తోలా కుమారులు ఉజ్జీ, రెఫాయా, యెరీయేలు, యహ్మయి, యిబ్శాము, షెమూయేలు అనేవారు. వారంతా వారి వారి కుటుంబ పెద్దలు. వారు, వారి సంతతివారు వీర సైనికులు. దావీదు రాజుగా ఉన్న కాలంలో వీరి సంఖ్య ఇరవై రెండువేల ఆరువందలు.
వారి వంశ చరిత్ర పరిశీలిస్తే వారిలో ముప్పది ఆరువేల మంది యుద్ధ సన్నద్ధులైన సైనికులున్నట్లు తెలుస్తుంది. వారికి బహు భార్యలు వున్నందువల్ల వారికి సంతానం ఎక్కువై కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నాయి.
బెలకు ఐదుగురు కుమారులు. ఎస్బోను, ఉజ్జీ, ఉజ్జీయేలు, యెరీమోతు మరియు ఈరీ అని వారి పేర్లు. వారి కుటుంబాలకు వారు పెద్దలు. వారిలో ఇరవై రెండువేల రెండువందల మంది సైనికులున్నట్లు వారివంశ చరిత్ర తెలుపుతుంది.
మనష్షే సంతతివారు ఎవరనగా: మనష్షే కుమారుని పేరు అశ్రీయేలు. మనష్షే దాసియగు అరాము (సిరియా) దేశపు స్త్రీకి అశ్రీయేలు జన్మించాడు. ఆమెకు మాకీరు అనే మరొక కుమారుడు కలిగాడు. మాకీరు కుమారుడు గిలాదు.
హుప్పీయుల, షుప్పీయుల నుండి ఒక స్త్రీని మాకీరు వివాహం చేసుకొన్నాడు. ఆమె పేరు మయకా. మాకీరు సోదరి పేరు కూడ మయకా. ఈ సోదరి మయకాకుసెలో పెహాదు అని మరో పేరు వుంది. సెలోపెహాదుకు అందరూ కుమార్తెలే.
ఎలాదా కుమారుడు తాహతు. తాహతు కుమారుడు జాబాదు. జాబాదు కుమారుడు షూతలహు. గాతు నగర నివాసులు కొందరు ఏజెరెను, ఎల్యాదును చంపివేసారు. ఏజెరు, ఎల్యాదులిద్దరూ గాతు ప్రజల ఆవులను, గొర్రెలను దొంగిలించటానికి వెళ్లిన కారణంగా వారిని ప్రజలు చంపివేసారు.
ఎజెరు, ఎల్యాదు లిరువురూ ఎఫ్రాయిము కుమారులే. ఏజెరు, ఎల్యాదు చనిపోయినందుకు ఎఫ్రాయిము చాలా రోజులు దుఃఖించాడు. ఎఫ్రాయిము బంధువులంతా వచ్చి అతనిని ఓదార్చారు.
పిమ్మట ఎఫ్రాయిము తన భార్యతో కలియగా ఆమె గర్భవతి అయ్యింది. ఆమె ఒక కుమారుని కన్నది. ఎఫ్రాయిము అతనికి బెరీయా [†బెరీయా ఇది హెబ్రీ మాటలాంటిది దీని అర్థం ‘చెడు’ లేదా ‘కష్టము.’] అని పేరు పెట్టాడు. ఎందువల్లననగా అతని కుటుంబానికి అప్పుడు కొంత కీడు జరిగింది.
ఎఫ్రాయిము సంతతి వారు నివసించిన నగరాలు, ప్రదేశాలు ఏవనగా: బేతేలు, దాని పరిసర గ్రామాలు; తూర్పున నహరాను, పడమట గెజెరు, దాని సమీప గ్రామాలు; షెకెము, దాని పరిసర గ్రామాలు మరియు అయ్యా వరకుగల గ్రామాలు.
మనష్షే రాజ్య సరిహద్దుల్లో బేత్షెయాను, తానాకు, మెగిద్దో, దోరు పట్టణాలు మరియు వాటి పరిసర గ్రామాలు వున్నాయి. ఈ పట్టణాలలో యోసేపు సంతతి వారు నివసించారు. యోసేపు తండ్రి పేరు ఇశ్రాయేలు.
వీరంతా ఆషేరు సంతతివారు. వారివారి కుటుంబాలకు వారు పెద్దలు. వారు పేరుగాంచిన వ్యక్తులు, యుద్ధవీరులు, మహా నాయకులు. వారి వంశచరిత్ర ప్రకారం వారిలో యుద్ధానికి పనికివచ్చే ఇరవై ఆరువేల మంది సైనికులున్నారు.