అత్యంత పరిమళ భరితమైన తైలాన్ని గబ్బు పట్టించేందుకు చచ్చిన కొద్దిపాటి ఈగలేచాలు. అదే విధంగా, జ్ఞానాన్నీ, గౌరవాన్నీ, మంటగలిపేందుకు కొద్దిపాటి మూర్ఖత్వం చాలు.
యజమాని కేవలం నీపట్ల కోపం ప్రదర్శించినంత మాత్రాన నువ్వు నీ కొలువు వదిలెయ్యబోకు. నువ్వు ప్రశాంతంగా, సాయంగా వుంటే, పెద్ద పెద్ద పొర పాట్లను కూడా నువ్వు సరిదిద్దవచ్చు. [*యజమాని … సరిదిద్దవచ్చు వ్యాఖ్యార్థంలో “పెను పాపాలను సైతం చికిత్సకుడు శమింపజేయగలడు.” ‘చికిత్సకుడు’ అన్న మాటకి క్షమించే స్వభావం కలిగి, ఇతరులకు సహాయ పడేవాడని అర్థం.]
సేవకులుగా ఉండదగినవాళ్లు గుర్రాలపై స్వారీ చేస్తుండగా, అధికారులుగా ఉండదగిన వాళ్లు (వాళ్ల సరసన బానిసల మాదిరిగా) నడుస్తూవుండటం నేను చూశాను. ప్రతి పనికీ, దాని ప్రమాదాలు దానికి వుంటాయి
అయితే, పరిజ్ఞానంవుంటే, ఏ పనైనా సులభతరం అవుతుంది. మొండి కత్తితో కొయ్యడం చాలా కష్టం. అయితే, మనిషి దానికి పదును పెడితే, అప్పుడు పని సులభతరమవుతుంది. (జ్ఞానం అంత సున్నిత మైనది.)
అజ్ఞాని ఎడతెగకుండా (తను చెయ్యబోయే వాటిని గురించి) మాట్లాడతాడు. అయితే, భవిష్యత్తులో ఏమి జరగబోయేది ఎవరికీ తెలియదు. తర్వాత ఏమి జరిగేది. ఏ ఒక్కడికి తెలియదు.
రాజు శిశుప్రాయుడైనా, బానిస అయినా ఆ రాజ్యానికి చాలా చెరుపు జరుగుతుంది. అధికారులు తిండిపోతులై, తమ కాలమంతా భోజన పానాదులతోనే వినియోగించేవాళ్లయితే, ఆ దేశానికి చాలా చెరుపే జరుగుతుంది.
ఒక దేశపు రాజు కులీనుడైతే, ఆ దేశానికి ఎంతో మంచి జరుగుతుంది. [†దేశానికి … జరుగుతుంది అక్షరాలా ‘స్వేచ్ఛాపరుల పుత్రుడైతే’ అంటే ఎన్నడూ బానిస కానివాడు, తన తల్లి తండ్రులు బానిసలుగా కానివాడు.] దేశాధికారులు తిండిపోతులు, తాగుబోతులు కాక, శక్తి పుంజుకు నేందుకు మాత్రమే అన్నపానాలు మితంగా సేవించే వారైతే, ఆ దేశానికి ఎంతో క్షేమం.
రాజును గురించి చెడుగా మాట్లాడకు. రాజును గురించి చెడ్డ ఆలోచనలు కూడా చేయకు. నీ యింట నీవు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ధనికులను గురించి చెడుగా మాట్లాడకు. ఎందుకంటావేమో, గోడలకి చెవులుంటాయి. నువ్వన్న మాటలన్నీ పిట్టలు చేర వేస్తాయి. వాళ్లకి చేరుతాయి.