(1-7) “ఉత్తర సరిహద్దు మధ్యధరా సముద్రం నుండి తూర్పుకు సాగి హెత్లోనుకు, హమాతు కనుమ వరకు వెళ్లి, అక్కడ నుండి హసరేనాను వరకు ఉంది. ఇది దమస్కు (డెమాస్కస్)కు, హమాతుకు సరిహద్దు మీద ఉంది. ఆయా వంశాలకు లభించే భూమి తూర్పునుండి పడమటివరకు వెళుతుంది. ఉత్తరాన్నుండి దక్షిణానికి ఈ ప్రదేశంలో గల తెగలు (గోత్రాలు) ఏవనగా: దాను, ఆషేరు, నఫ్తాలి, మనష్షే, ఏఫ్రాయిము, రూబేను మరియు యూదా.
“మిగిలిన భూభాగం ప్రత్యేక వినియోగాలకు కేటాయించ బడింది. మిగిలిన భాగం యూదా యొక్క భాగానికి దక్షిణాన ఉంది. ఈ ప్రదేశం ఉత్తరాన ఇరవై ఐదువేల మూరల పొడఉంది. మరియు పడమట పది వేల మూరల వెడల్పు, తూర్పున పదివెల మూరల వెడల్పు, దక్షిణాన ఇరవై ఐదువేల మూరల వెడల్పు ఉంటుంది. ఆలయం ఈ విభాగం మధ్యలోవుంటుంది.
ఈ ప్రత్యేక భూ విభాగం యాజకులు, లేవీయుల మధ్య పంచబడుతుంది. “ఈ ప్రదేశంలో యాజకులకు ఒక వంతు వస్తుంది. ఈ భూమి ఉత్తర దిశన ఎనిమిది మైళ్ల ఐదు వందల ఇరవై ఎనిమిది గజాల పొడవు ఉంది. పశ్చిమ దిశన మూడు మైళ్ల ఐదువందల ఇరవై ఎనిమిది గజాల వెడల్పు ఉంది; తూర్పున మూడు మైళ్ల ఐదువందల ఇరవై ఎనిమిది గజాలు; దక్షిణ దిశన ఎనిమిది మైళ్ల ఐదువందల ఇరవై ఎనిమిది గజాల పొడఉంది. యెహోవా ఆలయం ఈ ప్రదేశపు మధ్య భాగంలో ఉంటుంది.
ఈ భూమి సాదోకు సంతతివారికి ఇవ్వ బడుతుంది. ఈ మనుష్యులు నా పవిత్ర యాజకులుగా ఉండటానికి ఎంపిక చేయబడ్డారు. ఎందువల్లననంటే ఇతర ఇశ్రాయేలీయులు నన్ను వదిలిపెట్టినప్పుడు కూడా వీరు నన్ను భక్తి శ్రద్ధలతో కొలిచారు. లేవీయులు చేసినట్లు సాదోకు సంతతి నన్ను విడిచిపెట్టలేదు.
“యాజకుల భూమి ప్రక్కన లేవీయులకు భూమిలో భాగం వుంటుంది. దాని పొడవు ఇరవై ఐదువేల మూరలు వెడల్పు పదివేల మూరలు గలది. వాళ్లు ఈ భూమి యొక్క పూర్తి పొడవు వెడల్పుల వరకూ తీసుకొంటారు-అనగా పొడవు ఇరవై ఐదువేల మూరలు, వెడల్పు ఇరవైవేల మూరలు.
లేవీయులు ఈ భూమిలో ఏ భాగంతోనూ వ్యాపారం చేయకూడదు. వారీ భూమిలో ఏ భాగాన్నీ అమ్మలేరు. దేశంలో ఈ భాగాన్ని వారు విడగొట్టగూడదు. ఎందువల్లనంటే ఈ భామి యెహోవాకు చెందినది. ఇది చాలా ప్రత్యేకమైనది. ఇది దేశంలో మిక్కిలి మంచి భాగం.
