ఇశ్రాయేలు ప్రజల పేర్లన్నీ వారి వారి వంశ చరిత్రల్లో పొందుపర్చబడ్డాయి. ఆ వంశ చరిత్రలన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో చేర్చబడ్డాయి. యూదా ప్రజలు బందీలుగా పట్టుబడి బలవంతంగా బబలోనుకు తీసుకొని పోబడ్డారు. దేవునికి వారు విశ్వాసపాత్రులు కానందువల్ల వారికి అలా జరిగింది.
మరియు హిల్కీయా కుమారుడైన అజర్యా. మెషుల్లాము కుమారుడు హిల్కీయా. సాదోకు కుమారుడు మెషుల్లాము. మెరాయోతు కుమారుడు సాదోకు. అహీటూబు కుమారుడు మెరాయోతు. ఆలయ నిర్వహణలో అహీటూబు ముఖ్యమైన అధికారి.
యెరోహాము కుమారుడు అదాయా అనువాడొకడున్నాడు. యెరోహాము తండ్రి పేరు పసూరు. పసూరు తండ్రి పేరు మల్కీయా. అదీయేలు కుమారుడు మశై అను వాడొకడున్నాడు. అదీయేలు తండ్రి పేరు యహజేరా. యహజేరా తండ్రి పేరు మెషుల్లాము. మెషుల్లాము తండ్రి పేరు మెషిల్లేమీతు. మెషిల్లేమీతు తండ్రి పేరు ఇమ్మెరు.
యెరూషలేములో నివసించిన లేవీ గోత్రపు వారెవరనగా: హష్షూబు కుమారుడు షెమయా. హష్షూబు తండ్రి పేరు అజీక్రాము. అజీక్రాము తండ్రి పేరు హషబ్యా. హషబ్యా మెరారీ సంతతి వాడు.
ఓబద్యా తండ్రి పేరు షెమయా. షెమయా తండ్రి గాలాలు. గాలాలు తండ్రి యెదూతూను, మరియు ఆసా కుమారుడు బెరక్యా. ఆసా తండ్రి పేరు ఎల్కానా. నెటోపాతీయులు నివసించిన గ్రామాలలోనే ఎల్కానా కూడ నివసించాడు.
షల్లూము తండ్రి పేరు కోరే. కోరే తండ్రి ఎబ్యాసాపు. ఎబ్యాసాపు తండ్రి కోరహు. షల్లూము, అతని సోదరులు ద్వారపాలకులే. వారు కోరహు వంశం వారు. పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాయటం వారిపని. వారి పూర్వీకులు [*పూర్వీకులు బైబిల్లో ఇక్కడ పూర్వీకులు అనగా వారి తండ్రులు, తాతలు, ముత్తాతలు అని అర్థం.] చేసిన విధంగానే వీరుకూడ ఆ పని నిర్వర్తించారు. వారి పూర్వీకులు పవిత్ర గుడారపు ద్వారాన్ని కాపలా కాస్తూ వుండేవారు.
పవిత్ర గుడారం ద్వారపాలకులుగా మొత్తం రెండు వందల పన్నెండు మంది ఎంపిక చేయబడ్డారు. వారి గ్రామాలలో వారి కుటుంబ చరిత్రలలో వారి పేర్లన్నీ వ్రాయబడినాయి. దావీదు, ప్రవక్తయగు సమూయేలు వారిని ఎంపికచేశారు. ఎందువల్లననగా వారు మిక్కిలి నమ్మకస్తులు.
పరిసర గ్రామాలలో నివసించే ఈ ద్వారా పాలకుల బంధువులు అప్పుడప్పుడు వచ్చి వారికి సహాయపడేవారు. వచ్చినప్పుడల్లా వారు ద్వారపాలకులకు ఏడేసి రోజులు సహాయంగా ఉండేవారు.
దేవాలయ ఆరాధనలో వాడే పనిముట్ల విషయమై శ్రద్ధ తీసుకొనే ద్వారపాలకులు కొందరున్నారు. ఆ వస్తుసామగ్రిని లోనికి తెచ్చినప్పుడు వారు లెక్కపెట్టేవారు. మళ్లీ వాటిని బయటకు తీసుకొని వెళ్లేటప్పుడు కూడ లెక్క పెట్టేవారు.
మరికొందరు ద్వారపాలకులు గర్భగుడిలో సామాన్లు, ఉపకరణాల విషయంలో శ్రద్ధ తీసుకోవటం కోసం ఎంపికచేయబడ్డారు. పిండి, ద్రాక్షారసం, నూనె, ధూపద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాల సరఫరా విషయంలో కూడ వారు తగిన శ్రద్ధ తీసుకొనేవారు.
లేవీయులలో దేవాలయ గాయకులుగా వున్న వారు, వారి కుటుంబ పెద్దలు దేవాలయపు గదులలో నివసించేవారు. వారు రాత్రింబవళ్లు దేవాలయ పనిలో నిమగ్నమై వుండుటచేత మరొక పని చేసేవారు కాదు.