచేత అబ్రాహాము అబీమెలెకుతో ఫిర్యాదు చేసాడు.
ఏడు [*ఏడు ‘ఏడు’ అనే అర్థం ఇచ్చే హీబ్రూ పదం, ‘ప్రమాణం’ లేక ‘ఒప్పందం’ అనే అర్థం ఇచ్చే హీబ్రూ పదం ఒక్కటే. అందుకు ఏడు గొర్రెలు ఈ వాగ్దానానికి రుజువు.] ఆడ గొర్రె పిల్లల్ని కూడా అబీమెలెకు ఎదుట ఉంచాడు అబ్రాహాము.
కనుక ఆ తర్వాత ఆ బావి బెయేర్షెబా [†బెయేర్షెబా “ప్రమాణపు బావి” అని దీని అర్థం.] అని పిలువబడింది. వారిద్దరు ఒకరికి ఒకరు ఆ స్థలంలో వాగ్దానం చేసుకొన్న చోటు గనుక దానికి వారు ఆ పేరు పెట్టారు.
బెయేర్షెబాలో అబ్రాహాము ఒక అలంకారపు చెట్టు [‡అలంకారపు చెట్టు పొడవుగా సన్నగా వెంట్రుకలవలె ఎల్లప్పుడు పచ్చగావుండే ఆకులుగల పొద.] నాటాడు. అప్పుడు అబ్రాహాము ప్రభువు, ఎల్లప్పుడు జీవిస్తున్న దేవుడైన యెహోవాకు అతడు అక్కడ ప్రార్థన చేశాడు.