“యాజకులకు, లేవీయులకు ఇచ్చిన భూమిని ఆనుకొని ఐదువేల మూరల వెడల్పు, ఇరవై ఐదువేల మూరల పొడవు గల ఒక స్థలం ఉంటుంది. ఈ స్థలం నగరానికి, పశువులు తిరిగి మేయటానికి, ఇండ్లు కట్టటానికి ఉపయోగపడుతుంది. సామాన్య ప్రజలు ఈ స్థలాన్ని వినియోగించుకుంటారు. నగరం దీని మధ్యలో వుంటుంది.
నగర కొలతలు ఇలా ఉన్నాయి, ఉత్తరాన నాలుగువేల ఐదువందల మూరలు, దక్షిణాన నాలుగువేల ఐదవందల మూరలు, తూర్పున నాలుగువేల ఐదువందల మూరలు, పడమట నాలుగువేన ఐదువందల మూరలు.
నగరానికి పచ్చిక బీడులు వుంటాయి. ఈ పచ్చిక బీడులు ఉత్తరాన రెండువందల ఏభై మూరలు, దక్షిణాన రెండువందల ఏభై మూరలు. తూర్పున రెండువందల ఏభై మూరలు, పడమట రెండువందల ఏభై మూరలు కలిగి వుంటాయి.
పవిత్ర ప్రదేశం పొడవు పక్కగా వదిలిన స్థలం తూర్పున పదివేల మూరలు, పడమట పదివేల మూరలు. ఈ స్థలం పవిత్ర ప్రదేశం పక్కన పొడవునా ఉంటుంది. నగర కార్మికులకు ఈ స్థలంలో ఆహార ధాన్యాలు పండుతాయి.
“ఈ ప్రత్యేక భూభాగం నలుదిశలా చదరంగా వుంటుంది. దాని పొడవు వెడల్పులు ఒక్కొక్కటి ఇరవై ఐదువేల మూరలు చొప్పున ఉన్నాయి. దాని ప్రత్యేక అవసరాల కొరకే ఈ భూమిని ఉంచాలి. ఒక భాగం యాజకులకు. ఒక భాగం లేవీయులకు. ఒక భాగం నగరానికి చెంది ఉండవలెను.
(21-22) “ఆ ప్రత్యేక భూమిలో ఒక భాగం దేశపాలకునికి చెందుతుంది. ఆ ప్రత్యేక భూమి నలుదిశలా చదరంగా ఉంది. దాని పొడవు, వెడల్పులు ఒక్కొక్కటి ఇరవై ఐదువేల మూరల చొప్పున ఉన్నాయి. ఈ ప్రత్యేక భూమిలో ఒక భాగం యాజకులకు, ఒక భాగం లేవీయులకు, మరొక భాగం ఆలయానికి చెందుతాయి. ఆలయం ఈ స్థలంలో మధ్యగా వుంటుంది. మిగిలిన భాగం దేశపాలకునికి చెందుతుంది. బెన్యామీనీయుల సరిహద్దుకు, యూదా వారి సరిహద్దుకు మధ్యగావున్న ప్రాంతం రాజ్యాధిపతికి చెంది ఉంటుంది.
(23-27) “ఈ ప్రత్యేక భూమికి దక్షిణంగా వున్న భూమి యొర్దాను నదికి తూర్పున నివసించే తెగల (గోత్రాలు) వారికి చెందుతుంది. తూర్పు సరిహద్దు నుండి మధ్యధరా సముద్రం వరకు ఉన్న భూమిలో ప్రతీ గోత్రం వారికి ఒక భాగం వస్తుంది. ఉత్తరాన్నుండి దక్షిణం వరకు ఈ గోత్రాల వారెవరనగా: బెన్యామీను, షిమ్యోను,ఇశ్శాఖారు, జెబూలూను మరియు గాదు.