వితంతువులకు పిల్లలు గాని, పిల్లల పిల్లలు గాని ఉన్నట్లైతే, వాళ్ళు తమ కుటుంబాన్ని పోషించుకోవటం ముఖ్యంగా నేర్చుకోవాలి. ఆ విధంగా తమ మతానికి సంబంధించి కర్తవ్యాలను నిర్వర్తించాలి. అలా చేస్తే తమ తల్లిదండ్రుల ఋణం, తాత ముత్తాతల ఋణం తీర్చుకొన్నట్లవుతుంది. అది దేవునికి సంతృప్తి కలుగ చేస్తుంది.
అంతేకాక, సత్కార్యాలు చేసే స్త్రీయని ఆమెకు మంచి పేరుండాలి. పిల్లల్ని సక్రమంగా పెంచటం, అతిథి సత్కార్యాలు చెయ్యటం, పవిత్రుల కాళ్ళు కడగటం, కష్టాల్లో ఉన్న వారికి సహాయం చెయ్యటంలాంటి గుణాలు ఆమెలో ఉండాలి. తన జీవితాన్ని యిలాంటి మంచి పనులు చెయ్యటానికి అంకితం చేసిన స్త్రీగా ఉండాలి.
పిన్న వయస్సుగల వితంతువుల్ని ఈ జాబితాలో చేర్చవద్దు. వాళ్ళ వాంఛలు క్రీస్తు పట్ల వాళ్ళకున్న భక్తిని మించిపోయినప్పుడు, వాళ్ళు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకొంటారు.
పైగా వాళ్ళు వ్యర్థంగా కాలయాపన చెయ్యటానికి, ఇంటింటికి తిరగటానికి అలవాటు పడిపోతారు. వాళ్ళిలా కాలాయాపన చెయ్యటమే కాకుండా కబర్లకు, యితర్ల విషయాల్లో జోక్యం కలిగించుకోవటానికి అలవాటుపడ్తారు. వాళ్ళకు మౌనంగా ఉండటం చేతకాదు.
అందువల్ల పిన్న వయస్సులో ఉన్న వితంతువులు పెళ్ళి చేసుకొని పిల్లల్ని కని, తమ యిండ్లను చూసుకోవాలి. ఇది నా సలహా. అప్పుడు వాళ్ళను నిందించడానికి యితర్లకు ఆస్కారము ఉండదు.
””క్రీస్తును విశ్వసించే స్త్రీ, [*క్రీస్తును … స్త్రీ లేక పురుషుడు.] తన కుటుంబంలో వితంతువులున్నట్లైతే, వాళ్ళకు సహాయం చేయాలి. సంఘంపై ఆ భారం వేయరాదు. అప్పుడు క్రీస్తు సంఘం నిజంగా ఆసరాలేని వితంతువులకు సహాయం చేయకల్గుతుంది.
నేను దేవుని సమక్షంలో, యేసు క్రీస్తు సమక్షంలో, దేవుడు ఎన్నుకొన్న దేవదూతల సమక్షంలో ఆజ్ఞాపిస్తున్నాను. ఒకని పక్షం వహించి మరొకని పట్ల వ్యతిరేకంగా ఉండవద్దు. నిష్పక్షపాతంగా ఈ ఆజ్ఞల్ని అమలులో పెట్టు. ఏది పక్షపాతంతో చెయ్యవద్దు.