నేను బోధించిన వాటిని నీవు విన్నావు. వాటిని నేను అనేకుల సమక్షంలో బోధించాను. ఆ ఉపదేశాలను నీవు నమ్మగల వాళ్ళకు, యితరులకు బోధించగల సామర్థ్యము ఉన్న వాళ్ళకు అప్పగించు.
వాళ్ళకు ఈ విషయాలు జ్ఞాపకము చేస్తూ ఉండు. వ్యర్థమైన మాటల్ని గురించి వాదించరాదని దేవుని సమక్షంలో వాళ్ళను వాదించు. అలాంటి వాదనవల్ల ఏ లాభం కలుగదు. పైగా విన్నవాళ్ళను అది పాడుచేస్తుంది.
దేవుని సమక్షంలో ఆయన అంగీకారం పొందే విధంగా నీ శక్తికి తగినట్లు కృషి చేయి. అప్పుడు నీవు చేస్తున్న పనికి సిగ్గు పడనవసరం ఉండదు. సత్యాన్ని సక్రమంగా బోధించు.
అయినా, దేవుడు వేసిన పునాది గట్టిది. దాన్ని ఎవ్వరూ కదల్చలేరు. ఈ పునాదిపై, “తనవాళ్ళెవరో ప్రభువుకు తెలుసు. [✡ఉల్లేఖము: సంఖ్యా. 16:5.] ప్రభువు నామాన్ని అంగీకరించిన ప్రతి ఒక్కడు దుర్మార్గాలు వదిలి వెయ్యాలి” అని వ్రాయబడి ఉంది.
గొప్ప వాళ్ళ యిండ్లలో వెండి, బంగారు వస్తువులే కాక, చెక్కతో మట్టితో చేయబడిన వస్తువులు కూడా ఉంటాయి. కొన్ని ప్రత్యేక సమయాల్లో ఉపయోగించేవి, మరికొన్ని ప్రతిరోజు ఉపయోగించేవి.
దుర్మార్గాలను వదిలినవాణ్ణి దేవుడు ప్రత్యేకమైన కార్యాలకు ఉపయోగిస్తాడు. అలాంటివాడు పవిత్రంగా ఉండి దేవునికి ఉపయోగకరంగా ఉంటాడు. మంచి కార్యాలను చేయటానికి సిద్ధంగా ఉంటాడు.